Our Leader…! తమ నాయకుడికి బహుమానంగా ఇద్దామని..!
ABN , Publish Date - May 06 , 2026 | 11:42 PM
Let’s Present It as a Gift to Our Leader…! ఆయన పార్వతీపురం నియోజకర్గానికి చెందిన అధికార పార్టీ నాయకుడు. ఆయన కోసం కొందరు ద్వితీయశ్రేణి నాయకులు ఓ ఘన కార్యం చేసేశారు. ఇంటి నిర్మాణం చేపడుతున్న ఆ నాయకునికి తమ బహుమానంగా టేకుతో కలప సామగ్రిని తయారుచేసి ఇద్దామని భావించారు. ఇంకేముంది.. పార్వతీపురం మండలం అడారు పాఠశాలలో 14 టేకు చెట్లను అక్రమంగా నరికి టింబర్ డిపోనకు తరలించారు.
అధికారపార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల అత్యుత్సాహం
పోయిన చెట్లు 14.. లభ్యమైనవి ఆరు మాత్రమే..
మిగిలిన ఎనిమిది చెట్ల టేకు దుంగలు ఎక్కడ..?
పార్వతీపురం, మే6(ఆంధ్రజ్యోతి): ఆయన పార్వతీపురం నియోజకర్గానికి చెందిన అధికార పార్టీ నాయకుడు. ఆయన కోసం కొందరు ద్వితీయశ్రేణి నాయకులు ఓ ఘన కార్యం చేసేశారు. ఇంటి నిర్మాణం చేపడుతున్న ఆ నాయకునికి తమ బహుమానంగా టేకుతో కలప సామగ్రిని తయారుచేసి ఇద్దామని భావించారు. ఇంకేముంది.. పార్వతీపురం మండలం అడారు పాఠశాలలో 14 టేకు చెట్లను అక్రమంగా నరికి టింబర్ డిపోనకు తరలించారు. దీనిపై పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జిల్లా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే 14 టేకు చెట్లలో ఆరు చెట్ల దుంగలు లభించగా.. మిగతా ఎనిమిది చెట్ల సంగతి ఏమటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఇదీ పరిస్థితి..
- ఓ వైపు గ్రామ దేవత పండుగ.. మరోవైపు వేసవి సెలవులు. ఇదే అదునుగా.. పార్వతీపురం మండలం అడారు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గత నెల 26న ఆదివారం రాత్రి 14 టేకు చెట్లను అక్రమంగా నరికి నిడగళ్లు టింబర్ డిపోనకు తరలించేశారు. సీతానగరం, పార్వతీపురం మండలాలకు చెందిన కొంతమంది టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఆధ్వర్యంలో ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది.
- దీన్ని గుర్తించిన హెచ్‌ఎం గోపమ్మ గత నెల 30న రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారితో పాటు తహసీల్దార్ సత్యనారాయణ, సాలూరు రేంజర్ తవిటినాయుడు తదితరులు పాఠశాల వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. 12 టేకు చెట్లు అక్రమంగా నరికి తరలించేశారని హెచ్‌ఎం ఫిర్యాదులో పేర్కొనగా.. ఆ ప్రాంతంలో 14 చెట్లు పోయినట్టు తహసీల్దార్ దర్యాప్తులో తేలింది. అక్రమంగా నరికి తరలించిన టేకు చెట్లు విలువ సుమారు రూ.7.5 లక్షలని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కాగా నిడగళ్లు టింబర్ డిపోలో లభ్యమైన టేకు దుంగలు అడారు పాఠశాలకు చెందినవిగా అధికారులు గుర్తించారు. సీజ్ చేసిన కలపను సాలూరు అటవీశాఖ డిపోకు తరలించారు. అయితే మిగిలిన 8 చెట్లకు సంబంధించిన కలప ఎక్కడికి వెళ్లిందనేది తేలాల్సి ఉంది.
- పార్వతీపురం నియోజకవర్గంలో కొంతమంది టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుల తీరుపై టీడీపీ కేంద్ర కార్యాలయం, రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి. మరోవైపు అటవీశాఖాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా వారి వైఖరితో ప్రభు త్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెచ్చారని పలువురు కార్యకర్తలు, నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
- జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో దశాబ్దాలుగా పెరుగుతున్న టేకు చెట్లుకు రక్షణ లేకుండా పోయింది. కొంతమంది యథేచ్ఛగా వాటిని నరికి.. సొమ్ము చేసుకుంటున్నా.. చర్యలు కానరావడం లేదు. పాఠశాలల్లో పెరుగుతున్న టేకు చెట్లుపై రెవెన్యూ, విద్యా శాఖల సిబ్బంది పర్యవేక్షణ కూడా కొరవడడం .. అక్రమార్కులకు కలిసొస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ ప్రభుత్వ హయాంలో గంగాపురం పాఠశాలలోని 14 టేకు చెట్లు అక్రమంగా తరలించేశారు. దీనిపై ఆ గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు తిరుపతినాయుడు అప్పట్లో విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేకపోయింది.
బాధ్యులపై చర్యలు
అడారు పాఠశాలలో నరికిన 14 టేకు చెట్లు ఏ డిపో పరిధిలోకి వెళ్లాయానే దానిపై దర్యాప్తు చేపడుతున్నాం. నిడగళ్లు డిపోలో ఆరు చెట్లకు సంబంధించిన టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నాం. మిగిలిన 8 చెట్ల టేకు దుంగలు దొరకాల్సి ఉంది. 14 టేకు చెట్లు విలువ రూ.7.5 లక్షలుగా గుర్తించాం. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత బాధ్యులపై అటవీశాఖ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం.
- ప్రసూన, డీఎఫ్‌వో, పార్వతీపురం మన్యం
================================
కలెక్టర్‌కు నివేదిక అందిస్తాం
అడారు పాఠశాల వద్ద 14 టేకు చెట్లు అక్రమంగా నరికి తరలించేశారని ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టాం. ఈ నివేదికను కలెక్టర్‌కు అందిస్తాం.
- సత్యనారాయణ, తహసీల్దార్, పార్వతీపురం