Share News

ank Account Emptied! ఆశ చూపి.. ఖాతా ఖాళీ చేసి!

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:09 AM

Lured with False Promise… Bank Account Emptied! జిల్లాలో ఎంతో మంది సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బును పోగొట్టుకుం టున్నారు. ఒక్క సాలూరు రూరల్‌ పరిధిలోనే సైబర్‌ మోసాలకు సంబంధించి గతేడాది ఆరు కేసులు నమోదయ్యాయి. అత్యాశతో కొందరు.. ఈ తరహా మోసాలపై అవగాహన లేక మరికొందరు ఇలా సైబర్‌ నేరగాళ్లకు చిక్కి.. లక్షలాది రుపాయలు పోగొట్టుకుంటున్నారు.

 ank Account Emptied! ఆశ చూపి.. ఖాతా ఖాళీ చేసి!

  • లబోదిబోమంటున్న బాధితులు

  • బ్యాంకులదే బాధ్యత అని సుప్రీం తీర్పు

  • ఆ మోసాల కట్టడి సాధ్యమేనా?

సాలూరు రూరల్‌, మార్చి 11(ఆంధ్రజ్యోతి):

- మక్కువ మండలం పాయకపాడుకు చెందిన బీసీ శేఖర్‌ అనే వ్యక్తి ఇటీవల తన ఫోన్‌కు వచ్చిన ఓ గూగుల్‌ లింక్‌ నొక్కారు. ఇందులో పెట్టుబడి పెడితే పెద్దమొత్తంలో లాభమని అటువైపు వారు నమ్మబలికారు. దీంతో ఆయన తొలుత రూ.3000 పెట్టారు. కొద్ది రోజుల్లో అది రెండింతలైంది. ఇలా రెండు, మూడుసార్లు లాభాలు రావడంతో మొత్తంగా రూ. 8,03,316 వరకు పెట్టారు. అంతే ఆ తర్వాత అవతలి ఫోన్‌ స్విచ్ఛాప్‌ అయింది. మోసపోయానని గ్రహించిన ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

- ఓ వీడియో కాల్‌లో మాట్లాడుతుండగా.. అవతలి వారు పంపిన లింక్‌ నొక్కడంతో సాలూరు మండలం కందులపథం గ్రామానికి చెందిన పీఆర్‌ బాబు రూ.3,05,600 పోగొ ట్టుకున్నారు. క్షణాల్లోనే సైబర్‌ నేరగాళ్లు ఆయన ఖాతా నుంచి డబ్బు మొత్తం దోచేశారు. మోసపో యానని గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఇదే విధంగా మక్కువ మండలం మార్కొండపుట్టికి చెందిన చందు గూగుల్‌ లింక్‌ నొక్కి రూ. 2,80,000 పోగొట్టుకున్నారు.

- పాచిపెంట మండలం గురువునాయుడుపేటకు చెందిన ఈబీ ప్రసాద్‌ ఐసీఐసీఐ మోటా పేరిట వచ్చిన లింక్‌ను నొక్కి.. రూ. 2,00,995 పోగొట్టుకున్నారు.

ఇలా వారే కాదు.. జిల్లాలో ఎంతో మంది సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బును పోగొట్టుకుం టున్నారు. ఒక్క సాలూరు రూరల్‌ పరిధిలోనే సైబర్‌ మోసాలకు సంబంధించి గతేడాది ఆరు కేసులు నమోదయ్యాయి. అత్యాశతో కొందరు.. ఈ తరహా మోసాలపై అవగాహన లేక మరికొందరు ఇలా సైబర్‌ నేరగాళ్లకు చిక్కి.. లక్షలాది రుపాయలు పోగొట్టుకుంటున్నారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా.. ఏదోఒక విధంగా ఇంకొంతమంది సైబర్‌ మోసాలకు గురువతున్నారు.

సైబర్‌ నేరగాళ్లు కూడా రోజురోజుకూ వినూత్న పద్ధతులు పాటిస్తూ.. ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఉద్యోగాలు, వివాహాలు, డిజిటల్‌ అరెస్ట్‌ తదితర పేర్లతో నిలువుగా ప్రజలను దోచుకుంటున్నారు. పెట్టుబుడులు, ఆన్‌లైన్‌ లావాదేవీలు, ఆధార్‌, పాన్‌, ఏపీకే ఫైల్‌, బ్యాంకు ఖాతా పేరుతో బురిడీ కొట్టిస్తున్నారు. క్రెడిట్‌కార్డ్‌, ఈకేవైసీ లింక్‌, ఓటీపీ, ఫోన్‌కాల్స్‌, మ్యాట్రీమొని, ఈ మెయిల్స్‌, ఇన్‌కంటాక్స్‌, ఈడీ, సీబీఐ, సీఐడీ పేర్లుతో బెదిరింపు తదితర మార్గాల ద్వారా ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. గంటల వ్యవధిలోనే వారు లక్షలాది రూపాయలను దోపిడీ చేస్తున్నారు. అయితే రికవరీ శాతం మాత్రం చాలా తక్కువగానే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే.. కేవలం 2 శాతం లోపు రికవరీ జరగ్గా, మరో 12 శాతం మొత్తం బ్యాంకుల్లో నగదును స్తంభింపజేసినట్టు సమాచారం.

సైబర్‌ నేరగాళ్ల బారిన పడి మోసపోయిన బాధితులకు ఊరట కలిగించేలా ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తరహా నేరాల కట్టడికి ప్రధానంగా బ్యాంకులే బాధ్యత వహించాలని ఆదేశించింది. సైబర్‌ వలలో పడి ఖాతాలో డబ్బులు పోగొట్టుకున్న వారు మూడ్రోజుల్లో ఫిర్యాదు చేస్తే.. బ్యాంకులే పరిహారం చెల్లించాలని తేల్చి చెప్పింది. అయితే ఇది ఎంతవరకు అమలవుతుందో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు ప్రజలు కూడా సైబర్‌ మోసగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ‘సైబర్‌ నేరగాళ్ల నుంచి వచ్చే ప్రలోభాలు , బెదిరింపులకు తలొగ్గరాదు. అత్యాశకు పోతే డబ్బులు పోవడం ఖాయం. ఫోన్లకు వచ్చే లింక్‌, నోటిఫికేషన్లు నొక్కరాదు. ఈ విషయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. సైబర్‌ మోసమని గుర్తించిన వెంటనే 1930కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలి. సమీప పోలీసులకు సమాచారమివ్వాలి.’ అని సాలూరు రూరల్‌ సీఐ పి.రామకృష్ణ తెలిపారు.

Updated Date - Mar 12 , 2026 | 12:09 AM