Lifeline for Crops పంటలకు ఊపిరి
ABN , Publish Date - Aug 28 , 2026 | 11:57 PM
Lifeline for Crops ఎగువ ప్రాంతం ఒడిశాలో పడుతున్న వానలకు తోడు జిల్లాలో అడపాదడపా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, గెడ్డలు ఉప్పొంగు తున్నాయి. వరద నీటితో కళకళలాడుతూ.. పంట పొలాలకు ఊపిరిపోస్తున్నాయి. కాగా ఖరీఫ్ రైతులు ఈ నీటిని ఒడిసిపట్టి సాగు పనులు ముమ్మరం చేస్తున్నారు.
ఆ నీటిని ఒడిసిపడుతున్న ఖరీఫ్ రైతులు
49,709 హెక్టార్లలో వరినాట్లు పూర్తి
పాలకొండ, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతం ఒడిశాలో పడుతున్న వానలకు తోడు జిల్లాలో అడపాదడపా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, గెడ్డలు ఉప్పొంగు తున్నాయి. వరద నీటితో కళకళలాడుతూ.. పంట పొలాలకు ఊపిరిపోస్తున్నాయి. కాగా ఖరీఫ్ రైతులు ఈ నీటిని ఒడిసిపట్టి సాగు పనులు ముమ్మరం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 72 వేల హెక్టార్లలో ఈ ఏడాది ఖరీఫ్ కింద వరి సాగు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 49,709 హెక్టార్లలో నాట్లు వేశారు. అయితే అత్యధికంగా కొండవాగులు, గెడ్డల సాగునీటి ఆధారంగానే రైతులు నాట్లు వేయగలిగారు. వాస్తవంగా జిల్లాలోని పాలకొండ, సాలూరు, కురుపాం నియోజకవర్గాల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో కొండవాగులు, సెలయేర్లు అధికంగా ఉన్నాయి. వాటి ద్వారా వచ్చే వర్షపునీరు గెడ్డల్లోకి చేరి వ్యవసాయ భూములకు ఆయువు పోస్తుంది. ఒక్క పాలకొండ మండలంలోని ఓనిగెడ్డ, జంపరకోటగెడ్డ, రావాడగెడ్డ ద్వారా వేలాది ఎకరాల్లో సాగుభూములకు నీరు అందింది. ఇదిలా ఉండగా.. జిల్లాలో తోటపల్లి , వెంగళరాయసాగర్, ఒట్టిగెడ్డ, జంఝావతి తదితర ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నా.. వాటి పరిధిలోని శివారు భూములకు సాగునీరు అందడం లేదు. ఆశించినస్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కాలువలు ద్వారా నీరు పారడం లేదు. దీంతో రైతులు కొండ వాగులు, గెడ్డల్లో ప్రవహించే నీటినే వినియోగించుకొని నాట్లును కొంతమేర పూర్తి చేశారు. ఏదేమైనా వరుణుడు కరుణిస్తేనే పంట చేతికందుతుందని అన్నదాతలు చెబుతున్నారు. దీనిపై డీఏవో భవానీశంకర్‌ను వివరణ కోరగా.. ‘జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 72,829 హెక్టార్లలో వరి పంట సాగు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 49,709 హెక్టార్లలో వరినాట్లు పూర్తయ్యాయి. మొక్కజొన్న, పత్తి, చిరుధాన్యాలు తదితర పంటలను కూడా రైతులు వేశారు. ప్రాజెక్టులు ద్వారా అందే సాగునీటితో పాటు కొండవాగులు, గెడ్డలు ద్వారా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకుని రైతులు సాగు చేస్తున్నారు.’ అని తెలిపారు.