Local Body Election ‘స్థానిక’ కసరత్తు వేగవంతం
ABN , Publish Date - Sep 18 , 2026 | 11:55 PM
Local Body Election Preparations Intensify స్థానిక ఎన్నికలకు కసరత్తు వేగవంతమవుతోంది. ఈ నేపథ్యంలో పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఈనెల 22న వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలు ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. పెరిగిన వార్డులకు అనుగుణంగా ఓటర్ల జాబితాలను ప్రచురించేందుకు చర్యలు చేపడుతున్నారు.
పార్వతీపురం, సాలూరు, పాలకొండలో పెరిగిన వార్డుల సంఖ్య
క్షేత్రస్థాయిలో వేడెక్కిన రాజకీయం..
రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ
పార్వతీపురం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలకు కసరత్తు వేగవంతమవుతోంది. ఈ నేపథ్యంలో పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఈనెల 22న వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలు ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. పెరిగిన వార్డులకు అనుగుణంగా ఓటర్ల జాబితాలను ప్రచురించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పురపాలక సంఘాలు, నగర పంచాయతీలో అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల సర్వే నిర్వహిస్తారు. ఏ వార్డులో ఏ సామాజిక వర్గానికి ఓటర్లు ఎంతమంది ఉన్నారన్నది తేలుస్తారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తారు. అనంతరం వార్డుల్లో రిజర్వేషన్లు ఖరారవుతాయి. కాగా చైర్‌పర్సన్ పదవులు, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ఈ ప్రక్రియ దోహదపడనుంది.
మారనున్న లెక్కలు
వార్డుల పునర్విభజనతో పార్వతీపురం, సాలూరుతో పాటు పాలకొండలో కొత్త సరిహద్దులు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే.. ఒక ప్రాంతంలో ఓటర్లు కొత్త వార్డుల్లోకి వెళ్లే అవకాశముంది. దీంతో పాత వార్డుల గణాంకాల ప్రకారం.. తాజాగా రిజర్వేషన్లపై అంచనా వేయలేకపోతున్నారు. ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఖరారవుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా రిజర్వేషన్లు తమకు అనుకూలంగా ఉంటాయో లేదోనని చాలామంది టెన్షన్ పడుతున్నారు. కొందరు పక్క వార్డులపై దృష్టి సారిస్తున్నారు. సరిహద్దులను చూసుకుంటూ.. కొత్తగా కలిసిన ప్రాంతాలను తెలుసుకుం టున్నారు. ఓటర్ల వివరాలపై ఆరా తీస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే తాము లేదా కుటుంబ సభ్యులు పోటీల్లో ఉండొచ్చని ఆశావహులు భావిస్తున్నారు. లేకుంటే నమ్మకమైన వ్యక్తులను బరిలోకి దించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. చైర్మన్, కౌన్సిలర్లుగా పోటీచేయాలను కుంటున్నవారు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీల అధిష్ఠానం ఆశీస్సులు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
వార్డులు.. ఓటర్లు ఇలా..
- 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల పునర్విభజన చేస్తూ గతంలో ప్రకటన చేశారు. ఈ మేరకు జిల్లాలోని పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో వార్డుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు వాటి పరిధిలో 79 వార్డులు ఉండగా, నేడు ఆ సంఖ్య 96కు చేరింది.
- జిల్లాకేంద్రం పార్వతీపురం పురపాలక సంఘంలో 50,384 మంది జనాభా ఉన్నారు. ఇందులో 40,765 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 30 వార్డులు ఉండేవి. పునర్విభజన తర్వాత వార్డుల సంఖ్య 36కు పెరిగింది.
- సాలూరు మున్సిపాల్టీలో 49,500 మంది జనాభా ఉండగా 41,934 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో ఇక్కడ 29 వార్డులు ఉండగా నేడు ఆ సంఖ్య 32కు చేరింది.
- పాలకొండ నగరపంచాయతీలో 31,466 మంది జనాభా ఉన్నారు. 23,466 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 20 వార్డులు ఉండగా తాజాగా ఆ సంఖ్య 28కు చేరింది. మొత్తంగా మూడు ప్రాంతాల్లో వార్డుల సంఖ్య 79 నుంచి 96కు చేరింది. కాగా గెజిట్ ప్రకారం.. ప్రతి వెయ్యి మంది ఓటర్లకు పోలింగ్ కేంద్రాలను ఖరారు చేస్తారు.