Tin Sheds రేకులషెడ్డుల్లోనే ఓనమాలు
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:56 AM
Lessons Under Tin Sheds సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన ప్రైమరీ స్కూల్స్ (జీపీఎస్) పరిస్థితి దయనీయంగా మారింది. చాలాచోట్ల పాఠశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. మరికొన్ని రేకుల షెడ్డుల్లోనే నడుస్తున్నాయి. దీంతో గిరిజన చిన్నారులకు వసతి సమస్య వేధిస్తుండగా.. వారి చదువులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
కూలుతున్న పాత భవనాలు
కొన్నిచోట్ల రేకులషెడ్డుల్లోనేచదువులు
గిరిజన విద్యార్థులను వెం‘బడి’స్తున్న వసతి సమస్య
పక్కా భవనాలు లేక అవస్థలు
పెరుగుతున్న డ్రాపౌట్లు
భయంగుప్పిట్లో తల్లిదండ్రులు
సీతంపేట, జూలై26(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన ప్రైమరీ స్కూల్స్ (జీపీఎస్) పరిస్థితి దయనీయంగా మారింది. చాలాచోట్ల పాఠశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. మరికొన్ని రేకుల షెడ్డుల్లోనే నడుస్తున్నాయి. దీంతో గిరిజన చిన్నారులకు వసతి సమస్య వేధిస్తుండగా.. వారి చదువులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. నేటికీ పరాయి పంచనే కొన్నిచోట్ల విద్యార్థులు విద్యనభ్యసించాల్సి వస్తోంది. కాగా వర్షాకాలంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు కూలి పోతుండడంతో తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా.. ఈ పరిస్థితి మారకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అయితే ఇదే సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లో డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతోంది. గతంలో నాడు-నేడు పథకం కింద శిథిలావస్థలో ఉన్న జీపీ పాఠశాలలకు పక్కా భవనాల కోసం ప్రతిపాదనలు పంపినా.. నాటి వైసీపీ సర్కారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో గిరిపుత్రులు కూటమి ప్రభుత్వంపైనే ఆశలు పెట్టుకున్నారు.
ఇదీ పరిస్థితి..
సీతంపేట ఐటీడీఏ పరిధి ఉమ్మడి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా(ఎరెస్ట్‌వేల్ డిస్ర్టిక్ట్)లో మొత్తంగా 191 జీపీ పాఠశాలలు ఉన్నాయి. పిల్లలు లేని కారణంగా నందిగాం, మెళియాపుట్టి మండలాల పరిధిలో ఉన్న సొంటినూరు, చింతపల్లి గ్రామాల్లోని పాఠశాలలను ఎత్తివేశారు. దీంతో 189 పాఠశాలల్లో మొత్తంగా 3,831మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు.
- సీతంపేట మండలంలో 90 జీపీ పాఠశాలలు ఉండగా వీటిలో 2,266మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. పిల్లలు ఎక్కువ మంది ఉన్నా స్ర్టెంత్‌కు తగ్గ పాఠశాల భవనాలు పూర్తి స్థాయిలో లేవు. ఉన్న భవనాల్లో కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో పాఠశాలలు ప్రారంభించిన నాటి నుంచి రేకులషెడ్డుల్లోనే నిర్వహిస్తున్నారు.
- ఉమ్మడి జిల్లాలోని 189 జీపీ పాఠశాలల్లో 23 పాఠశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. మరో పది పాఠశాలలను రేకులషెడ్లలో నిర్వహిస్తున్నారు. గత ఏడాది 35 జీపీ పాఠశాలలకు నూతన భవనాల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇంకో 24 జీపీ పాఠశాలల భవనాలకు మైనర్ రిపేర్ల కోసం కూడా అస్టిమేట్లు వేసి ఉన్నతాధికారులకు నివేదించారు. పక్కా భవనాల మంజూరు కోసం ఏటా ప్రతిపాదనలు పంపుతున్నా అనుమతులు మాత్రం రావడం లేదు.
కూలుతున్న భవనాలు
- సీతంపేట ఏజెన్సీలో గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు దుగ్గి గ్రామంలో ఉన్న జీపీ పాఠశాల భవనం గోడ కూలిపోయింది. అయితే ఆ సమయంలో పాఠశాల మూసివేసి ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ పాఠశాలలో 34మంది చిన్నారులు చదువుతున్నారు. గ్రామంలో ఉన్న సామాజిక భవనంలో ప్రస్తుతానికి పాఠశాల నిర్వహించేలా గ్రామస్థులు ఏర్పాట్లు చేశారు.
- గొయిది పంచాయతీ పరిధి ఎగువదారబలోని 1986లో ఓ పూరిపాకలో జీపీ పాఠశాలను ప్రారంభించారు. అది వర్షాలకు కారిపోతుండడంతో కాలక్రమంలో రేకులషెడ్డును ఏర్పాటుచేశారు. రెండేళ్లు కిందట నుంచి రేకులషెడ్డులో ఈ జీపీ పాఠశాల నడుస్తోంది. అయితే గత ఏడాది వర్షాలకు పాఠశాల రేకులు దెబ్బతినగా.. గోడ కూలిపోయింది. దీనిపై ఆ ప్రాంత వాసులు ఐటీడీఏ అధికారులకు విన్నవించుకున్న ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో గ్రామస్థులు, తల్లి దండ్రులు కలిసి గ్రామంలో వారు నిర్మించుకున్న మరో రేకులషెడ్డును పాఠశాల కోసం కేటాయించారు. ప్రస్తుతానికి ఆ రేకులషెడ్డులోనే పాఠశాల నడుస్తోంది.
- రాయిలంక గ్రామంలోనూ రేకులషెడ్డులో జీపీ పాఠశాల నడుస్తోంది. అయితే గత ఏడాది వీచిన గాలులకు ఆ షెడ్డులో కూలిపోయింది. దీంతో గ్రామస్థులు అందరూ కలిసి రేకులషెడ్డును పునర్నిర్మించారు. పిల్లలకు వసతిసమస్య వెంటాడుతుండడంతో ఐటీడీఏ పరిధిలో డ్రాపౌట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది.
ఎంపీయూపీ పాఠశాలల్లో..
ఏజెన్సీలోని ఎంపీయూపీ పాఠశాలలు కూడా వసతి సమస్యతో సతమతమవుతున్నాయి. ఒకే భవనంలో రెండు లేక మూడు తరగతులు నిర్వహిస్తుండడంతో గిరిజన చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ఎనిమిది వరకు ఎంపీయూపీ పాఠశాలలు రేకులషెడ్డుల్లోనే నడుస్తున్నాయి.
ఏళ్లు గడుస్తున్నా..
ఏళ్లు గడుస్తున్నా.. ఎగువదారబ పాఠశాల పరిస్థితి మారడం లేదు. గ్రామంలో పాఠశాలను ఏర్పాటుచేసి సుమారు 40ఏళ్లు కావస్తోంది. ఇప్పటికీ మా పిల్లల చదువులు రేకుల షెడ్డుల్లోనే కొనసాగుతున్నాయి. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి.. పాఠశాల భవనం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి.
- సవర సీతయ్య, ఎగువదారబ
==============================
ఇన్‌చార్జి పీవో ఏమన్నారంటే..
‘ శిథిలావస్థలో ఉన్న జీపీ పాఠశాలలకు పక్కా భవనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. జీపీఎస్, ఎంపీయూపీ పాఠశాలల్లో వసతి సమస్య పరిష్కరిస్తాం. గిరిజన విద్యా ర్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటాం.’ ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు.