Lifting the ban on freehold lands? ఫ్రీహోల్డ్ భూములపై నిషేధం ఎత్తివేత?
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:25 AM
Lifting the ban on freehold lands? ఫ్రీహోల్డ్ భూముల విషయంలో కీలక అడుగు పడనుంది. వాటిపై ఉన్న నిషేధం తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే నిజాయితీగా ఫ్రీహోల్డ్ భూమిలో ఉన్న వారు మాత్రమే విక్రయించేలా నిఘా పెట్టనుంది. వైసీపీ హయాంలో డీపట్టా భూములకు సంబంధించి 20 ఏళ్లు గడువు దాటితే అమ్ముకోవచ్చని జీవో ఇచ్చారు.
ఫ్రీహోల్డ్ భూములపై నిషేధం ఎత్తివేత?
19 నెలలుగా విక్రయాలు నిలిపివేసిన ప్రభుత్వం
నిజమైన లబ్ధిదారులకు ఇబ్బందులు
వారి విజ్ఞప్తితో సానుకూల నిర్ణయం
అప్పటి అక్రమార్కులపై చర్యలు
ఒకటి, రెండురోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు
విజయనగరం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి):
ఫ్రీహోల్డ్ భూముల విషయంలో కీలక అడుగు పడనుంది. వాటిపై ఉన్న నిషేధం తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే నిజాయితీగా ఫ్రీహోల్డ్ భూమిలో ఉన్న వారు మాత్రమే విక్రయించేలా నిఘా పెట్టనుంది. వైసీపీ హయాంలో డీపట్టా భూములకు సంబంధించి 20 ఏళ్లు గడువు దాటితే అమ్ముకోవచ్చని జీవో ఇచ్చారు. దీంతో వెనువెంటనే కోట్లాది రూపాయల భూములు చేతులు మారిపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ వివాదాస్పద జీవోపై సమీక్షించింది. 20 సంవత్సరాలు పూర్తికానివి సైతం ఫ్రీహోల్డ్‌లో చూపి భారీగా అవకతవకలు జరిపినట్టు..పోరంబోకు భూములను కూడా వాటిలో చూపి విక్రయించినట్టు గుర్తించారు. దీంతో ఆ విక్రయాలపై నిషేధం విధించారు. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేశారు. సుమారు 19 నెలలుగా వీటిపై నిషేధం కొనసాగుతుండగా.. నిజమైన హక్కుదారులు తమ భూములను విక్రయించుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటుండడాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్నీ సవ్యంగా ఉన్న భూములపై నిషేధం ఎత్తివేయనుంది. ఆంక్షలు సడలించనుంది. ఉత్తర్వుల జారీకి సన్నాహాలు చేస్తోంది.
ఆ జీవోతో అక్రమాలు..
వైసీపీ హయాంలో ఫ్రీహోల్డ్ భూముల విషయంలో ఒక జీవో జారీచేసింది. దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 13.59 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేశారు. అందులో 5.74 లక్షల ఎకరాలను అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా నిషేధిత జాబితా నుంచి బయటకు తీశారు. వాటిలో 55 వేల ఎకరాలకు పక్కాగా రిజిస్ర్టేషన్లు జరగ్గా.. 8483 ఎకరాల విషయంలో అక్రమాలు జరిగినట్టు అధికారులు తేల్చారు. దీంతో ఈ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ర్టేషన్లను నిలిపివేసింది. క్రయ విక్రయాలను నిషేధించింది. ఎన్నోసార్లు విచారణ గడువు పరిమితిని ప్రభుత్వం పెంచింది. ఎట్టకేలకు దీనిపై స్పష్టత రావడంతో చర్యలకు దిగనుంది. అప్పట్లో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు నోటీసులు అందనున్నాయి. బాధ్యులైన అధికారులపై రెవెన్యూ శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించనుంది. ఈ విషయం తెలిసి వైసీపీ కీలక నేతల్లో గుబులు రేగింది.
అప్పటి మంత్రుల హస్తం..
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఆరుగురు మంత్రుల హస్తం ఉన్నట్టు తేలింది. 42 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 120 మంది వైసీపీ కీలక నేతల ప్రమేయాన్ని రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్ధారించారు. అందులో భాగంగా వైసీపీ హయాంలో మన జిల్లాలో మంత్రులుగా వ్యవహరించిన వారి పేర్లు బయటపడినట్టు తెలుస్తోంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సైతం అప్పట్లో భూముల వ్యవహారంలో తలదూర్చినట్టు ఆరోపణలున్నాయి. 22 మంది డిప్యూటీ కలెక్టర్ల ప్రమేయం ఉందని తేలగా.. మన జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు అధికారులకు ప్రభుత్వం నోటీసులిచ్చింది.
జిల్లాలో జరిగిందిదీ..
జిల్లాకు సంబంధించి వేలాది ఎకరాలు ఫ్రీహోల్డ్‌లోకి వెళ్లడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. వేపాడ మండలంలోని ఓ గ్రామంలో ఫ్రీహోల్డ్ చేసిన భూమిని రిజిస్ర్టేషన్ చేయడంతో ఆ భూమి రిజిస్ర్టేషన్‌ను రద్దు చేశారు. అప్పట్లో ఈ భూముల విషయంలో చక్రం తిప్పిన జేసీ, ఆర్డీవోపై కూటమి సర్కారు చర్యలకు దిగింది. మరోవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పది మంది తహసీల్దార్లకు నోటీసులు ఇచ్చింది. అయితే అధికారులు కేవలం పాత్రధారులు మాత్రమే. సూత్రధారులంతా అప్పటి వైసీపీ నేతలే. అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని భూదందాకు తెరలేపారన్న విమర్శలున్నాయి. అసైన్డ్ భూములే కాదు.. మాజీ సైనికుల పేరిట బినామీలను ఏర్పాటుచేసుకొని ప్రభుత్వ భూమిని కొల్లగొట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో వారందరిపై కఠినచర్యలకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ మండలాల్లో అధికం..
ప్రధానంగా జిల్లాలో భోగాపురం, ఎస్.కోట, కొత్తవలస, గజపతినగరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అసైన్డ్ భూముల రిజిస్ర్టేషన్లు జరిగినట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. వాస్తవానికి వీటిపై సీరియస్‌గా దృష్టిపెట్టాలని తహసీల్దార్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది కానీ అప్పట్లో వైసీపీ నేతలతో ఉన్న అనుబంధం, పరిచయాలు దృష్ట్యా తహసీల్దార్లు పెద్దగా దృష్టిపెట్టలేదు. దీంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. 10 మంది తహసీల్దార్లకు నోటీసులు అందించింది. ఫ్రీహోల్డ్‌లోకి వచ్చిన భూములు, రిజిస్ర్టేషన్లపై లోతైన దర్యాప్తు చేపట్టింది. ఎట్టకేలకు విచారణ పూర్తికాగా చర్యలకు దిగే పరిస్థితి కనిపిస్తోంది.
--------