Share News

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:16 AM

మండలంలోని కంటకాపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లే రైల్వే అండర్‌ బ్రిడ్జి కింద శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మొయ్యి శ్రీను(55) మృతిచెందారు.

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి

కొత్తవలస, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కంటకాపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లే రైల్వే అండర్‌ బ్రిడ్జి కింద శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మొయ్యి శ్రీను(55) మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. లక్కవరపుకోట మండలం రెల్లిగౌరమ్మపేట వద్ద ఉన్న మహామాయ కర్మాగారానికి జమ్మాదేవిపేట గ్రామానికి చెందిన మొయ్యి శ్రీను.. శనివారం కంటకాపల్లి రైల్వేస్టేషన్‌లోని బొగ్గు యార్డు నుంచి లారీపై బొగ్గు తీసుకువెళ్తున్నారు. అయితే లారీలోని బొగ్గు కిందపడకుండా టార్పాలిన్‌ కప్పేందుకుగాను అండర్‌బ్రిడ్జి కింద లారీని నిలుపుదల చేశారు. టార్పాలిన్‌ కప్పుతున్న సమయంలో మరో లారీ వచ్చి ఢీకొట్టి.. అతని తలపై నుంచి వెళ్లిపోయింది. దీంతో శ్రీను అక్కడిక క్కడే మృతిచెందారు. మృతుడికి నాగమణి అనే భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, రెండో కుమార్తె దివ్యాంగురాలు. మూడో కుమార్తె డిగ్రీ చదువుతోంది. మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహామాయ కర్మాగార యాజమాన్యం నష్ట పరిహారం ఇచ్చేవరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి తీయనివ్వమని ఆందోళన చేశారు. దీంతో ఎస్‌ఐ జోగారావు, పోలీసు సిబ్బంది మృతుని బంధువులు, గ్రామస్థులతో చర్చలు జరిపారు. మృతుని కుటుంబానికి కనీసం రూ.5లక్షలు ఇవ్వాలని బంధువులు డిమాండ్‌ చేశారు. మృతుని భార్య నాగమణి నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ జోగారావు తెలిపారు.

Updated Date - Mar 15 , 2026 | 12:16 AM