Like a Festival..! పండుగలా..!
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:22 AM
Like a Festival..! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టిన రోజు వేడుకలను జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీగా ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు చేశారు. పలుచోట్లో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు.
ఆలయాల్లో పూజలు.. పలుచోట్ల సేవా కార్యక్రమాలు
వాడవాడలా సంబరాలు.. ఉత్సాహంగా పాల్గొన్న టీడీపీ శ్రేణులు
సాలూరు, ఏప్రిల్20(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టిన రోజు వేడుకలను జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీగా ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు చేశారు. పలుచోట్లో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు అందించారు. పార్టీ కార్యాలయాల్లో కేకులు కట్ చేశారు. అందరికీ మిఠాయిలు పంచి పెట్టారు. మొత్తంగా అంతటా సందడి వాతావరణం నెలకొంది. సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించారు. తొలుత ఆమె పాచిపెంట మండలం పెదచీపురువలస వద్ద పారమ్మతల్లి చందనోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేరిట అభిషేకాలు చేశారు. అనంతరం సాలూరు పట్టణంలో ఉన్న కన్యాకాపరమేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నిండు నూరేళ్లు ముఖ్యమంత్రి చల్లగా ఉండాలని మొక్కుకున్నారు. అక్కడి నుంచి నేరుగా క్యాంపు కార్యాలయానికి చేరుకుని పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నడిచే రాజకీయ విశ్వవిద్యాలయమన్నారు. తన మీద నమ్మకంతో రెండు శాఖలకు మంత్రిగా బాధ్యతలు అప్పగించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తిరుపతిరావు , వేణుగోపాలనాయుడు, పరమేశ్, యుగంధర్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పేదల ఆకలి తీర్చడమే లక్ష్యం
కురుపాం,ఏప్రిల్20(ఆంధ్రజ్యోతి): పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోందని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అన్నారు. సోమవారం కురుపాంలో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినోత్సవం సందర్భంగా క్యాంటీన్‌లో పేదలకు వడ్డించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. సీఎం చంద్రబాబు నిరంతరం పేదల సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి అని కొనియాడారు. కేవలం రూ.5కే నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందిస్తుండడంతో కూలీలు, సామాన్యులకు ఎంతో ఊరట కలుగుతుందన్నారు. ఆకలితో ఎవరూ అలమటించకూడదనేది ముఖ్యమంత్రి ఆశయమని, దానికి అనుగుణంగా అన్నా క్యాంటీన్లు పనిచేస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి , టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్, టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పద్మావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ, ట్రైకార్ బోర్డు డైరెక్టర్ లావణ్య, టీడీపీ నాయకులు లక్ష్మణరావు, రంజిత్‌కుమార్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
కిటకిటలాడిన అన్నా క్యాంటీన్లు
పార్వతీపురం, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అన్నా క్యాంటీన్లు సోమవారం కిటకిటలాడాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఉచిత భోజనం ఏర్పాటు చేయడంతో విశేష స్పందన లభించింది. జిల్లాలోని అన్నా క్యాంటీన్ల వద్ద ప్రజలు బారులుదీరారు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. క్యూలైన్‌లో ప్రజలు వేచి ఉండడంతో తోపులాటలు జరగకుండా పోలీస్ బందోసబ్తు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో అన్నా క్యాంటీన్‌కు సాధారణంగా రోజుకు 600 నుంచి 700 మంది వరకు ప్రజలు వస్తుంటారు. సోమవారం మాత్రం వెయ్యి మందికి పైగా వచ్చి మధ్యాహ్న భోజనం చేశారు. టేబుల్స్ సరికపోకపోవడంతో విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు నేలపై కూర్చొని భోజనం చేశారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర స్వయంగా పేదలకు వడ్డించారు. అనంతరం ఆయనతోపాటు టీడీపీ నాయకులు అన్నా క్యాంటీన్‌లో భోజ నాలు చేశారు. పాలకొండ అన్నా క్యాంటీన్‌లోనూ రద్దీ కనిపించింది. ఇక కురుపాంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఆ రెండు చోట్లా ప్రజలు భారీగా తరలివచ్చి ఎంతో సంతోషంగా భోజనాలు చేశారు.