చక్కెర వ్యాధికి కళ్లెం వేద్దాం
ABN , Publish Date - Nov 14 , 2026 | 12:33 AM
ఒకప్పుడు వయసు పైబడిన వారిలో డయాబెటిస్ (మధుమేహం) ఎక్కువగా కనిపించేది.
-చిన్న వయసులోనే మధుమేహం ముప్పు
- నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం
- ఆహార నియమాలు, వ్యాయామంతో రక్షణ
- నేడు వరల్డ్ డయాబెటిస్ డే
విజయనగరం రింగురోడ్డు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు వయసు పైబడిన వారిలో డయాబెటిస్ (మధుమేహం) ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు యువతను కూడా వెంటాడుతోంది. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం, అధిక బరువు, అనారోగ్యపు ఆహార అలవాట్లు ఈ సమస్యకు ప్రధాన కారణాలు. చాలా మందిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకుండానే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. గుర్తించే సమయానికి గుండె, మూత్రపిండాలు, కళ్లు, నరాలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. ముందస్తు పరీక్షలు, సమతుల్య ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం, వైద్యుల సూచనల మేరకు ఔషధాలు తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చును. శనివారం వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా కథనం.
డయాబెటిస్ అంటే..
శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్ షుగర్ లెవెల్స్) ఎక్కువగా ఉంటే డయాబె టిస్ వస్తుంది. మన శరీరంలో ఇన్సులిన్ అనే పదార్థం మన ఆహారంలో ఉన్న చక్కెరను శరీరానికి అవసరమైన శక్తిగా మార్చు తుంది. అది తగ్గిపోయినా లేదా పనిచేయకపోయినా చక్కెర రక్తంలో చేరి ఎక్కువ అవుతుంది. దానినే ‘డయాబెటిస్’ అంటారు. శరీరంలో ఇన్సులిన్ లేకపోవడం టైప్-1గా, ఇన్సులిన్ ఉన్నా పనిచేయకపోవడాన్ని టైప్-2 డయాబెటిస్‌గా గుర్తిస్తారు.
- టైప్-1 డయాబెటిస్ : ఇది సాధారణంగా పిల్లల్లో, యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం పూర్తిగా ఆపేస్తుంది. కాబట్టి ఈ రకం రోగులు రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. ఇది ఎక్కువ హెరి డటరీ కారణంగా వస్తుంది. దీన్ని ‘ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్’ అంటారు.
- టైప్ 2 డయాబెటీస్: ఇది పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్సులిన్ శరీరంలో తయారవుతుంది. కానీ జీవనశైల్లిలో మార్పులు కారణంగా అది సరిగ్గా పనిచేయదు. ప్రధాన కారణాలు ఏమిటంటే.. ఆహారంలో ఎక్కువ చక్కెర, కొవ్వు ఉండడం వ్యాయామం లేకపోవడం, బరువు ఎక్కువగా ఉండటం, ఒత్తిడి, నిద్రలేమి. దీనిని ‘నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్’ అంటారు.
లక్షణాలివీ..
తరచూ మూత్రానికి వెళ్లడం. ఎక్కువ దాహం వేయడం. బరువు తగ్గడం. అలసట, నిద్రలేమి, చిన్నగాయాలు త్వరగా మానకపోవడం, చూపు మసకబారడం.. వంటివి డయాబెటిస్ లక్షణాలు. వారసత్వంగా కూడా కొందరికి డయాబెటిస్ వస్తుంది. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే రక్తంలో చక్కెర స్థాయి పరీక్ష (బ్లడ్ షుగర్ టెస్ట్) చేయించుకోవాలి.
- ఉదయం ఆహారం తినకముందు ఎఫ్‌బీఎస్(ఫాస్టింగ్ బ్లడ్ షుగర్) పరీక్ష చేయించుకోవాలి. ఇది సాధారణంగా 70-100 ఎంజీ/డీఎల్ ఉండాలి. 126 ఉంటే మధుమేహం ఉన్నట్లు అర్థం.
- భోజనం చేసిన రెండు గంటల తర్వాత పీపీబీఎస్(పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్) పరీక్ష చేయించాలి. 140 ఎంజీ/ డీఎల్ ఉండాలి. అదే 200 ఉంటే డయాబెటీస్ ఉందని అర్ధం.
జిల్లాలో కేసులు ఇలా
సంవత్సరం నమోదైన కేసులు
2024 1,44,952
2025 1,90,270
2026 అక్టోబరు వరకూ 2,70,300
తినాల్సిన ఆహార పదార్ధాలు ఇవే
ఒక్కసారిగా అన్నం పూర్తిగా మానేయడం కంటే పరిమాణాన్ని నియంత్రించడం, పీచు పదార్ధాలు పెంచడం ముఖ్యం. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, శెనగలు, పెసలు, రాజ్మా, ఓట్స్ రాగులు, జొన్నలు, సజ్జలు, ఇతర సంపూర్ణ ధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. జామ, నారింజ, ఆపిల్, బత్తాయి వంటి పండ్లను రసాలుగా కాకుండా ముక్కల రూపంలో తీసుకోవాలి. గింజలు, నట్స్ తగిన పరిమాణంలో ఆహారంగా చేర్చుకోవాలి. అలాగే ఓమేగా-3 కలిగిన చేపలు, గుడ్లు, పెరుగు, మజ్జిగ వంటి ఆహారం తీసుకోవడం ద్వారా డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చును.
తాగకూడనివి.. తినకూడనివి
సోడాలు, కూల్‌డ్రింక్‌లు, కేక్‌లు, మిఠాయిలు, ఐస్‌క్రీములు, చాక్‌లైట్స్, టీ, కాఫీ, తెల్లటిఅన్నం, మైదాతో చేసిన బ్రెడ్లు, బిస్కెట్లు, పూరీలు, ప్రాసెస్ చేసిన అల్పాహారాలు, పిజ్జాలు, బర్గర్‌లు, గొర్రె, మేక మాంసం మానేయాలి.
- ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వేగంగా నడవాలి. వారంలో రెండు రోజులు కండరాలు బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వాళ్లు మధ్యమధ్యలో లేచి నడవాలి. తగిన నిద్ర, బరువుల నియంత్రణ, ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి.
జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి
డయాబెటిస్ అనేది నివారించదగిన, నియంత్రించదగిన వ్యాధి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా కట్టడి చేయవచ్చును. కేవలం మందులపై ఆధారపడకుండా ఆహార అలవాట్లపై దృష్టి పెట్టాలి. తక్కువ కార్బోహైడ్రేట్‌లు కలిగి, ఎక్కువ ఫైబర్ ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. బరువును నియంత్రించడం ద్వారా 90 శాతం మధుమేహాన్ని అడ్డుకోవచ్చును. మధుమేహం ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటూ, ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర ఉన్న పానీయాలు, జంక్ ఫుడ్స్ మానేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవడం, సరైన నిద్ర, వ్యాయామంతో ఇన్సులిన్ మెరుగుపడుతుంది.
-డాక్టర్ జి.మురళీకృష్ణ, డయాబెటిస్ స్పెషలిస్టు, ప్రభుత్వ సర్వజనాసుపత్రి, విజయనగరం