Share News

Love Animals, But Stay Safe! జంతు ప్రేమ.. జాగ్రత్త సుమా!

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:32 AM

Love Animals, But Stay Safe! మనుషులతో కలిసిపోతాయి. విశ్వాసంతో ఉంటాయి. పిలిస్తే పలుకుతాయి. మనం బాధపడితే అవి కూడా నీరసపడతాయి. అందుకే ఆత్మీయ నేస్తాలయ్యాయి. అవే మన పెంపుడు జంతువులు. వాటి పెంపకాన్ని ఎంతగా ఇష్టపడతామో.. సంరక్షణ, వాటి నుంచి మన ఆరోగ్య రక్షణా కీలకమే.

Love Animals, But Stay Safe! జంతు ప్రేమ..  జాగ్రత్త సుమా!

  • పెంపుడు జంతువుల నుంచి పొంచి ఉన్న వ్యాధులు

  • విధిగా టీకాలు వేయాలి

  • నేడు వరల్డ్‌ జూనోసిస్‌ డే

పార్వతీపురం/కురుపాం,జూలై5(ఆంధ్రజ్యోతి): మనుషులతో కలిసిపోతాయి. విశ్వాసంతో ఉంటాయి. పిలిస్తే పలుకుతాయి. మనం బాధపడితే అవి కూడా నీరసపడతాయి. అందుకే ఆత్మీయ నేస్తాలయ్యాయి. అవే మన పెంపుడు జంతువులు. వాటి పెంపకాన్ని ఎంతగా ఇష్టపడతామో.. సంరక్షణ, వాటి నుంచి మన ఆరోగ్య రక్షణా కీలకమే. దీని గుర్తించిన ప్రభుత్వాలు ఈ ప్రత్యేక రోజున పెంపుడు జంతువులకు టీకాలు వేస్తుంటాయి. సోమవారం వరల్డ్‌ జూనోసిస్‌ డే (జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల నివారణ దినం) సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

చాలామంది కుక్కలు, పిల్లులు, రకరకాల పక్షులను పెంచుతుంటారు. వాటిని కన్న పిల్లలతో సమానంగా కంటికి రెప్పలా చూసుకుంటుంటారు. అవి కూడా అంతకు మించిన ప్రేమను పంచుతుంటాయి. అయితే జంతువులు, పక్షుల పెంపకంలో జాగ్రత్తలు అవసరమని పశువైద్యులు సూచిస్తున్నారు. లేదంటే వాటి నుంచి కొన్ని వ్యాధులు మనుషులకు సంక్రమిస్తాయని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 1547 వరకూ పెంపుడు కుక్కలు ఉన్నాయి. అయితే, వీటి పెంపకంలో జాగ్రత్తలు తీసుకోకపోతే వాటి నుంచి మనుషులకు సుమారు 280 వ్యాధులు సంక్రమిస్తాయని అధ్యయనాలు తేల్చాయి. కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు అని పశువైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా వైరస్‌ ద్వారా రేబిస్‌, మెదడు వాపు, గాలికుంటు, స్వైన్‌ఫ్లూ, బర్డ్‌ఫ్లూ, ఇన్‌ఫ్లుయంజా, బ్యాక్టీరియా వల్ల క్షయ, సాల్మోనెల్లోసిస్‌, ఆంథ్రాక్స్‌, బ్రూ సెల్లోసిస్‌, లెఫ్టో స్పైరోసిస్‌, లిస్టీరియోసిస్‌, పరాన్న జీవుల ద్వారా అమీబియాసిస్‌, సార్కోసిస్టోసిస్‌, టీనియాసిస్‌, హైడాటిడోసిస్‌, గజ్జి, అస్కారియాసిస్‌ వ్యాధులు సంక్రమిస్తాయి. వాటి వల్ల మరణించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. అందుకే పెంపుడు కుక్కలు, పిల్లులు ఇతర జంతువులకు తప్పకుండా యాంటీ రేబిస్‌ టీకాలు వేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా జంతువులను తాకిన తర్వాత, వాటికి ఆహారం పెట్టిన తర్వాత, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఏదైనా జంతువు కరిచినా లేదా వింతగా ప్రవర్తించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. పెంపుడు కుక్కలు బయటకు తీసుకుళ్లే క్రమంలో వీధికుక్కలు కరవకుండా చూసుకోవాలి. చాలామంది వ్యాక్సినేషన్‌పై అవగాహన ఉండదు. ఈ విషయంలో నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు.

నేడు ఉచితంగా యాంటీ రేబిస్‌ టీకాలు

నేడువరల్డ్‌ జూనోసిస్‌ డే సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పశువైద్య ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా యాంటీ రేబిస్‌ టీకా వేస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జంతువులు, పర్యావరణం , మసుషుల ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. కాబట్టి ‘వన్‌ హెల్త్‌’ విధానాన్ని అవలంబించాలి. జంతువుల నుంచి వచ్చే వ్యాధుల పై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. పెంపుడు జంతువులు, పక్షులను శాస్త్రీయ పద్ధతుల్లో, అవగాహనతో పెంచాలి.

- దీనకుమార్‌, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి

Updated Date - Jul 06 , 2026 | 12:32 AM