Share News

Love won... but.. ప్రేమ గెలిచింది.. విధి ఓడించింది

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:41 AM

Love won... but.. అరచేతికి పూసిన పసుపు ఇంకా వదల్లేదు. మెడలో కట్టిన తాళిబొట్టు తడి ఇంకా ఆరలేదు. పెళ్లిపందిరిలో విరిసిన నవ్వుల గుభాళింపులు ఆ ఇంట్లో ఇంకా ముగిసిపోనేలేదు.

Love won... but.. ప్రేమ గెలిచింది.. విధి ఓడించింది
నారాయణరావు(ఫైల్‌)

ప్రేమ గెలిచింది.. విధి ఓడించింది

రోడ్డు ప్రమాదంలో నవ వరుడి మృతి

చెట్టును బైక్‌ బలంగా ఢీకొని ప్రమాదం

పెళ్లయిన వారం రోజులకే ఘోరం

కె.రామచంద్రాపురంలో విషాదం

అరచేతికి పూసిన పసుపు ఇంకా వదల్లేదు. మెడలో కట్టిన తాళిబొట్టు తడి ఇంకా ఆరలేదు. పెళ్లిపందిరిలో విరిసిన నవ్వుల గుభాళింపులు ఆ ఇంట్లో ఇంకా ముగిసిపోనేలేదు. ప్రేమించుకుని పెద్దల ఆశీస్సులతో ఒక్కటైన ఆ నవ దంపతుల మురిపెం వారం రోజులకే ముగిసిపోయింది. ‘పని ముగించుకుని త్వరగా వచ్చేస్తా’ అని చెప్పి వెళ్లిన భర్త రాకకోసం ఎదురు చూస్తున్న ఆ నవవధువుకు పిడుగులాంటి వార్త అందింది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం నర్సన్నపేట సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన బైక్‌ ప్రమాదం ఒక పచ్చని సంసారంలో కోలుకోలేని విషాదాన్ని నింపింది.

పొందూరు/సంతకవిటి, సెప్టెంబరు 5(ఆంధజ్యోతి): సంతకవిటి మండలం కె.రామచంద్రాపురం (కొత్తూరు) గ్రామానికి చెందిన కోసూరు గణేష్‌, దుర్గల కుమారుడు నారాయణరావు అలియాస్‌ పవన్‌(21) శనివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. నారాయణరావు ఇంటర్‌ వరకూ చదువుకున్నాడు. కుమ్మరి పని, ఇటుకల తయారీ చేస్తూ జీవనం సాగించేవాడు. అదే గ్రామానికి చెందిన యువతి, నారాయణరావు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి గత నెల 30న పెళ్లి చేసుకున్నారు. నవ దంపతులిద్దరూ భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా రాపాకలో బంధువుల పెళ్లి నిమిత్తం తన మేనల్లుడు జగదీష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో స్వగ్రామం తిరిగొస్తుండగా.. పొందూరు మండలం నర్సాపురం దాటిన తరువాత మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పింది. రోడ్డుపక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. దీంతో నారాయణరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మేనల్లుడు జగదీష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అంబులెన్స్‌ ద్వారా జగదీష్‌ను శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. పొందూరు ఎస్‌ఐ రాజేష్‌, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాజేష్‌ తెలిపారు.

ఫ బంధువుల పెళ్లి వేడుకకు వెళ్లిన తమ కుమారుడు నారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలిసి.. తల్లిదండ్రులు గణేష్‌, దుర్గ, భార్య, చెల్లెలు భోరున విలపించారు. తమకు దిక్కెవరంటూ రోదించారు. భర్త రాకకోసం ఎదురు చూస్తున్న నవవధువు.. ఇక అతను తిరిగిరాడని తెలిసి విలపిస్తూ.. కుప్పకూలిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, రామచంద్రాపురం గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

Updated Date - Sep 06 , 2026 | 12:41 AM