Waterfalls జలపాతాలు .. చూసొద్దాం రండి
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:39 PM
Let’s Go and Explore the Waterfalls ప్రకృతి సహజసిద్ధ అందాలకు నెలవు మన్యం జిల్లా. ఎత్తయిన కొండలు.. వ్యూపాయింట్లు.. జలపాతాలు.. ఆహ్లాదకర, ఆధ్యాత్మిక ప్రాంతాలకు కొదవే లేదు. అందుకే ఇక్కడకు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. మన్యం ప్రకృతి రమణీయ దృశ్యాలకు సందర్శకులు ఫిదా అవుతున్నారు.
మనసుదోచే వాటర్‌ఫాల్స్
పర్యాటక అభివృద్ధికి చర్యలు
పార్వతీపురం, ఫిబ్రవరి4(ఆంధ్రజ్యోతి): ప్రకృతి సహజసిద్ధ అందాలకు నెలవు మన్యం జిల్లా. ఎత్తయిన కొండలు.. వ్యూపాయింట్లు.. జలపాతాలు.. ఆహ్లాదకర, ఆధ్యాత్మిక ప్రాంతాలకు కొదవే లేదు. అందుకే ఇక్కడకు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. మన్యం ప్రకృతి రమణీయ దృశ్యాలకు సందర్శకులు ఫిదా అవుతున్నారు. ప్రధానంగా తాటికొండ, నల్లరాయిగూడ, నీలంవలస, దళాయివలస, అడపరాయి, శిఖపరుపు, మెట్టుగూడ, కుశ, లొద్ద జలపాతాల అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టి పడేస్తున్నాయి. మూడు నెలల వ్యవధిలోనే మూడు లక్షల మంది పర్యా టకులు ఆయా జలపాతాలను సందర్శించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక నిధులు లేకపోయినా మన్యంలో జలపాతాల అభివృద్ధికి జిల్లా అధికారులు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చొరవతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నారు. హోం స్టేలతో పాటు ట్రెక్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జల పాతాల ప్రాంతా లను స్థానిక గిరిజనుల సహాయ సహకారాలతో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- జిల్లాలో సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, మక్కువ, సాలూరు తదితర మండలాల్లో ఎన్నో జలపాతాలు ఉన్నాయి. వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే స్థానిక గిరిజన యువతతో పాటు మరెందరికో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. జిల్లాకు కూడా ఆదాయం పెరగనుంది. అయితే ఇప్పటికే జలపాతాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మన్యం జలపాతాలను రాష్ట్రస్థాయిలో పర్యాటకంగా గుర్తింపు తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. కలెక్టర్ , మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో తోణాం, దళాయివలస, కుశ జలపాతాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. కుశ, తోణాం, దళాయివలస జలపాతాలకు ప్రతి శని, ఆదివారాల్లో బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ డ్రివెన్ టూరిజంలో భాగంగా జలపాతాలను కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అభివృద్ధి చేస్తున్నారు. పర్యాటకులు కూర్చోవడానికి, దుస్తులు మార్చుకోవడానికి వీలుగా స్థానిక గిరిజనులతో ఏర్పాట్లు చేయిస్తున్నారు.
- సాలూరు మండలం కొదమ పంచాయతీ పరిధి మహాలొద్ద జలపాతానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సుమారు 100 అడుగుల పైనుంచి జాలువారే జలధారలు, పచ్చని వాతావరణం పర్యాట కులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. కొదమ గ్రామం చేరుకున్న తర్వాత లొద్ద జలపాతం వద్దకు వెళ్లాంటే సుమారు రెండు కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో నడవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక గిరిజన యువత పర్యాటకులను దగ్గరుండి జలపాతాల వద్దకు తీసుకెళ్లడంతో పాటు వారిని తిరిగి తీసుకొచ్చే బాధ్యతను కూడా చూసుకుంటున్నారు. కొందరు గ్రామస్థులు ఇప్పటికే శ్రమదానం చేసి సందర్శకులు వెళ్లేందుకు వీలుగా కొంతమేర రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. వెదురుతో కుర్చీలతో పాటు బల్లలు, ఆర్చీలు, వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు గిరిజన యువకులు వన సంరక్షణ సమితులుగా ఏర్పడి సందర్శకులకు అన్ని విధాలా గైడ్ చేస్తూ .. పర్యాటక అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తున్నారు. మరికొందరు గిరిపుత్రులు అటవీ ఉత్పత్తులైన అడవితేనె, చింతపండు, చీపుర్లు, జీడిపిక్కలు తదితర వాటిని పర్యాటకులకు విక్రయించి ఉపాధి పొందుతున్నారు.
- సాలూరు రూరల్: తూర్పు కనుమల్లో ప్రకృతి అందాల సోయగాల మధ్య మహాలొద్ద జలపాతం ఉందని కలెక్టర్ తెలుసుకున్నారు. దీనిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే తలంపుతో గతేడాది అక్టోబరు 19 అధికారులతో కలసి బయల్దేరారు. వాహనాల్లో మాసికవలస వెళ్లి అక్కడ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లి జలపాతాన్ని పరిశీలించారు. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే కలిగే ప్రయోజనాలను జలపాతం వద్దే అధికారులతో సమీక్షించారు. అప్పటి నుంచి ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. ఫలితంగా పర్యాటకులకు సుందరమైన లొద్ద జలపాతం అందుబాటులోకి వచ్చింది.
నేడు లొద్ద జలపాతం వద్ద సౌకర్యాలు ప్రారంభం
మహాలొద్ద జలపాతం వద్ద పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక వసతులను గురువారం ప్రారంభించనున్నట్టు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి బుధవారం చెప్పారు. కలెక్టరేట్‌లో విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరవుతారు. నంద నుంచి యువత భారీ బైక్ ర్యాలీతో జలపాతం వద్దకు చేరుకుం టారు. సందర్శకుల కోసం జీపులను సైతం అందుబాటులో ఉంచుతాం. జిల్లాలోనే అత్యంత ఎత్తయిన.. ఆకర్షణీయ వాటర్‌ఫాల్స్‌లో లొద్ద జలపాతం ఒకటి. ట్రెక్కింగ్ చేసే వారికి, ప్రకృతి ప్రేమికులు, అడ్వంచర్ పర్యాటకులకు ఇది సరికొత్త అనుభూతిని ఇస్తుంది. మరో వైపు గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సందర్శకుల కోసం ఈ ప్రాంతంలో అతిఽథి గృహాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. జిల్లాలోని ఏడు జలపాతాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ప్రతి జలపాతం వద్ద పర్యాటకులకు అవసరమైన మౌలి వసతులు ఏర్పాటు చేస్తాం. లొద్ద జలపాతానికి గ్లోబల్ ఏకో టూరిజం గుర్తింపునిచ్చి పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ’ అని తెలిపారు.
ఏర్పాట్లు పరిశీలించిన సబ్ కలెక్టర్
సాలూరు రూరల్, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): మహాలొద్ద జలపాతం వద్ద ఏర్పాట్లను బుధవారం సబ్‌కలెక్టర్ వైశాలి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.
సహకారం అందిస్తున్నాం..
జిల్లాలో జలపాతాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నాం. లొద్ద, కుశ జలపాతాలకు వెళ్లేందుకు వీలుగా రోడ్ల నిర్మాణం చేపడతాం. పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఆర్టీసీ సేవలను అందుబాటులోకి తెచ్చాం.
- గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి