Municipalities పురాల్లో తగ్గిన పోలింగ్
ABN , Publish Date - Nov 02 , 2026 | 11:32 PM
Low Voter Turnout in Municipalities గత స్థానిక సంస్థ ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో తాజాగా జరిగిన పురపోరులో ఓటింగ్ శాతం తగ్గింది. పట్టణ ఓటర్లు ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి కనబరచలేదని పోలింగ్ తీరును బట్టి తెలుస్తోంది.
వార్డుల విభజన, వలస ఓటర్లు రాకపోవడమే కారణమా?
ఓటింగ్ తగ్గడంపై సర్వత్రా విస్తృత చర్చ
పార్వతీపురం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): గత స్థానిక సంస్థ ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో తాజాగా జరిగిన పురపోరులో ఓటింగ్ శాతం తగ్గింది. పట్టణ ఓటర్లు ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి కనబరచలేదని పోలింగ్ తీరును బట్టి తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో జిల్లాలో సగటు పోలింగ్ 72.72 శాతం ఉండగా.. తాజా ఎన్నికల్లో ఓటింగ్ శాతం 68.04గా నమోదైంది. మొత్తంగా గత ఎన్నికలతో పోలిస్తే.. 4.68 శాతం మేర ఓటింగ్ తక్కువగా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
పార్వతీపురంలో ఇలా..
ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్వతీపురం పురపాలక సంఘంలో 74.46 శాతం మేర పోలింగ్ జరిగింది. తాజాగా 68.84 శాతం ఓటింగ్ నమోదైంది. అంటే సుమారు ఆరు శాతం పైబడి ఓటింగ్ శాతం తగ్గిందని గణాంకాలు చెబు తున్నాయి. అప్పట్లో పార్వతీపురంలో 30 వార్డులు ఉండేవి. ఓటర్లు 30,230 మంది ఉండగా.. 22,509, ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం పార్వతీపురంలో వార్డుల సంఖ్య 36కి చేరగా.. 40,765 మంది ఓటర్లు ఉన్నారు. ఆదివారం జరిగిన పుర పోలింగ్‌లో 28,064 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో పురుషులు 13,224 మంది, మహిళలు 14,840 మంది ఓటు వేశారు.
జిల్లాకేంద్రంలో జనాభా పెరిగినా..
పార్వతీపురం టౌన్: గత ఎన్నికలతో పోలిస్తే.. జిల్లాకేంద్రంలో జనాభా పెరిగింది. అయినప్పటికీ ఓటింగ్ శాతం తగ్గడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. పార్వతీపురం పట్టణానికి వలస వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నా.. వారిని ఓటర్లుగా నమోదు చేయించడం లేదు. మరోవైపు పట్టణ శివారు కాలనీల్లో ఉన్న ఓటర్లు ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదు వంటి నగరాల్లో ఉంటున్నారు. ఇక వార్డుల విభజన వల్ల కుటుంబ సభ్యుల్లో ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉండడం తదితర కారణాలతో పోలింగ్ శాతం తగ్గిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సాలూరులో ..
గత స్థానిక ఎన్నికల సమయానికి సాలూరులో 29 వార్డులు ఉండేవి. 29,202 మంది ఓటర్లు ఉండేవారు. అప్పట్లో 28,386 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పట్లో 72.71 శాతం మేర పోలింగ్ నమోదైంది. తాజా పరిస్థితిని చూస్తే.. సాలూరులో 32 వార్డుల్లో మొత్తం ఓటర్లు 41934 మంది ఉన్నారు. 27,526 మంది ఓటు వేశారు. వారిలో పురుషులు 12,878, మహిళలు 14,647, ఇతరులు ఒకరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 65.64 శాతం మేర ఓటింగ్ నమోదైంది. మొత్తంగా గతంతో పోలిస్తే ఏడు శాతం పైబడి పోలింగ్ తగ్గింది.
పాలకొండలో..
గతంలో పాలకొండ నగర పంచాయతీలో 20 వార్డులు ఉండేవి. 19,621 ఓటర్లు ఉండేవారు. 14,918 ఓట్లు పోలయ్యాయి. సుమారు 71 శాతం ఓటింగ్ జరిగింది. తాజా ఎన్నికల్లో చూస్తే.. వార్డుల సంఖ్య 28కి చేరింది. ప్రస్తుతం 23,466 మంది ఓటర్లు ఉండగా వారిలో 12,012 మంది మహిళలు, 11,453 మంది పురుషులు, ఇతరులు ఒకరు ఉన్నారు. 16,344 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 69.65 శాతం మేర ఓటింగ్ జరిగింది. వారిలో మహిళలు 8,487 మంది, పురుషులు 7,857 మంది ఓటు వేశారు. గత ఎన్నికలతో పోల్చితే 1.35 శాతం మేర ఓటింగ్ తగ్గింది.