Life... is in God's hands.ప్రాణం.. దైవాదీనం
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:25 AM
Life... is in God's hands. ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే ఆ బాధను భరించలేం. వేగంగా ఆస్పత్రికి చేరుకోవాలని భావిస్తాం. ఆస్పత్రికి వెళ్లాకే కొంత ధైర్యం తెచ్చుకుంటాం. వైద్యుడు వచ్చి ట్రీట్‌మెంట్ ప్రారంభిస్తే ప్రాణం నిలుస్తుందని అనుకుంటాం.
ప్రాణం.. దైవాదీనం
ప్రమాద బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందని చికిత్స
జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లోనూ చేతులు ఎత్తేస్తున్న వైద్యులు
రిఫరల్‌తో క్షతగాత్రులకు ప్రాణాపాయం
ఆసుపత్రులకు తిప్పే క్రమంలో భారంగా రవాణా ఖర్చులు
ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే ఆ బాధను భరించలేం. వేగంగా ఆస్పత్రికి చేరుకోవాలని భావిస్తాం. ఆస్పత్రికి వెళ్లాకే కొంత ధైర్యం తెచ్చుకుంటాం. వైద్యుడు వచ్చి ట్రీట్‌మెంట్ ప్రారంభిస్తే ప్రాణం నిలుస్తుందని అనుకుంటాం. వైద్యుడు ఇక్కడ కాదు ఇంకో ఆస్పత్రికి వెళ్లాలని చెబితే నిరాశ పడతాం. అక్కడకు వెళ్లాక మరో ఆస్పత్రికి తీసుకువెళ్లాలని రిఫర్ చేస్తే పూర్తిగా డైలమాలో పడతాం. జిల్లాలో ఇదే జరుగుతోంది. ప్రమాద బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందడం లేదు. రిఫరల్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలోనూ వైద్యులు చేతులెత్తేస్తున్నారు. విశాఖ కేజీహెచ్‌కు తరలించాలంటున్నారు. ఈ ప్రయాణంలో ప్రాణం దైవాదీనంగా మారుతోంది. మరోవైపు రవాణా చార్జీలు పేదలకు ఆర్థిక భారంగా పరిణమిస్తున్నాయి.
------------------
విశాఖ-అరకు రోడ్డులో వారం కిందట జరిగిన ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడిని 108 సిబ్బంది శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రక్తం ఆగకపోవడంతో అక్కడి వైద్యులు విజయనగరం కేంద్ర ఆసుపత్రికి రిఫర్ చేశారు. పరిస్థితిని గమనించిన కేంద్ర ఆసుపత్రి వైద్యులు విశాఖ కేజీహెచ్‌కు తీసుకుపోవాలని సూచించారు. భయపడిన కుటుంబ సభ్యులు విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడా నయం కాకపోవడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ క్రమంలో రూ.16వేల వరకు అంబులెన్స్ ఖర్చులయ్యాయి. అదే సమయంలో క్షతగాత్రుడి పరిస్థితి మరింత విషమంగా మారింది. యువకుడిని పరిశీలించిన కేజీహెచ్ వైద్యులు కాలు తీసేయాల్సి రావొచ్చేమో అని అనుమానం వ్యక్తం చేశారు. అలస్యం చేసిన కుటుంబ సభ్యులకు చీవాట్లు పెట్టారు. రెండు రోజుల క్రితం కాలుకు శస్త్ర చికిత్స జరిగింది. అదృష్టవశాత్తు కోలుకున్నాడు. కానీ త్రుటిలో పెద్ద అపాయం నుంచి గట్టెక్కాడు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రమాద బాధితులకు అందుతున్న వైద్యానికి ఇదొక ఉదాహరణ.
----------------------
శృంగవరపుకోట, జూన్ 10 (ఆంధ్రజ్యోతి):జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు ఆపదలో వచ్చే రోగులు, క్షతగాత్రులకు ఏమాత్రం భరోసా ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్తే క్షేమంగా ఉంటారో లేదోనన్న అనుమానం కలుగుతోంది. ఆస్పత్రులపై ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఏమవుతుందో తెలియడం లేదని సగటు పౌరులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కొన్ని సామాజిక ఆసుపత్రులను ప్రాంతీయ ఆసుపత్రులుగా తీర్చిదిద్దారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య కళాశాలగా మార్చారు. అన్ని రకాల వైద్య పరీక్షలు చేసేందుకు సిబ్బందిని, నిపుణులైన వైద్యులను నియమించారు. భవనాల విస్తరణకు రూ.కోట్లలో వ్యయం అవుతోంది. ఎస్.కోట, గజపతినగరం వంటి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రుల్లో భవనాలను విస్తరించారు. చాలా ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు అందుబాటులో వున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్యసేవ) ఉంది. దీంట్లో వైద్యం అందిస్తే ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. ఇలా చెల్లించిన సొమ్ములో వైద్యులు, సిబ్బంది రుసుంతో పాటు ఆసుపత్రి పరికరాలు సమకూర్చుకోనేందుకు, మెరుగైన చికిత్స చేయగలిగిన వైద్యులను నియమించుకొనేందుకు వెసలుబాటు ఉంది. అయినప్పటికీ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన బాధితులకు స్థానికంగా వైద్యం అందడం లేదు. వేరే ఆసుపత్రికి తరలించేందుకే మొగ్గు చూపుతున్నారు. లేదంటే జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చేతులు దులుపుకుంటున్నారు. అక్కడా బాధితులకు నిరాశే ఎదురవుతోంది.
ఆర్థికంగా అగచాట్లు
ఒక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మరో ప్రభుత్వ ఆసుపత్రికి క్షేతగాత్రులను పంపిస్తున్న విషయం తెలుసుకుంటున్న స్థానిక ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు ఆరోగ్యశ్రీను అడ్డం పెట్టుకొని తాము వైద్యం చేసేస్తామంటూ ముందుకు వస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరేలా ఈ యాజమాన్యాలు ఏర్పాటు చేసుకున్న నెట్‌వర్కు ద్వారా గాలం వేస్తున్నాయి. ఆపై ఆరోగ్యశ్రీలో పేరు నమోదయ్యే వరకు ఖర్చులు పెట్టుకోవాలని మెలకపెడుతున్నారు. ఈలోపు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పిండేస్తున్నారు. వైద్యం అందించడం సాధ్యం కాకపోతే వీరి ఆసుపత్రులకు చెందిన అంబులెన్స్‌లో పేదవారినైతే విశాఖ కేజీహెచ్‌కు, స్థోమత వున్నవారిని అయితే పేరున్న ప్రైవేటు ఆసుపత్రులకు పంపించేస్తున్నారు. ఆసుపత్రి నుంచి ఆసుపత్రికి తిప్పుతున్న క్రమంలో క్షతగాత్రులు నలిగిపోతున్నారు. అనవసర రవాణా ఖర్చులకు ఆర్థికంగా దివాలా తీస్తున్నారు.
కేజీహెచ్‌కు 108 వాహనాలు వెళ్లక అవస్థలు
జిల్లా ఆస్పత్రుల నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించాల్సి వచ్చే రోగులకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జిల్లా మారిపోవడంతో 108 వాహన సిబ్బంది రామంటున్నారు. ఎస్.కోట లాంటి ప్రాంతాల్లోని రోగులు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం వరకు అయితే 108 వాహనం ఉంటుందని, అక్కడి ఆస్పత్రిలో చూపించుకోవాలని వాహన సిబ్బంది చెబుతున్నారు. ఒక్కోసారి అక్కడి వైద్యులు కూడా చికిత్స అందించలేక చేతులు ఎత్తేస్తున్నారు. విశాఖపట్టణం కేజీహెచ్‌కు తరలించాలని చెప్పేస్తున్నారు. చేసేదేమీలేక అప్పోసప్పో చేసి ప్రైవేటు అంబులెన్స్‌ల్లో రోగులను తీసుకువెళుతున్నారు. దీనివల్ల రోగులు కూడా నలిగిపోతున్నారు. ఎస్.కోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి నుంచి రోగులను నేరుగా విశాఖ కేజీహెచ్‌కు తరలించేలా చర్యలు చేపట్టాలని పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులు ఐదేళ్లుగా మండల సర్యసభ్య సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు. ఇతర చోట్లా ఇదే డిమాండ్ ఉంది. అయినా జిల్లా ప్రజలకు నిరాశే మిగులుతోంది.