Share News

Liquor Boom in the Agency Areas మన్యంలో సారా జోరు

ABN , Publish Date - Aug 31 , 2026 | 11:46 PM

Liquor Boom in the Agency Areas మన్యంలో సారా ఏరులైపారుతోంది. గిరిజన గ్రామాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఏజెన్సీలో సారా తయరీ, రవాణా, విక్రయాలకు అడ్డూఅదుపు ఉండడం లేదు. ప్రధానంగా ఏవోబీ సరిహద్దు గ్రామాల్లోనే సారాను తయారుచేసి గిరిజన గ్రామాల్లో విక్రయాలు చేపడుతున్నారు. మరికొందరు వ్యాపారులు ఒడిశా రాష్ట్రం అలమండ నుంచి దిగుమతి చేసుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.

Liquor Boom in the Agency Areas మన్యంలో సారా జోరు
మెట్టుగూడ సమీపంలోని కొండపై సారా తయారీ దృశ్యం

  • జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో తయారీ, విక్రయాలు

  • ఏజెన్సీలో పెరిగిపోయిన నాటుసారా ప్రభావిత గ్రామాలు

  • దాడులు నిర్వహిస్తున్నా .. ఆగని అక్రమ దందా

పార్వతీపురం, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): మన్యంలో సారా ఏరులైపారుతోంది. గిరిజన గ్రామాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఏజెన్సీలో సారా తయరీ, రవాణా, విక్రయాలకు అడ్డూఅదుపు ఉండడం లేదు. ప్రధానంగా ఏవోబీ సరిహద్దు గ్రామాల్లోనే సారాను తయారుచేసి గిరిజన గ్రామాల్లో విక్రయాలు చేపడుతున్నారు. మరికొందరు వ్యాపారులు ఒడిశా రాష్ట్రం అలమండ నుంచి దిగుమతి చేసుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఒడిశా సరిహద్దుల్లో ఉన్న పార్వతీపురం, పాచిపెంట, సాలూరు, భామిని, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ మండలాల నుంచి సారా అక్రమ రవాణా జరుగుతుంది. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా పాలకొండ, పార్వతీపురంలోని ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో స్థానిక పోలీసుల సహకారంతో సారా స్థావరాలపై దాడులు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మార్పు రావడం లేదు. గతంలో భామిని మండలంలో పోలీసులపై సారా వ్యాపారులు దాడిచేశారంటే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై జిల్లా ఎక్సైజ్‌ శాఖాధికారి సహదేవ్‌ను వివరణ కోరగా.. ‘ జిల్లాలో 2.0 నవోదయ కార్య క్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నాం. సారా వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నాం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ స్థానిక పోలీసులు సహకారంతో ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి సారా నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒడిశా గ్రామాల్లో సారా తయారవుతున్న ప్రాంతాల్లో నిఘా పెట్టాం. ఒడిశా ఎక్సైజ్‌శాఖాధికారులతో కలిసి దాడులు చేస్తున్నాం.’ అని తెలిపారు.

కేసుల నమోదు ఇలా..

ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెల వరకు 197 నాటు సారా కేసులను ఎక్సైజ్‌శాఖాధికారులు నమోదు చేశారు. ఈ కేసుల్లో 2,663 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 7,609 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని, 37,580 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.

కుటీర పరిశ్రమను తలపిస్తూ..

సీతంపేట: సీతంపేట మన్యంలో నాటుసారా ప్రభావిత గ్రామాలు 13 వరకు ఉన్నట్లు అధికారికంగా గుర్తించారు. అయితే వాస్తవంగా ఏజెన్సీలో 50కిపైబడి సారా ప్రభావిత గ్రామాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల సమీపంలోని కొండ ప్రాంతంలో సారా వంటకాలు, రవాణా ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సారా తయారీకి వినియోగించే నల్లబెల్లం, పటిక, అమోనియా, నవాసారం వంటి ముడిసరుకులు సీతంపేట నుంచి అర్ధరాత్రి వేళల్లో యథేచ్ఛగా గిరిజన గ్రామాలకు రవాణా అవుతున్నాయి. వాటిని నేరుగా సంబంధిత సారా వ్యాపారుల చెంతకే అందిస్తుండడంతో ఈ వ్యాపారం ఏజెన్సీలో చిన్నపాటి కుటీర పరిశ్రమను తలపిస్తోంది. ఇక్కడ తయారుచేసిన సారా మన్యం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఒడిశాలోని గుణుపూర్‌ వరకు రవాణా అవుతోంది. కాగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడికక్కడే సారా లభిస్తుండడంతో దీనికి బానిస లైన గిరిజనులు చివరకు కిడ్నీ, కాలేయం, గుండె సంబంధిత వ్యాధులతో ఆసుపత్రిపాలవుతున్నారు. కొందరు మృత్యువాత పడుతుండడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం రూపొందించిన నవోదయం 2.0 కార్యక్రమం సీతంపేట ఏజెన్సీలో పూర్తిస్థాయిలో జరగడం లేదనే విమర్మలు వినిపిస్తున్నాయి. దీనిపై పాలకొండ ఎక్సైజ్‌శాఖ సీఐ వెంకటరాజ్‌ను వివరణ కోరగా.. ‘ సారా నియంత్రణకు ఎప్పటికప్పుడు గ్రామాల్లో దాడులు నిర్వహిస్తున్నాం. ఇటీవల కాలంలో వరుస దాడులు నిర్వహించి నాటుసారా వ్యాపారులపై కేసులు నమోదు చేశాం. ముడిసరుకులు సరఫరా చేసేవారిపై ప్రత్యేక దృష్టిసారిస్తాం. నాటుసారా ప్రభావిత గ్రామాల్లో నవోదయం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ’ అని తెలిపారు.

సరిహద్దు గ్రామాల్లో ...

- గుమ్మలక్ష్మీపురం: మండలంలోని సరిహద్దు గిరిజన గ్రామాలైన మూలిగూడ, కేసరతో పాటు కొండ ప్రాంతాల్లోని నీటి వాగులు వద్ద నాటుసారా తయారీ జరుగుతుంది ఈ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు రాత్రి వేళల్లో సారాను తరలించి అమ్మకాలు సాగిస్తున్నారు. మండలం చుట్టూ ఒడిశా సరిహద్దు గ్రామాలు ఉండడంతో సారా వ్యాపారులకు కలిసొస్తుంది.

- పార్వతీపురం రూరల్‌: మండలంలో ఏవోబీ సరిహద్దు గ్రామాలైన పెదమరికి, డీకేపట్నం, అడ్డూరువలసకు సమీపంలో ఉన్న ఒడిశా గ్రామాల్లో సారాను నిల్వ చేస్తున్నారు. రాత్రి వేళల్లో పార్వ తీపురం పట్టణంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లోకి తీసుకొచ్చి విక్రయాలు చేపడు తున్నారు. ఒడిశాలో రూ.ఐదు లభించే నాటుసారా ప్యాకెట్‌ను ఇక్కడ రూ.20 చొప్పన విక్రయిస్తున్నారు.

- భామిని: గుణుపూర్‌ బ్లాక్‌ పరిధి నుంచి భామిని మండలంలోని బొడ్డగూడ, మూలగూడ, కొత్తగూడ, బాలేరు, తాటిమానుగూడ తదితర గ్రామాలకు సారా సరఫరా అవుతుంది. మూడు వైపులా ఒడిశా ప్రాంతం ఉండడాన్ని ఆసరాగా చేసుకుని అక్కడ నుంచి సారాను అడ్డదారుల్లో గిరిజన గ్రామాలకు తరలిస్తున్నారు.

-కురుపాం/కురుపాం రూరల్‌: కొమరాడ, గుమ్మలక్ష్మీపుం, కురుపాం మండలాలు ఏవోబీ సరిహద్దులో ఉండడంతో బోర్డర్‌ గ్రామాల్లో ఎక్కువగా సారును తయారు చేసి గిరిజన గ్రామాలకు సరఫరా చేసి విక్రయాలు చేపడుతున్నారు. కురుపాం మండలంలో జొంగరపాడు, కాకితాడ, జి.శివడ, గుమ్మగదబవలస, కించాయిగూడ తదితర గ్రామాల్లో సారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు ఒడిశా నుంచి బైక్‌పై సారాను రావాణా చేస్తూ విక్రయిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో నిందితులపై ఎన్ని కేసులు పెడుతున్నా, బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ సారా అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆంధ్రా-ఒడిశా పోలీసులు ఉమ్మడిగా దాడులు చేసి 5,750 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు కురుపాం ఎక్సైజ్‌ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు.

- జియ్యమ్మవలస: మండలంలో చినమేరంగి, గడ్డసింగుపురం గ్రామాలు నాటుసారా విక్రయా లకు కేంద్రాలుగా ఉన్నాయి. ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటూ మండలంలోని అనేక గ్రామాలకు సరఫరా చేస్తున్నారు.

- సాలూరు: మండలంలో వివాదాస్పద ప్రాంతం కొఠియా గ్రామాలతో పాటు సారిక, నేరెళ్లవలస, తోణాం, కురుకూటి, దళాయివలస, మూలతాడివలస, దొరలతాడివలస, మోనంగితోపాటు అనేక గిరిజన గ్రామాల్లో సారా దందా గుట్టుగా సాగుతోంది. గిరిజన గ్రామాల్లో చాటుమాటుగా సారా తయారీ, అమ్మకాలు జరుగుతున్నాయి.

Updated Date - Aug 31 , 2026 | 11:46 PM