Share News

భోగాపురానికి మహర్దశ

ABN , Publish Date - May 22 , 2026 | 11:32 PM

భోగాపురం ఎయిర్‌పోర్టు త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుండడంతో అదే వేగంతో పరిశ్రమలు క్యూ కడుతున్నాయి.

 భోగాపురానికి మహర్దశ
పోలిపల్లి వద్ద కేటాయించిన స్థలం ఇదే

-ఐటీ, దాని అనుబంధ పరిశ్రమల రాక

-రిలయన్స్‌ డేటా సెంటర్‌కు 858 ఎకరాలు

- రూ.లక్షా 8వేల కోట్లతో ఏర్పాటు

భోగాపురం, మే 22 (ఆంధ్రజ్యోతి): భోగాపురం ఎయిర్‌పోర్టు త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుండడంతో అదే వేగంతో పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు విశాఖ నగరానికి పక్కనే ఉండడం, అనువైన జాతీయ రహదారి, త్వరలో నిర్మాణం కానున్న బీచ్‌ కారిడార్‌ తదితర కారణాలతో ఈ ప్రాంతంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. దీంతో అనుబంధ పరిశ్రమలు, ఐటీ సంస్థలు వెల్లువలా వస్తున్నాయి. భోగాపురం మండలం పోలిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 14 నుంచి 20, 313 నుంచి 350 వరకు ఉన్న సుమారు 358.7 ఎకరాలతో పాటు భోగాపురం ఈస్ట్‌ పరిధిలో ఉన్న సుమారు 500 ఎకరాలను రిలయన్స్‌ సంస్థకు కేటాయించినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో రిలయన్స్‌ సుమారు రూ.లక్షా 8వేల కోట్లతో కేబుల్‌ ల్యాడింగ్‌ స్టేషన్‌తో కూడిన డేటా సెంటర్‌ (ఏఐడీసీ) ఏర్పాటుకు ప్రభుత్వం జీవో రూపంలో అంగీకరించినట్లు సమాచారం. ఇందుకోసం దాదాపు రూ.19వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. రిలయన్స్‌ డేటా సెంటర్‌కు అవసరమైన 853.97 ఎకరాల భూమిని 25శాతం రాయితీతో అందిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ మాదిరిగా జిల్లాలో భారీ డేటా సెంటర్‌ ఏర్పాటుకు రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ సంస్థ చురుగ్గా ఏర్పాట్లు చేస్తుంది. ఈడేటా సెంటర్‌ను రెండు దశల్లో పూర్తి చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి దశ 2028కి, రెండో దశ 2030కి పూర్తి చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. 1.5 గిగా వాట్ల ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌తో పాటు క్యాప్టిక్‌ సోలార్‌ బ్యాటరీ స్టోరేజీ వ్యవస్థ కూడా ఉంటుందని సమాచారం. దీనికి ఇటీవల రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ ఆమోదించింది. గిగావాట్‌కు మించి ఏర్పాటు చేసే ఏఐ డేటా సెంటర్‌కు క్లస్టర్‌ కోసం రిలియన్స్‌ సంస్థ 935 ఎకరాలు కోరినట్టు తెలుస్తోంది. డేటా సెంటర్‌ మొత్తం ప్రక్రియ 2030కి పూర్తి కానుంది. ప్రస్తుతం పోలిపల్లి, భోగాపురం ప్రాంతాలకు అధికారుల తాకిడి అధికంగా ఉంది. డేటా సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి అనువైన భూముల వివరాలను స్థానిక రెవెన్యూ జిల్లాకు పంపించగా అక్కడ తుది మెరుగులు దిద్దుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా భోగాపురంలో భారీ పెట్టుబడులతో భారీ డేటా సెంటర్‌ ఏర్పాటు కానుంది. భోగాపురం చుట్టు పక్కల ప్రాంతాల్లో డేటా సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన స్థల మంజూరుకు పరిశీలన జరుగుతుందని, ఎక్కడ ఏర్పాటు చేయనున్నారని పూర్తిగా నిర్ధారణ కావలసి ఉందని అధికార యత్రాంగం చెబుతుంది. కాగా, ఓపక్క ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చాలామంది ఆనందపడుతుంటే, మరోపక్క వీటివల్ల భూములు కోల్పోతున్నామని రైతులు మదన పడుతున్నారు.

Updated Date - May 22 , 2026 | 11:32 PM