Share News

Welfare Schemes అరకొర జీతం.. పథకాలకు దూరం

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:57 PM

Low Salaries, No Access to Welfare Schemes గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయం ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగు లకు శాపంగా మారింది. వారిని సంక్షేమ పథకాలకు దూరం చేసింది. అరకొర వేతనాలతో కుటుం బాలను నెట్టుకొస్తున్న చిరు ఉద్యోగులకు తీరని అన్యాయం చేసింది.

  Welfare Schemes అరకొర జీతం..  పథకాలకు దూరం

  • నాడు ఆప్కాస్‌లో చేర్చి పథకాల్లో కోత

  • ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిరుద్యోగులు

  • అర్హులైన కుటుంబ సభ్యులకు తప్పని అవస్థలు

  • రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరు కాని వైనం

  • వర్తించని ఉచిత వైద్యసేవా పథకాలు

  • కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

పార్వతీపురం, ఆగస్టు3(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయం ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగు లకు శాపంగా మారింది. వారిని సంక్షేమ పథకాలకు దూరం చేసింది. అరకొర వేతనాలతో కుటుం బాలను నెట్టుకొస్తున్న చిరు ఉద్యోగులకు తీరని అన్యాయం చేసింది. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 1,522 మందికి పైబడి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో ఆఫీస్‌ సబార్డినేటర్లకు నెలకు రూ.12 వేలు, మరి కొంతమంది ఉద్యోగులకు రూ.17 వేల నుంచి రూ.18 వేల లోపు జీతం అందుతుంది. అయితే వారితో పాటు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. దీంతో విద్య, వైద్యంతో పాటు అన్ని రకాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ పరిస్థితి..

వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం అన్ని శాఖల్లో ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్సింగ్‌ (ఆప్కాస్‌)ను ఏర్పాటు చేసి ఔట్‌ సౌర్సింగ్‌ సిబ్బందిని అందులో మార్పు చేసింది. సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జీతాలు చెల్లించేది. అయితే రూ.10 వేలు వేతనం దాటిన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు కట్‌ చేసింది. రేషన్‌ కార్డులను కూడా రద్దు చేసింది. దీంతో జిల్లాలోని పలు శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఆర్థికంగా నానా అవస్థలు పడుతున్నారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించలేక.. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

- గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్‌ వైద్యసేవా పథకం వంటివి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వర్తించడం లేదు. దీంతో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందితే అప్పులు చేసి బిల్లులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఒక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కాళ్లకు ఆపరేషన్‌ చేయాలి ఉందని వైద్యులు చెప్పారు. ఇందుకోసం ఆ చిరుద్యోగి కుటుంబం రూ. ఐదు లక్షల వరకు చెల్లించాల్సి వచ్చింది. అదేవిధంగా జిల్లాలోని ఒక మోడల్‌ స్కూల్‌లో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేసే ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగి తన భార్య ప్రసవం కోసం ఇటీవల ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఎన్టీఆర్‌ వైద్య సేవా పథకం వర్తించదని అక్కడి సిబ్బంది చెప్పడంతో మొత్తం బిల్లును చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

- ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వితంతవులు లేదా వృద్ధులు ఎవరున్నా సామాజిక పింఛను మంజూరు కావడం లేదు. రేషన్‌ కార్డులు వంటి వాటిని కూడా పొందలేక పోతున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకం, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వదనం పథకం వంటివి కూడా వర్తించడం లేదు. ఈ నేపథ్యంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కూటమి సర్కారుపై ఆశలు పెట్టుకున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

పింఛన్‌కు దూరమయ్యా..

గతంలో నాకు వితంతువు పింఛను అందేది. అయితే నా కొడుకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి కావడంతో వైసీపీ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. మాలాంటి వారికి పింఛను అందించే విధంగా కూటమి సర్కారు చర్యలు తీసుకోవాలి.

- జయమ్మ, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి తల్లి

============================

పథకాలు వర్తించకపోవడం బాధాకరం..

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అరకొర జీతాలతో పనిచేస్తున్నారు. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోవడం బాధాకరం. చిరుద్యోగుల కుటుంబంలో అర్హులైన వృద్ధులకు సామాజిక పింఛను కూడా మంజూరు కావడం లేదు. దీనిపై ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలి.

- జీవీఆర్‌ఎస్‌ కిషోర్‌, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం

Updated Date - Aug 03 , 2026 | 11:57 PM