Share News

Long Wait for Ration రేషన్‌ కోసం పడిగాపులు

ABN , Publish Date - Jun 11 , 2026 | 12:28 AM

Long Wait for Ration Supplies గిరి శిఖర గ్రామాల్లో గిరిజనులకు రేషన్‌ కష్టాలు మొదలయ్యాయి. ఇటీవల కొన్ని డీఆర్‌ డిపోలను ఆఫ్‌లైన్‌ నుంచి ఆన్‌లైన్‌లోకి మార్చడమే ఇందుకు కారణం. సిగ్నల్స్‌ లేకపోవడంతో గిరిపుత్రులు నానా అవస్థలు పడుతున్నారు.

Long Wait for Ration రేషన్‌ కోసం పడిగాపులు
సరుకుల కోసం టీకే జమ్ము డీఆర్‌ డిపో వద్ద నిరీక్షిస్తున్న గిరిజనులు

  • కొన్ని డీఆర్‌ డిపోలను ఆన్‌లైన్‌లోకి మార్పు

  • సిగ్నల్స్‌ అందక అగచాట్లు

  • ఆఫ్‌లైన్‌లోనే సరుకులు పంపిణీ చేయాలని విన్నపం

జియ్యమ్మవలస, జూన్‌10(ఆంధ్రజ్యోతి): గిరి శిఖర గ్రామాల్లో గిరిజనులకు రేషన్‌ కష్టాలు మొదలయ్యాయి. ఇటీవల కొన్ని డీఆర్‌ డిపోలను ఆఫ్‌లైన్‌ నుంచి ఆన్‌లైన్‌లోకి మార్చడమే ఇందుకు కారణం. సిగ్నల్స్‌ లేకపోవడంతో గిరిపుత్రులు నానా అవస్థలు పడుతున్నారు. డీఆర్‌ డిపోనకు మూడు, నాలుగు కీలోమీటర్ల దూరంలో సిగ్నల్‌ ఉన్న ప్రదేశానికి చేరుకుని సరుకులు పొందాల్సి వస్తోంది. ఒక్కోసారి మండుటెండలో రేషన్‌ కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది.

ఇదీ పరిస్థితి..

- పార్వతీపురం డివిజన్‌ పరిధిలో మొత్తం 101 డీఆర్‌ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 59,219 రేషన్‌కార్డులు ఉన్నాయి. అయితే అత్యధిక డీఆర్‌ డిపోల్లో ఆన్‌లైన్‌ ద్వారా గిరిజనులకు సరుకులు అందిస్తున్నారు. మిగిలిన డీఆర్‌ డిపోలలో ఆఫ్‌లైన్‌లోనే అంటే సేల్స్‌మెన్ల ద్వారా గిరిజనులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. అయితే ఇటీవల ఆఫ్‌లైన్‌లో ఉన్న షాపులలో కొన్ని సివిల్‌ సప్లయిస్‌ శాఖ ఆన్‌లైన్‌లోకి మార్చేసింది. దీంతో గిరిజనులు సరుకుల కోసం గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వస్తోంది. మరోవైపు సిగ్నల్స్‌ అందక సరుకులు ఇచ్చేందుకు సేల్స్‌మెన్లు కూడా నానా తంటాలు పడుతున్నారు.

- జియ్యమ్మవలస మండలంలో పీటీ మండ, టీకే జమ్ము, ఆర్‌ఆర్‌బీ పురం, వనజ గ్రామాల్లో డీఆర్‌ డిపోలు ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం 32 గిరిజన గ్రామాలకు నిత్యావసర సరుకులు అందుతున్నాయి. పీటీ మండ, ఆర్‌ఆర్‌బీ పురం, వనజ గ్రామాల్లో ఉన్న డీఆర్‌ డిపోలు ఆన్‌లైన్‌లో కొనసాగుతున్నాయి. అయితే ఇటీవల టీకే జమ్ము డీఆర్‌ డిపోను కూడా ఆఫ్‌లైన్‌ నుంచి ఆన్‌లైన్‌లోకి మార్చారు. అయితే సిగ్నల్స్‌ అందకపోవడంతో గిరిజనులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఈ డిపో పరిధిలో టీకే జమ్ము, కూటం, పాండ్రసింగి, గోర్లి, గోర్లివలస, కోడిపిల్లగూడ, చినదోడిజ, పెదదోడిజ గ్రామాలకు చెందిన 589 రేషన్‌కార్డులు ఉన్నాయి. వారికి నిత్యాసర సరుకులు ఇవ్వడానికి నాలుగు కిలో మీటర్లు దూరంలో ఉన్న ఘాట్‌ రోడ్డు వద్ద సిగ్నల్‌ ప్రదేశంలోకి వచ్చి కార్డుదారులతో వేలి ముద్రలు వేయాల్సిన పరిస్థితి. అదీ కూడా ఎప్పుడు సిగ్నల్స్‌ ఉంటుందో, ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి. దీంతో సిగ్నల్స్‌ కోసం మండుటెండలో గిరిజనులు నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లాలో చాలాచోట్ల ఆఫ్‌లైన్‌ నుంచి ఆన్‌లైన్‌ చేసిన డీఆర్‌ డిపోలలో ఇలాంటి పరిస్థితే నెలకొంది. దీనిపై సివిల్‌ సప్లైస్‌ ఉన్నతాధికారులు స్పందించాలని గిరిజనులు కోరుతున్నారు.

నా దృష్టికి వచ్చింది

టీకే జమ్ము డీఆర్‌ డిపోలో సిగ్నల్స్‌ లేక గిరిజనులు ఇబ్బంది పడుతున్నారనే విషయం అక్కడి గిరిజనుల నుంచే నాకు సమాచారం అందింది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందించి.. సజావుగా నిత్యావసర సరుకులు అందేలా చర్యలు తీసుకుంటాం.

- కిమ్మి శివయ్య, తహసీల్దార్‌, జియ్యమ్మవలస

Updated Date - Jun 11 , 2026 | 12:28 AM