Share News

రథంపై జగన్నాథుడు

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:28 PM

జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవంలో భాగంగా గురువారం తొలి రథయాత్ర విజయనగరంలో వైభవంగా సాగింది. ఉదయం ఆయా ఆలయాల్లో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రథంపై జగన్నాథుడు
దాసన్నపేటలో జగన్నాథస్వామి రథం వద్ద భక్తుల బారులు

  • రథంపై జగన్నాథుడు

  • వైభవంగా తొలి రథయాత్ర

  • స్వామి దర్శనానికి బారులుతీరిన భక్తులు

  • ఈనెల 24న మారు ర థయాత్ర

విజయనగరం కల్చరల్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): జగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవంలో భాగంగా గురువారం తొలి రథయాత్ర విజయనగరంలో వైభవంగా సాగింది. ఉదయం ఆయా ఆలయాల్లో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవదాయఽ శాఖ పరిధిలోని సంతపేట, దాసన్నపేట జగన్నాథస్వామి ఆలయాల్లో స్వామికి సుప్రభాతసేవ, అర్చన, నైవేద్యం, నీరాజనం, మంగళశాసనం అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఆపై మేళతాళాలతో స్వామి రథారోహణ తంతు చేపట్టారు. రక్షా బంధనం అనంతరం తొలి రథయాత్ర ప్రారంభమైంది. దాసన్నపేటలో స్వామిని రథంలో నవాబుపేట కూడలి వరకు తరలించి అక్కడ భక్తులకు దర్శనం కల్పించారు. సంతపేట ఆలయం నుంచి కూడా స్వామిని రథంతో కన్యకాపరమేశ్వరి ఆలయం వరకూ తోడ్కొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనం కల్పించారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ జగన్నాథుడి దర్శనానికి భక్తులు బారులుతీరారు. ప్రత్యేక క్యూలో భక్తులను రథంపైకి పంపిస్తూ స్వామి వారి దర్శన అవకాశం కల్పిస్తున్నారు.

దాసన్నపేట ఆలయ అర్చకుడు రామకృష్ణాచార్యులు భక్తుల గోత్రనామాలు చెప్పి, తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. బలభద్రస్వామి, జగన్నాథస్వామి, సుభద్రాదేవిని భక్తులు దర్శించుకుని తన్మయత్వం పొందారు. నవాబుపేటలో రాత్రి పది గంటల వరకూ స్వామి దర్శనాలు కొనసాగాయి. అనంతరం స్వామిని గుండిచా మందిరానికి తోడ్కొని వెళ్లారు. అక్కడ ఈ నెల 23 వరకూ భక్తులకు దర్శనం కల్పించి 24న ఉదయం 10.30 గంటలకు మళ్లీ నవాబుపేట తీసుకువచ్చి మారు రథయాత్రను నిర్వహించనున్నారు. సంతపేటలో కూడా తోమాల మందిరం నుంచి మారు రథయాత్ర రోజున కన్యకాపరమేశ్వరీ ఆలయం జంక్షన్‌కు స్వామిని తీసుకువెళ్తారు.

దర్శించుకున్న ఎమ్మెల్యే అదితి

దాసన్నపేటలోని జగన్నాథస్వామిని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు గురువారం ఉదయం దర్శించుకున్నారు. తొలి రథం కదిలే ముందు ఆమె ఆలయానికి చేరుకున్నారు. దేవదాయశాఖ సహాయ కమిషనర్‌ శిరీష ఆధ్వర్యంలో ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగన్నాథ స్వామిని రథంలోకి తోడ్కొని వెళ్లే ప్రక్రియలో ఎమ్మెల్యే భాగస్వాములయ్యారు. ఈమె వెంట మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ప్రసాదుల కనకమహాలక్ష్మీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 08:59 AM