Agency Area మన్యంలో ‘స్థానిక’ సందడి
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:26 AM
Local Poll Buzz in the Agency Area స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. అక్టోబరులోగా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేయడంతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్
జిల్లాకు ప్రత్యేకంగా జడ్పీ ఏర్పాటు
కూటమి ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు
అధిష్ఠానం ఆశీస్సుల కోసం ఆశావాహుల ప్రయత్నాలు
పార్వతీపురం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. అక్టోబరులోగా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేయడంతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న వారు అధిష్ఠానం ఆశీస్సుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో తమకే సీటు కేటాయించాలని కోరుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలోనూ గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్...
గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీ వర్గాలకు 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33.33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. కాగా గత వైసీపీ ప్రభుత్వం.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ ఆచరణ సాధ్యం కాలేదు. కొంతమంది వైసీపీ మద్దతుదారులు అప్పట్లో కోర్టుకు వెళ్లడం, తదితర కారణాలతో బీసీల రిజర్వేషన్ శాతం పెంపు ముందుకు సాగలేదు. దీంతో అప్పట్లో బీసీలు తీవ్ర నిరాశ చెందారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌పై స్పష్టత ఇవ్వడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలోని 15 మండలాలకు సంబంధించి 15 ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ప్రకారం.. సుమారు ఆరు నుంచి ఏడు స్థానాలు బీసీలకు లభించే అవకాశం ఉంది. ఎంపీటీసీ స్థానాల విషయానికొస్తే.. రిజర్వేషన్ ప్రకారం.. గిరిజన ప్రాంతాలు మినహా మిగిలిన మండలాల్లో బీసీలు ఎంపీటీసీ సభ్యులుగా ఉండనున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన 24.15 శాతం బీసీ రిజర్వేషన్ మేరకు స్థానిక ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని 15 మండలాల్లో 226 ఎంపీటీసీ స్థానాలకు 32 మంది బీసీ ఎంసీటీసీలు ఉండేవారు. తాజాగా పెంచిన రిజర్వేషన్లు ప్రకారం బీసీ ఎంపీటీసీల సంఖ్య 77కి చేరే అవకాశం ఉంది. జిల్లాలో 451 పచాయతీలు ఉన్నాయి. బీసీ డెడికేటెడ్ సిఫారసుల మేరకు పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో అత్యధిక పంచాయతీల్లో 34 శాతం రిజర్వేషన్ అమలు కానుంది.
జిల్లాలో జడ్పీ ఏర్పాటు...
ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా జడ్పీలున్నాయి. ప్రస్తుతం విజయనగరం జడ్పీలోనే పార్వతీపురం మన్యం జిల్లా కొనసాగుతుంది. అయితే మంత్రివర్గం నిర్ణయం మేరకు కొత్త జిల్లా పార్వతీపురం మన్యంలోనూ జడ్పీ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో 15 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. ఇందులో 34 శాతం బీసీలకు రిజర్వ్ కానున్నాయి.