Share News

పశుగ్రాసం పెంచుదాం..

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:13 AM

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గత మూడు నెలలుగా సరైన వర్షాలు లేవు.

పశుగ్రాసం పెంచుదాం..
గజపతినగరం మండలం కొత్తబగ్గాంలో సాగు చేస్తున్న పశుగ్రాసం

-పాడిని కాపాడుకుందాం

- ఎల్‌నినో నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు

- జిల్లాలో 2,850ఎకరాల్లో పశుగ్రాసం పెంపకం లక్ష్యం

- వందశాతం రాయితీపై విత్తనాల సరఫరా

-రైతులు ముందుకురావాలంటున్న అధికారులు

గజపతినగరం/గంట్యాడ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గత మూడు నెలలుగా సరైన వర్షాలు లేవు. పలుచోట్ల సాగునీటితో పాటు తాగునీటి సమస్య ఏర్పడింది. ఎల్‌నినో ప్రభావం పశుగ్రాసంపై కూడా పడుతోంది. దీంతో పాడి పెంపకానికి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా పశుసంవర్ధక శాఖ వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా జిల్లాలో 2,850 ఎకరాల్లో పశుగ్రాసం పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. వందశాతం రాయితీపై పశుగ్రాస విత్తనాలను అందజేస్తుంది.

జిల్లాలో 2,81,891 ఆవులు, 62,648 గేదెలు, 4,87,232 గొర్రెలు, 1,70,613 మేకలు ఉన్నాయి. సుమారు 80వేల మంది వరకు పాడి రైతులు ఉన్నారు. పరోక్షంగా పాడిపరిశ్రమపై ఆధారపడి మరో లక్షమంది వరకు జీవనం సాగిస్తున్నారు. పాడి పరిశ్రమకు నష్టం జరిగితే వీరందరిపైనా ఆ ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో 2,850 ఎకరాల్లో పశుగ్రాసం సాగు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆసక్తి గల రైతులకు వందశాతం రాయితీపై విత్తనాలను సరఫరా చేస్తున్నారు. ఒక రైతు కనిష్టంగా పదిసెంట్లు, గరిష్టంగా 50సెంట్లలో పశుగ్రాసం సాగు చేయవచ్చు. వీబీజీ రామ్‌జీ పథకంలో జాబ్‌కార్డు ఉన్న ప్రతిరైతూ అర్హుడే. దరఖాస్తుతో పాటు 1బి, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు జిరాక్స్‌లను రైతు సేవాకేంద్రాల్లో గానీ, పశువైద్యాధికారికి గానీ అందజేయాలి. అధికారులు పరిశీలించి అర్హులైన రైతులను ఎంపిక చేస్తారు.

ఇలా చేయండి..

-ఎల్‌నినో నేపథ్యంలో జిల్లా పశుసంవర్ధక శాఖ పాడి రైతులకు పలు సూచనలు చేసింది. ప్రస్తుత సమయంలో పిల్లిపెసర వంటి ద్వంద ప్రయోజన పంటలు పశుగ్రాసంగా, పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపతాయి. పచ్చిమేతను ఒక్కసారిగా ఇవ్వకుండా క్రమంగా మేతలో కలిపి ఇవ్వాలి.

- ఎండిగడ్డిని ముందుగానే నిల్వ చేసుకోవాలి. కనీసం రెండు నుంచి మూడు నెలలకు సరిపడే ఎండుగడ్డిని ముందుగానే సేకరించి నిల్వ చేసుకోవాలి.

- వరి, గడ్డి, జొన్న , మొక్కజొన్న కాండాలు, ఇతర సురిక్షితమైన పంట అవశేషాలను వృథా చేయకుండా ఉపయోగించాలి.

- గడ్డిని తేమ లేకుండా, వర్షం పడకుండా భద్రపరచాలి. బూజు పట్టిన గడ్డిని పశువులకు ఇవ్వకూడదు.

-నీటి వసతి ఉన్న రైతులు పచ్చిమేత పంటలను సాగుచేయాలి.

- పశువులకు ప్రతిరోజూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. నీటి తొట్టెలను శుభ్రంగా ఉంచాలి. పాలుఇచ్చే పశువులకు తగిన పోషకాహారం అందించాలి. మధ్యాహ్నం సమయంలో వాటిని ఎండలో ఉంచకూడదు

అవగాహన కల్పిస్తున్నాం

పశుగ్రాసం పెంపకంపై పాడి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఎల్‌నినో ప్రభావం పాడిపై పడకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తున్నాం. గ్రాసం పెంపకానికి అవసరమయ్యే విత్తనాలను ఉచితంగా అందజేస్తున్నాం. రైతులు ముందుకురావాలి.

-చంద్రశేఖర్‌, ఏడీఏ, పశుసంవర్థకశాఖ గజపతినగరం

Updated Date - Sep 04 , 2026 | 12:13 AM