let's go వెళ్లొస్తాం
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:14 AM
let's go సంక్రాంతి పండగకు వచ్చిన వారంతా వెళ్లొస్తాం అంటూ తాము ఉంటున్న ప్రాంతాలకు తిరిగి ప్రయాణమయ్యారు. అందరికీ టాటా చెబుతూ బయలుదేరారు. బరువెక్కిన గుండెతో కనిపిస్తున్నారు. సొంతూరును వీడలేక బంధువులను వదలలేక నిరాశతో వెళ్తున్నారు.
వెళ్లొస్తాం
తిరుగుప్రయాణమైన జిల్లా వాసులు
రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్లు కిటకిట
విజయనగరం రూరల్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగకు వచ్చిన వారంతా వెళ్లొస్తాం అంటూ తాము ఉంటున్న ప్రాంతాలకు తిరిగి ప్రయాణమయ్యారు. అందరికీ టాటా చెబుతూ బయలుదేరారు. బరువెక్కిన గుండెతో కనిపిస్తున్నారు. సొంతూరును వీడలేక బంధువులను వదలలేక నిరాశతో వెళ్తున్నారు.
ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, విద్య ఇలా కారణం ఏదైతేనేం విదేశాలు, ఇతర రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సొంతూళ్లకు వచ్చారు. నాలుగైదు రోజులు తమ కుటుంబాలతో కలిసి, పాతజ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ, పండగను సరదాగా జరుపుకుని తిరిగి వెళ్తున్నారు. శనివారం నుంచే జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కన్పించింది. ఆదివారం ఈ రద్దీ కాస్త ఎక్కువైంది. ఉదయం నుంచే విజయనగరం, చీపురుపల్లి, రాజాం, బొబ్బిలి, ఎస్.కోట, గజపతినగరం, సంతకవిటి, వంగర ఆర్టీసీ కాంప్లెక్స్‌లు బిజీగా కన్పించాయి. రైల్వే స్టేషన్లు విషయానికి వస్తే గజపతినగరం, బొబ్బిలి, ఎస్.కోట తదితర రైల్వే స్టేషన్లు ఆదివారం కిటకిటలాడాయి. విజయనగరం రైల్వేస్టేషన్ కిక్కిరిసిపోయింది. తాము ఎక్కాల్సిన రైళ్ల సమయం చూసుకుని రైల్వేస్టేషన్‌కు చేరుకుని నిరీక్షించారు. బస్సులు రద్దీగా మారడంతో కొంతమంది ప్రయాణికులు ప్రైవేటు రవాణాను ఆశ్రయించారు.
మళ్లీ సంక్రాంతి కోసం చూస్తాను
శ్రీజ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, విజయనగరం
ఐదేళ్లుగా బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. ఏటా సంక్రాంతికి పది రోజుల ముందే విజయనగరం చేరుకుంటాను. పండగను అందరం కలిసి ఆనందంగా జరుపుకున్నాం. సోమవారం నైట్ షిఫ్ట్ విధులకు హాజరుకావాల్సి ఉంది. తిరిగి సంక్రాంతి ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తుంటాను.
కొంచెం బాధగా ఉంది
ఎన్‌వీ కిషోర్, ప్రైవేటు ఉద్యోగి, విజయనగరం
అందరం కలిసి సంక్రాంతి పండగను సంతోషంగా జరుపుకున్నాం. ఈ రోజులు మరిచిపోలేనివి. గత మూడేళ్లుగా హైదరాబాదులో ఉంటున్నాను. ఏటా సంక్రాంతికి ముందే విజయనగరం చేరుకుంటాను. తిరిగి వెళ్తున్నప్పుడు కొంచెం బాధగా ఉంది. మళ్లీ సంక్రాంతికి తప్పకుండా విజయనగరం వస్తాను.