Living hell in Iran ఇరాన్‌లో నరకయాతన
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:28 AM
Living hell in Iran చింతపల్లి గ్రామానికి చెందిన మత్స్యకార యువకుడు కొమర సోమరాజు ఇరాన్‌లో చిక్కుకున్నాడు. ఆరు నెలలుగా అరకొర భోజనంతో భయానక వాతావరణంలో నెట్టుకొస్తున్నాడు.
ఇరాన్‌లో నరకయాతన
రెండు పూటలే భోజనం.. అదీ అరకొరే
ఆరు నెలలుగా అవస్థలు చింతపల్లి మత్స్యకార యువకుడు
అండగా ఉంటామన్న ఎమ్మెల్యే
పూసపాటిరేగ/భోగాపురం, జూన్10(ఆంధ్రజ్యోతి): చింతపల్లి గ్రామానికి చెందిన మత్స్యకార యువకుడు కొమర సోమరాజు ఇరాన్‌లో చిక్కుకున్నాడు. ఆరు నెలలుగా అరకొర భోజనంతో భయానక వాతావరణంలో నెట్టుకొస్తున్నాడు. ఒకవైపు బాంబుల శబ్ధాలు చెవిన పడుతుండడంతో కలవరపడుతున్నాడు. ఈయనతో శ్రీకాకుళం జిల్లా కలింగపట్నంకు చెందిన మరో నలుగురు ఉన్నారు. రోజూ మధ్యాహ్నం తొమ్మిది మందికి కలిపి మూడుగ్లాసుల బియ్యం మాత్రమే ఇస్తున్నారని, మూడురోజులకు రెండు వాటర్‌బాటిళ్లు మాత్రమే అందజేస్తున్నట్లు సమాచారం. కాగా యువకుడు కుటుంబీకులు స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి వద్దకు బుధవారం వచ్చి వినతిపత్రాన్ని అందించారు. సోమరాజు స్వగ్రామానికి చేరుకునేలా సహకారం అందించాలని కోరారు.
కాగా మత్స్యకారులంతా ప్రత్యేక కాంట్రాక్టుపై ముంబయి నుంచి ఎమ్‌వి పాస్కల్ నౌకలో ఇరాన్ వెళ్లారు. అదే సమయంలో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టుకు చేరువలో సముద్రంలో చిక్కుకున్నారు. అంతలో ఇంజిన్‌లో సాంకేతిక సమస్య రావడంతో వీరి షిప్ పూర్తిగా ఆగిపోయింది. మరమ్మతులు చేసే నాథుడు లేడు. జనరేటర్ కూడా పాడైంది. దీంతో డెక్‌పైనే పడుకొని, అక్కడే కట్టెలతో వండుకొంటున్నట్లు బంధువులకు తెలిపారు. తమషిప్ కెప్టెన్, షిప్‌యజమానికి ఫోన్ చేస్తున్నా ఫోన్ ఎత్తడం లేదని, రాత్రివేళ్లల్లో సమీపంలో బాంబులు పడటంతో తమకు చాలా భయంగా ఉందని, ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నారు. సోమరాజు కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం ఎమ్మెల్యే లోకం నాగమాధవిని కలిసి వినతిపత్రాన్ని అందించారు. యువకుడు సుక్షితంగా ఇండియాకు చేరేలా చర్యలు తీసుకొంటామని ఆమె హామీ ఇచ్చారు. యువకుడు తల్లి అప్పయ్యమ్మ చేపలవ్యాపారం చేసుకొంటుండగా, తండ్రి అప్పన్న చేపలవేట చేస్తూ ఉంటారు.