let's encroach upon them.చెరువులే కదా.. కబ్జా చేద్దాం
ABN , Publish Date - Jul 02 , 2026 | 12:26 AM
let's encroach upon them. ఒకరు అధికార పార్టీ అండ చూసి రెచ్చిపోతున్నారు. మరొకరు నిరుపేదలమంటూ నెపం నెడుతున్నారు. ఇంకొకరు సంతానం ఎక్కువ.. బతకడం కష్టమంటూ సాకులు వెతుకుతున్నారు. కారణాలు ఏవైతేనేం...ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు.
చెరువులే కదా.. కబ్జా చేద్దాం
బొబ్బిలి మండలంలో ఇష్టారాజ్యంగా ఆక్రమణలు
అడిగితే ఏవేవో సాకులు
నేతల అండతో బరితెగిస్తున్న వైనం
తెలిసీ అడ్డుకోని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు
ఒకరు అధికార పార్టీ అండ చూసి రెచ్చిపోతున్నారు. మరొకరు నిరుపేదలమంటూ నెపం నెడుతున్నారు. ఇంకొకరు సంతానం ఎక్కువ.. బతకడం కష్టమంటూ సాకులు వెతుకుతున్నారు. కారణాలు ఏవైతేనేం...ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు పాగా వేస్తున్నారు. చివరకు జీవకోటికి ఆధారమైన సాగునీటి చెరువులు, నదీ గర్భాలను కూడా వదలకుండా అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. బొబ్బిలి మండలంలో సాగునీటి వనరులు అక్రమార్కుల చేతుల్లో బందీ అవుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
బొబ్బిలి రూరల్, జూలై 1(ఆంధ్రజ్యోతి):
చెరువులు, జలాశయాలు, నదీగర్భాలు ప్రకృతి ఇచ్చిన అపూర్వ వనరులు. వాటిని వినియోగించుకుని బతకాలి కాని కబళించి బతకాలని చూస్తున్నారు. సమీప భూములను సస్యశ్యామలం చేసుకోవడం మానేసి నీరు అందిస్తున్న వనరునే స్వాహా చేయాలనుకుంటున్నారు. బొబ్బిలి మండలంలో కొంతకాలంగా ఈ పోకడ నడుస్తోంది. ఒకరిని చూసి మరొకరు ప్రభుత్వ భూములపై పడుతున్నారు. అడ్డువస్తే తిరగబడుతున్నారు. లేదంటే నాయకుల పేరు చెబుతు న్నారు. వారిని నిలువరించడానికి క్షేత్రస్థాయి అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఉన్నతాధికా రులు పట్టించుకోవడం లేదు. కబ్జాదారుల భూదాహానికి ఇవే నిదర్శనాలు.
- కాశిందొరవలస: గ్రామంలోని కంచరగెడ్డలో సుమారు 3 ఎకరాల ప్రభుత్వ భూమిని గత ఏడాది కాలంగా ఓ వ్యక్తి కబ్జా చేసి ఎంచక్కా మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. తాను అధికార పార్టీ నాయకుడినని చెప్పుకుంటూ చెలామణి అవుతుండటంతో అధికారులు అటువైపు చూడటానికి భయపడుతున్నారు.
- చింతాడ: మంగలి చెరువు దాదాపు కనుమరుగయ్యే స్థితికి చేరింది. పక్క నుంచే సాగునీటి కాలువ వెళ్తుండటంతో ఇక చెరువుతో పనేముంది ? అనుకున్నారేమో ఏకంగా చెరువులో సగ భాగాన్ని కబ్జా చేసి పంటలు వేసేశారు.
- పారాది: వేగావతి నదీ గర్భంలో సుమారు 3 ఎకరాలను ఓ రైతు ఆక్రమించి మొక్కజొన్న సాగు చేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.
- గోపాలరాయుడుపేట: స్థానిక వెంకటరాయుడుపేట చెరువును కొంతమంది కబ్జా చేయడానికి చెరువు గర్భంలో తాజాగా మట్టి వేసి చదును చేస్తున్నారు.
- దిబ్బగుడ్డివలస: రంగరావుచెరువు గట్టుకు, ప్రధాన రహదారికి మధ్యలో ఉన్న ప్రభుత్వ భూమి స్థలాన్ని ఇటీవల సీతయ్యపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కబ్జా చేసి సాగు చేస్తున్నాడు. దీనిపై ప్రశ్నిస్తే... ‘నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు’... భూములు లేవు అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు.
అధికారుల కనుసన్నల్లోనే...
చెరువుల ఆక్రమణలన్నీ క్షేత్రస్థాయి అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రెవెన్యూ యంత్రాంగంతో లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని పలువురు ఆరోపించారు. వాల్టా చట్టం ప్రకారం జల వనరులను ఆక్రమించడం, నదీ గర్భాలను పూడ్చడం తీవ్రమైన నేరం. ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అధికారులే ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు.
మొక్కుబడి చర్యలు
పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు మాత్రమే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కాస్త కదులుతున్నారు. ఆక్రమణ స్థలాల్లో ‘ఇది ప్రభుత్వ భూమి, ఆక్రమిస్తే చర్యలు తప్పవు’ అని ఒక బోర్డు పాతేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఆక్రమణలను శాశ్వతంగా తొలగించేలా.. కబ్జాదారులపై కేసులు పెట్టేలా చర్యలు తీసుకోవడం లేదు.