Share News

మాయా‘జలం’

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:03 PM

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగ్గుమంటున్నాడు.

     మాయా‘జలం’
అపరిశుభ్రంగా ఉన్న వాటర్‌ క్యాన్లు

- జిల్లాలో జోరుగా మంచినీటి వ్యాపారం

- నాణ్యత ప్రమాణాలు హుళక్కే

- కొరవడిన అధికారుల పర్యవేక్షణ

- పుట్టగొడుగుల్లా వాటర్‌ ప్లాంట్లు

- ప్రజారోగ్యంతో ఆటలు

రాజాంరూరల్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. దీంతో ప్రజలు దాహం తీర్చుకునేందుకు వాటర్‌ ప్యాకెట్లు, జూస్‌లు తాగుతున్నారు. అయితే, ప్రజల తాగునీటి అవసరాలను కొందరు వ్యాపారులు తమ ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. అధికారుల అనుమతులు లేకుండానే వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. మినరల్‌ వాటర్‌ పేరుతో జనరల్‌ వాటర్‌ను అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారు. దాహం తీర్చుకునేందుకు ఆ నీటిని తాగితే జబ్బు కొనితెచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. పరిశుభ్రత లేని నీరు తాగితే సుమారు 15 రకాల వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

పుట్టగొడుగుల్లా ప్లాంట్లు

జిల్లాలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఆర్వో ప్లాంట్లను విచ్చలవిడిగా కొందరు ఏర్పాటు చేస్తున్నారు. గృహ అవసరాల కోసమని బోర్లు ఏర్పాటు చేసుకొని వాటి నుంచి నీటిని ప్యూరిఫైయర్‌ ద్వారా శుద్ధి చేసి ట్యాంకర్లకు పంపుతున్నారు. కొందరు నేరుగా బోరు నీటినే క్యాన్లు, బాటిళ్లు, ప్యాకెట్లకు నింపుతున్నారు. మార్కెట్‌లో లీటర్‌ వాటర్‌ బాటిల్‌ రూ.20, ప్లాంట్లలో 20 లీటర్ల క్యాన్‌ రూ.20, కూలింగ్‌ వాటర్‌ క్యాన్‌ రూ.40కి విక్రయిస్తున్నారు. బాటిళ్లు, క్యాన్లకు అందమైన స్టిక్కర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గృహస్తులతో పాటు వర్తక, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవర్గాలు సైతం ఈ ప్లాస్టిక్‌ డబ్బాల్లోని నీటినే కొనుగోలు చేసి తాగుతున్నారు. తాము తాగుతున్న నీరు మంచిదేనా.. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారైందో లేదో తెలుసుకోవ డం లేదు. ఆ నీటిని తాగుతూ రోగాలబారిన పడుతున్నారు. జిల్లాలో సుమారు 200 వరకూ ప్లాంటు ఉన్నాయి. వీటిలో అన్నిశాఖల అనుమతులతో నిర్వహణ సాగిస్తున్నవి 50కి మించి లేవు. నీటి ప్యాకెట్లు, క్యాన్ల మీద.. నీటి తయారు తేదీ, బ్యాచ్‌ నెంబర్‌, బెస్ట్‌ బిఫోర్‌ వంటివేవీ కనిపించవు. ప్రధానంగా వాటర్‌ క్యాన్లలో నేరుగా 20 లీటర్లు నీరుపోసి అవసరమైనవారికి సరఫరా చేస్తున్నారు. వాటర్‌ క్యాన్లు సైతం అపరిశుభ్రంగా ఉంటున్నాయి. జిల్లాలో నెలకు రూ.25 కోట్ల మేర వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా. వాటర్‌ ప్లాంట్ల నిర్వాహకులు నిబంధనలు పాటించపోయినా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

అనుమతులు లేకుండానే..

వాటర్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలంటే ముందుగా ఆహార కల్తీ నిరోధకశాఖ, జిల్లా వైద్యఆరోగ్యశాఖ, సేల్స్‌టాక్స్‌, జిల్లా పరిశ్రమలశాఖ, ఐఎస్‌ఐ వంటి ప్రభుత్వ శాఖలతో పాటు నీటిప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్న పరిధిని బట్టి పంచాయతీ, నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ల అధికారుల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలి. ప్రాథమిక అనుమతి కోసమే రూ.3లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం రూ.89వేలు కట్టి రెన్యూవల్‌ చేసుకోవాలి. ప్రతి కేంద్రంలోనూ నీటి పరీక్షల కోసం మైక్రో బయాలజీ, కెమిస్ట్రీ ల్యాబ్‌లు, ఏసీ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ నిబంధనలన్నీ పాటించి వాటర్‌ ప్లాంట్‌ చేయాలంటే రూ.30లక్షలకు పైగా ఖర్చవుతుంది. కానీ ప్రమాణాలు పాటించకుండా ఎక్కువ మంది రూ.5 నుంచి 7 లక్షలు మాత్రమే వెచ్చించి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు.

దగ్గు, గొంతునొప్పి వస్తుంది..

నాణ్యతలేని నీటిని తాగడం వల్ల గొంతునొప్పి, జలుబు, దగ్గు, టాన్సిల్స్‌ తదితర వ్యాధులు సోకుతాయి. నీటిని వేడిచేసి చల్లార్చి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతోమేలు. వీలుకాని సమయాల్లో ప్యాకెట్లకు బదులు బ్రాండెడ్‌ కంపెనీల నీటిని తీసుకుంటే మంచిది.

-డాక్టర్‌ పీఎల్‌ఎన్‌ రాజు, ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌, రాజాం

Updated Date - Mar 22 , 2026 | 11:03 PM