‘మహామాయ’ కార్మికుల ధర్నా
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:27 AM
మండలంలోని ఆర్జీపేట వద్ద గల మహామాయ కంపెనీ ఎదుట కార్మికులు శనివారం ఉదయం మెరుపు ధర్నాకు దిగారు.
లక్కవరపుకోట, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆర్జీపేట వద్ద గల మహామాయ కంపెనీ ఎదుట కార్మికులు శనివారం ఉదయం మెరుపు ధర్నాకు దిగారు. సుమారు రెండు వందలకుపైగా ఆడ, మగ కార్మికు లు గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. షిప్ట్ డ్యూటీవా ళ్లను అడ్డుకుని స్తంభింపజేశారు. కార్మికులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి యాజమాన్యం మోసం చేసిందని వారంతా వాపోయారు. రూ.500ల కూలని చెప్పి రూ.300లే ఇస్తున్నారని మండిపడ్డారు. ఆరు నెలల కిందట ఇదే విషయంపై ధర్నా చేస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పి చేతులెత్తేశారని వారంతా పేర్కొన్నారు. ఎక్కడ నుంచో వచ్చిన పొరుగు రాష్ట్రాల కార్మికులకు వేలల్లో జీతాలని లోకల్ వాళ్లకు వందల్లో జీతాలని మండిపడ్డారు. స్కిల్డ్ వర్కర్స్‌కు కూడా కనీసం పది వేలు జీతం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికులతో ఎండీ చర్చలు
కార్మికుల ధర్నా విషయం తెలుసుకున్న ఎండీ అగర్వాల్ సాయంత్రం రంగ ప్రవేశం చేసి కార్మికులను చర్చలకు ఆహ్వానించారు. కార్మికులకు రోజుకు రూ.400 వేతనం ఇవ్వడానికి, కార్మిక చట్టాలు అమలు చేయడానికి, స్కిల్ ప్రకారం జీతాలు ఇవ్వడానికి ఎండీ అంగీకరించారు.