Share News

Like sixty in one's thirties...ముప్పైలో అరవైలా...

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:06 AM

Like sixty in one's thirties... వయసు పైబడిన వారిలో ఎముకల బలహీనత, కీళ్ల నొప్పుల సమస్యలు ఇప్పుడు యువతను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలో ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

 Like sixty in one's thirties...ముప్పైలో అరవైలా...

ముప్పైలో అరవైలా...

ఎముకలు ఆరుగుతున్నాయ్‌.. కీళ్లు విరుగుతున్నాయ్‌

చిన్న వయస్సులోనే కీళ్ల అరుగుదల

మారిన జీవనశైలే కారణం

జిల్లాలో పెరుగుతున్న ఈ తరహా సమస్యలు

కనీస శారీరక శ్రమ అవసరమంటున్న వైద్యులు

శీతల పానీయాల వాడకం తగ్గించాలని సూచన

- జిల్లా కేంద్రానికి చెందిన 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రమేష్‌ వర్క్‌ఫ్రం హోం విధానంలో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దిరోజులుగా తీవ్రమైన మెడ, నడుమునొప్పితో బాధపడుతుండడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నాడు. రోజూ 10 నుంచి 12 గంటల పాటు అపసవ్య భంగిమలో ల్యాప్‌టాప్‌ ముందు కూర్చోవడమే కారణమని వైద్యులు తెలిపారు. దీనికి తోడు శారీరక శ్రమ లేకపోవడంతో చిన్న వయసులోనే వెన్నుముఖపై ఒత్తిడి పెరిగి ఎముకలు అరగడం ప్రారంభమైందన్నారు.

- గరివిడికి చెందిన 35 ఏళ్ల గృహిణి కృష్ణవేణికి మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాళ్లలో నొప్పి వస్తోంది. కటకట శబ్దాలు రావడంతో ఆమె వైద్యులను సంప్రదించింది. విటమన్‌ డి లోపంతో పాటు అధిక బరువు వల్ల మోకాళ్లపై ఒత్తిడి పడి కీళ్ల మధ్య వుండే మృదులాస్తి (కార్టిలేజ్‌) అరిగిపోయినట్టు తేల్చారు. నిరంతరం ఏసీ గదులు, నీడ పట్టున వుండడమే దీనికి కారణమని వైద్యులు నిర్ధారించారు.

- రాజాంకు చెందిన 32ఏళ్ల నూకరాజు రోజూ శీతల పానీయాలు తాగే అలవాటు ఉంది. ఇటీవల ఇంట్లో చిన్న పాటి జారుడుకే కాళ్ల ఎముక తీవ్రంగా విరిగింది. కూల్‌ డ్రింకులు ఎక్కువగా సేవించడం వల్ల ఎముకల్లోని కాల్షియం హరించిపోయి 60 ఏళ్ల వయసులో రావాల్సిన ఆస్టియోపోరోసిస్‌ (ఎముకలు గుళ్లబారడం) 30 ఏళ్లకే వస్తోందని వైద్యులు గుర్తించారు.

విజయనగరం రింగురోడ్డు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి):

వయసు పైబడిన వారిలో ఎముకల బలహీనత, కీళ్ల నొప్పుల సమస్యలు ఇప్పుడు యువతను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలో ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. 30 ఏళ్లు దాటక ముందే మోకాళ్ల నొప్పులు, నడుంనొప్పి అంటూ ఆసుపత్రి బాట పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు 60ఏళ్ల తరువాత కన్పించే ఆస్టియో ఆర్థరైటిస్‌ ఇప్పుడు 30 నుంచి 35 ఏళ్ల వారిలోనే కన్పిస్తున్నాయి. ఎముకల సాంద్రత తగ్గిపోవడం వల్ల చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఏర్పడుతోంది.

కారణాలు ఇవే

- గంటల తరబడి కంప్యూటర్‌ ముందుకు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎముకలు తమ బలాన్ని కోల్పోతున్నాయి

- ఏసీ గదుల్లో కాలం గడపడం వల్ల సూర్యరశ్మి శరీరానికి తగలడం లేదు. దీంతో విటమిన్‌ డి లోపించి మనం తీసుకునే ఆహారంలో కాల్షియం ఎముకలకు చేరడం లేదు.

- జంక్‌ ఫుడ్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌ అధికంగా తీసుకోవడం వల్ల పోషకాల సమతుల్యత దెబ్బతింటోంది.ముఖ్యంగా కార్బోనైటేడ్‌ డ్రింక్స్‌ ఎముకల్లోని కాల్షియంను పీల్చేస్తాయి.

- పెరిగిన శరీర బరువు మొత్తం మోకాళ్లపై పడడంతో కీళ్ల మధ్య వుండే ‘కార్టిలేజ్‌’ అనే మెత్తని పొర త్వరగా అరిగిపోతోంది.

జిల్లాలో పరిస్థితి ఇలా

జిల్లాలోని యువత, కళాశాల విద్యార్థుల్లో దాదాపు 20 శాతానికి పైగా ఎముకలు, కీళ్ల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. గంటల తరబడి స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లకు అతుక్కుని పోవడం వల్ల వీరిలో మెడనొప్పులు, మడికట్టు తిమ్మిర్లు అధిక మౌతున్నాయి. నిరంతరం గదులకే పరిమితమై, ఎండలు తగలక పోవడం వల్ల, జంకుఫుడ్స్‌ తీసుకోవడం తదితర కారణాలతో తీవ్రమైన విటమిన్‌ డి లోపంతో నడుము, కాళ్ల నొప్పులు తెచ్చుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు.

- 26 నుంచి 40 ఏళ్ల వయసులో ఎముకల సమస్యలతో వస్తున్న కేసుల్లో దాదాపు 35 శాతం ఈ కోవకు చెందిన వారేనని వైద్యులు చెబుతున్నారు. కంప్యూటర్స్‌ ముందు కదలకుండా కూర్చోవడం, ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌, కూల్‌ డ్రింక్స్‌ వినియోగం, మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల 30 నుంచి 35 ఏళ్లకే మోకాళ్ల అరుగుదల, తీవ్ర వెన్నునొప్పి సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో గర్భదారణ ఆ తరువాత కాలంలో కాల్షియం ఉండే ఫుడ్‌ తీసుకోకపోవడంతో ఎముకలు త్వరగా బలహీన పడుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

- మహిళల్లో హార్మోన్ల మార్పులతో కీళ్ల నొప్పుల ప్రభావం 45 శాతానికి పైగా కన్పిస్తోందని వైద్యులు చెబుతున్నారు. 45 ఏళ్లు దాటిన మహిళల్లో నెలసరి ఆగడం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ స్థాయి తగ్గి, ఎముకల్లోని కాల్షియం వేగంగా హరించుకుపోతోంది. పురుషుల్లో శారీరక శ్రమ లేకపోవడం వంటి వ్యతిరేక జీవనశైలి వల్ల జిగురు (కార్టిలైజ్‌) తగ్గిపోయి తీవ్రమైన నొప్పులు మొదలవుతున్నాయి.

- 55 ఏళ్ల పైబడిన వారిలో ఎముకల సమస్యలు 60 శాతానికి పైగా వున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఎముకలు గుళ్లబారిపోయే ఆస్టియోపోరోసిస్‌ వ్యాధి వేధిస్తోంది. బాత్రూంలో చిన్నపాటి జారుడు లేదా ఇంట్లో కాలు బెణికినా కూడా తుంటి ఎముక, వెన్నుపూసలు లేదా మణికట్టు ఎముకలు విరిగిపోతున్నాయి. తగినంత కాల్షియం, విటమిన్‌ డి అందకపోవడం, వ్యాయామం లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు.

ఆహారపు అలవాట్లు కీలకం

ఆహారంలో పాలు,పెరుగు, ఆకుకూరలు, రాగులు, గుడ్లు వుండేలా చూసుకోవాలి. ఇవి సహజ సిద్ధమైన కాల్షియం అందిస్తాయి. ప్రతిరోజు 15 నుంచి 20 నిమిషాల పాటు ఉదయం ఎండలో నడవడంతో సహజ విటమిన్‌ డి అందుతుంది. ఎముకలు ధృడంగా వుండడానికి ప్రతి రోజు నడక, సైక్లింగ్‌ లేదా తేలికపాటి వ్యాయామాలు అలవాటు చేసుకోవాలి. సరైన పౌష్టికాహరం తీసుకోవడం, ధూమపానం, మద్యపానాన్ని ఆపివేయడం ఆరోగ్యానికి మంచిది.

జీవనశైలి మార్పుల వల్లే ఎముకలు బలహీనం

డాక్టరు మోపాడ ప్రవీణ్‌కుమార్‌, ఆర్ధోపెడిక్‌ సర్జన్‌, విజయనగరం

మారిన జీవనశైలితో జిల్లాలో చిన్న వయసులోనే ఎముకల బలహీనత, కీళ్ల అరుగుదల పెరుగుతోంది. నిరంతరం కదలకుండా కూర్చుని పనిచేయడం, విటమిన్‌ డి లోపం, జంకుఫుడ్స్‌, కూల్‌డ్రింక్‌ ్స వినియోగం వల్ల 30ఏళ్లకే మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయి. ప్రారంభంలో వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ, బరువు తగ్గడం, పౌష్టికాహారం తీసుకోవడం, నడవడం చేస్తే సమస్యలు చాలా వరకూ తగ్గుతాయి. వైద్యుని సలహాలు తీసుకోకుండా సొంతంగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడొద్దు. దీని వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

-------------

Updated Date - Aug 06 , 2026 | 12:06 AM