Share News

‘Local’ Battle స్థానిక’ సమరం.. కసరత్తు వేగవంతం

ABN , Publish Date - Oct 03 , 2026 | 11:25 PM

‘Local’ Battle: Preparations Intensify జిల్లాలో స్థానిక సందడి మొదలైంది. ఈ మేరకు అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాకేంద్రానికి చేరుకున్న ఎన్నికల సామగ్రిని మండలాల వారీగా తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు.

‘Local’ Battle స్థానిక’ సమరం.. కసరత్తు వేగవంతం
డీపీవో కార్యాలయంలో ఎన్నికల సామగ్రి తరలింపుపై సిబ్బందికి సూచనలిస్తున్న ఇన్‌చార్జి డీపీవో

  • జిల్లా కేంద్రానికి చేరుకున్న సామగ్రి

  • మండలాల వారీగా తరలింపు

  • రిజర్వేషన్ల కోసం ఆశావహుల ఎదురుచూపు

పార్వతీపురం రూరల్‌/గరుగుబిల్లి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సందడి మొదలైంది. ఈ మేరకు అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాకేంద్రానికి చేరుకున్న ఎన్నికల సామగ్రిని మండలాల వారీగా తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 451 పంచాయతీల్లో ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు పూర్తయింది. ఓటర్ల జాబితాలను మండలాల్లో ప్రచురించారు. పంచాయతీల పరిధిలో రిజర్వేషన్లు మినహా మొత్తం ప్రక్రియను అధికారులు చేపడుతున్నారు. మరోవైపు పోలింగ్‌ కేంద్రాల్లో సౌక ర్యాలు, బ్యాలెట్‌ బాక్సులు, తదితర వాటి కోసం ఉన్నతాధికారులకు నివేదికలు అందించారు. బ్యాలెట్‌ బాక్సులు సరిపోకుంటే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించే చర్యలు చేపడుతున్నారు. ప్రస్తు తం అమరాతి నుంచి వచ్చిన ఎన్నికల సామగ్రిని మండలాల వారీగా విభజన చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేసేందుకు అవసరమైన స్ట్రాంగ్‌ రూముల వివరాలపై ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు నివేదికలు అందించారు.

పార్వతీపురం డివిజన్‌లోని 8 మండలాల్లో 224 పంచాయతీలు, పాలకొండ డివిజన్‌లో ఏడు మండలాల్లో 227 పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలో 4,128 వార్డులు ఉండగా.. 6,48,226 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో స్త్రీలు 3,33,273 మంది, పురుషులు 3,14,887 మంది ఉన్నారు. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఏ సమయంలోనైనా స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే పంచాయతీలు, ప్రాదేశికాలు రిజర్వేషన్ల కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

సామగ్రి తరలింపు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో 15 మండ లాలకు ఎన్నికల సామగ్రి తరలిస్తున్నాం. ఈ సమాచారాన్ని ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలకు అందించాం. ప్రస్తుతం రిజర్వేషన్లు ఖరారు కావలసి ఉంది. ఆ తర్వాత ఏ సమయంలోనైనా ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.

పి.సువర్ణ, జిల్లా ఇన్‌చార్జి పంచాయతీ అధికారి, పార్వతీపురం

Updated Date - Oct 03 , 2026 | 11:25 PM