Electric Wire కాటేసిన విద్యుత్ తీగ
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:04 AM
Live Electric Wire Electrocutes ఇంటి నుంచి బయటికొచ్చిన కాసేపటికే ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. వీధిలో నడుస్తుండగానే తెగిపడిన విద్యుత్ తీగ కాటేయ డంతో ఉన్నచోటే కుప్పకూలిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు దూరమవడాన్ని ఆ తల్లి దండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఒక్కగానొక్క కొడుకు దూరమవడంతో తట్టుకోలేకపోతున్న తల్లిదండ్రులు
గుండెలవిసేలా రోదిస్తున్న భార్య
చిదిమిలో విషాదచాయలు
వీరఘట్టం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఇంటి నుంచి బయటికొచ్చిన కాసేపటికే ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. వీధిలో నడుస్తుండగానే తెగిపడిన విద్యుత్ తీగ కాటేయ డంతో ఉన్నచోటే కుప్పకూలిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు దూరమవడాన్ని ఆ తల్లి దండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలిసి గర్భిణి అయిన భార్య గుండెలవిసేలా రోదిస్తోంది. ఈ విషాదకర ఘటన వీరఘట్టం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
చిదిమి గ్రామానికి చెందిన పుర్రి గంగులు, గంగలు గొర్రెలకాపరులుగా జీవనం సాగిస్తున్నారు. వారి కుమారుడు పి.సాయి(24) కూడా అదే పనిచేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాడోదుగా ఉంటున్నాడు. కాగా ఏడాది కిందట వీరఘట్టానికి చెందిన యువతితో సాయికి వివాహమైంది. ప్రస్తుతం గర్భిణి అయిన భార్యను ఇటీవల ఆమె పుట్టింటికి పంపించాడు. రోజూలానే పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న సాయి శనివారం సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. వర్షం కురిసి ఆగడంతో బయటకు వచ్చాడు. వీధిలో నడుస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ తీగ తెగిపడి ఆయనపై పడింది. దీంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. గుమ్మం దాటిని బిడ్డ క్షణాల్లోనే మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఇక తమకు దిక్కెవరంటూ భోరున విలపించారు. అందరితో సరదాగా ఉండే సాయి విద్యుదాఘాతం కారణంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ షన్ముఖరావు సిబ్బందితో గ్రామానికి వెళ్లి పరిశీలించారు. ఘటనపై ఆరా తీశారు. సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తండ్రి గంగులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.