Share News

Loss of Rs 190 crore రూ.190 కోట్ల నష్టం

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:20 AM

Loss of Rs 190 crore అర్నాబ్‌ తుఫాన్‌ ప్రభావం జిల్లాపై భారీగానే పడింది. సెప్టెంబరు 22 నుంచి 26 వరకూ కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహించాయి. నాగావళి, సువర్ణముఖి, వేగావతి నదులు ఉప్పొంగాయి. 22 మండలాల పరిధిలోని 115 గ్రామాల్లో ప్రభావం చూపినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఎక్కువ నష్టం రాజాం నియోజకవర్గంలో నమోదైంది.

Loss of Rs 190 crore రూ.190 కోట్ల నష్టం
వంగర మండలం అరసాడ వద్ద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన రహదారి

రూ.190 కోట్ల నష్టం

22 మండలాలు 115 గ్రామాల్లో తుఫాన్‌ ప్రభావం

అన్నిశాఖలకు కలిపి రూ.190 కోట్లకు పైగా నష్టం

268 కిలోమీటర్ల రోడ్లు ధ్వంసం

తక్షణ మరమ్మతులకు అధికారుల ప్రతిపాదనలు

విజయనగరం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): అర్నాబ్‌ తుఫాన్‌ ప్రభావం జిల్లాపై భారీగానే పడింది. సెప్టెంబరు 22 నుంచి 26 వరకూ కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహించాయి. నాగావళి, సువర్ణముఖి, వేగావతి నదులు ఉప్పొంగాయి. 22 మండలాల పరిధిలోని 115 గ్రామాల్లో ప్రభావం చూపినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఎక్కువ నష్టం రాజాం నియోజకవర్గంలో నమోదైంది.

అర్నాబ్‌ ప్రభావంతో జిల్లాలో రూ.190 కోట్లకుపైగా నష్టం జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ శాఖలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖతో పాటు వాణిజ్య పంటలకూ నష్టం కలిగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 268 కిలోమీటర్ల పరిధిలో రహదారులు దెబ్బతిన్నట్టు అధికారులు చెబుతున్నారు. వాటి ఽశాశ్వత పనులకు రూ.117 కోట్లు ఖర్చువుతుంది. తాత్కాలిక మరమ్మతులకు రూ.15 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. జిల్లా వ్యాప్తంగా కాజ్‌వేలు 8 కొట్టుకుపోయాయి. సంతకవిటి, వంగర, రేగిడి, బొండపల్లి, గజపతినగరం తదితర మండలాల్లో రోడ్లపై వరద నీరు ప్రవహించింది. వంగర, సంతకవిటి మండలాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పంచాయతీ రోడ్లు కూడా కొన్నిచోట్ల దెబ్బతిన్నాయి. రాజాం నియోజకవర్గం పరిధిలోని మూడు మండలాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. మత్యశాఖకు సంబంధించి రూ 6.23 లక్షల నష్టం వాటిల్లింది. జిల్లా వైధ్యఆరోగ్య శాఖ భవనాలు, ప్రహరీలు పాక్షికంగా దెబ్బతినటంతో రూ.14 లక్షల నష్టం వాటిల్లింది. వ్యవసాయం, ఉద్యాన పంటలకు సంబంధించి 545 హెక్టార్లలో నష్టం వాటిల్లింది. 23 ఇళ్లు పాక్షింగా దెబ్బతిన్నాయి. ఎవరికీ ప్రాణహాని కలగలేదు.

విద్యుత్‌ శాఖకు నష్టం..

విద్యుత్‌ శాఖకు రూ.36 లక్షలు నష్టం వాటిల్లినట్టు ట్రాన్స్‌కో ఎస్‌ఈ లక్ష్మణరావు తెలిపారు. ప్రధానంగా 202 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. యుద్ధప్రాతిపదికన వాటిని ఏర్పాటుచేశారు. 32 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. పలుచోట్ల చెట్లు పడిపోవడంతో విద్యుత్‌ లైన్లు తెగిపోయాయి.

ఆ మూడు మండలాల్లో ఎక్కువ

తుఫాను ప్రధానంగా రాజాం నియోజకవర్గంపై అధిక ప్రభావం చూపింది. వంగర, రేగిడి, సంతకవిటి మండలాల్లో ప్రధాన శాఖలకు రూ.25 కోట్ల నష్టం జరిగిందని అధికారులు నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించారు. మొక్కజొన్న 60, అరటి 22 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. చెరువులు దెబ్బతిన్నాయి. వంగర మండలం కింజంగి, ఆర్‌ఆర్‌ కాలనీ కాలనీ మధ్యలో చౌదరి చెరువు గట్టు 35 కిలోమీటర్ల మేర కొట్టుకుపోయింది. భారీ గండి ఏర్పడడంతో ఆ సాగునీరు వేగావతి నదిలో కలిసిపోయింది. నీలయ్యవలస వద్ద నీలచెరువుకు గండిపడింది. సంతకవిటి మండలం జావాం-ఎంఆర్‌ అగ్రహారం మధ్య రోడ్డు కొట్టుకుపోయింది. రూ.68 లక్షలతో చేపడుతున్న నిర్మాణం దాదాపు కొలిక్కి వస్తున్న తరుణంలో కొట్టుకుపోవడంతో తీవ్ర నష్టం జరిగినట్టయింది. వంగర మండలం అరసాడ సమీపంలో సుబ్బి చెరువు పొంగి ప్రవహించడంతో ప్రధాన రహదారి కల్వర్టు కొట్టుకుపోయింది. సంతకవిటి, రేగిడి మండలాల పరిధిలో సాయన్నగెడ్డ ఛానల్‌ కొట్టుకుపోయింది. గత కొన్నేళ్లుగా ఆధునికీకరణకు నోచుకోక రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Updated Date - Oct 08 , 2026 | 12:20 AM