Share News

పర్యావరణాన్ని కాపాడుదాం

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:26 PM

పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి అన్నారు.

 పర్యావరణాన్ని కాపాడుదాం
పర్యావరణంపై పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి తదితరులు

- కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై వర్క్‌షాపు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఈ నేపథ్యంలో పర్యావరణ సమతుల్యతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సూపర్‌ ఎల్‌నీనో ప్రభావంతో వర్షపాతంలో మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, కరువు, వరదలు వంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నారు. దేశంలో రుతుపవనాలు, వ్యవసాయం, నీటి వనరులు, ప్రజారోగ్యంపై ప్రభావం ఉండవచ్చని అన్నారు. నీటి సంరక్షణ, వర్షంనీటి నిల్వ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్‌ వినియోగం తగ్గింపు వంటి చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ సత్తిబాబు, డాక్టర్‌ కోట చంద్రభూషణరావు, మున్సిపల్‌ ఇంజనీరు పీవీఎస్‌ ప్రసాద్‌, ఫారెస్టు రేంజ్‌ అధికారి రామనరేష్‌, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 11:26 PM