Less Than Ten Percent! పది శాతం లోపే!
ABN , Publish Date - May 03 , 2026 | 11:42 PM
Less Than Ten Percent! జిల్లాలో చాలాచోట్ల ఉపాధి హామీ పథకం కింద చెరువులు పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే అటు రెవెన్యూ, ఇటు నీటి పారుదలశాఖ , ఉపాధి సిబ్బంది మధ్య సమన్వయం కొరవడడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
‘ఉపాధి’లో ఏటా లోతుగా చెరువు పనులు
మదుములు, చప్టాలు, చెక్‌డ్యాముల నుంచి పూర్తిస్థాయిలో అందని సాగునీరు
రైతులకు తప్పని అవస్థలు..
శాఖల మధ్య కొరవడిన సమన్వయం
జియ్యమ్మవలస, మే3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చాలాచోట్ల ఉపాధి హామీ పథకం కింద చెరువులు పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే అటు రెవెన్యూ, ఇటు నీటి పారుదలశాఖ , ఉపాధి సిబ్బంది మధ్య సమన్వయం కొరవడడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మదుములు, చప్టాలు, చెక్‌డ్యాములు స్థాయి కన్నా మరీ లోతుగా ఏటా చెరువు గర్భాలను తవ్వడం వల్ల ఆయకట్టుకు సాగునీరండం లేదు. గతంలో సాగునీటి చెరువుల్లో బంక మట్టి ఉండేది. దీనివల్ల నీటి నిల్వ చెరువుల్లో ఉండేది. కానీ ఇప్పుడు లోతుగా తవ్వడం వల్ల నీరు భూమిలోనే త్వరగా ఇంకిపోతోంది. ఫలితంగా డెడ్ స్టోరేజీ ఉండడం లేదు. దీనివల్ల ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా అందడం లేదు.
ఇదీ సంగతి
- జిల్లాలో 15 మండలాల్లో 450 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 2.12 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. 3.92 లక్షల మంది వేతనదారులున్నారు. ఇందులో యాక్టివ్ జాబ్‌కార్డులు 1.93 లక్షలు ఉండగా.. 3.19 లక్షల మంది పనులకు వెళ్తున్నారు. కాగా జిల్లాలో వంద ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు ఉన్న చెరువులు 105 ఉన్నాయి. వాటి ద్వారా 21,473 ఎకరాలకు సాగునీరందుతోంది. వంద ఎకరాల కంటే తక్కువ ఆయకట్టు ఉన్న చెరువులు 2,750 ఉన్నాయి. వాటి ద్వారా 50,501 ఎకరాలకు సాగునీరందుతోంది. ప్రస్తుతం ఈ చెరువుల్లో పనులు జరుగు తున్నాయి. అయితే ఏటా ఆ చెరువు గర్భంలోనే ఉపాధి పనులు జరుగుతున్నాయి. దీంతో చెరువు గర్భాలు లోతుగా అవడం వల్ల మదుములు, చప్టాలు, చెక్ డ్యాములు ఎత్తులో ఉండిపోతున్నాయి. దీంతో ఆయకట్టుకు 10 శాతం కూడా సాగునీరందడం లేదు. దీంతో రైతులు వరుణుడిపై ఆధారపడాల్సి వస్తోంది. వరి, అరటి, చెరకు, మొక్కజొన్న, తదితర పంటలకు ఏటా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తున్న నేపథ్యంలో చెరువు పనుల్లో కొంత మార్పులు చేయాలని రైతులు కోరుతున్నారు. దీనిపై నీటిపారుదల శాఖ ఏఈ బి.శంకరరావును వివరణ కోరగా.. చెరువు పనులపై మాకు సమచారం ఇవ్వడం లేదు. సాంకేతిక సలహా కూడా తీసుకోవడం లేదు. జిల్లాస్థాయి సమావేశాల్లో ఈ విషయాన్ని చర్చిస్తున్నాం. కానీ ఉపాధి సిబ్బంది పట్టించుకోవడం లేదు.’ అని తెలిపారు.
ఇలా చేస్తే ...
ఉపాధి నిధుల ద్వారా చెరువు పనులు చేసినప్పుడు ఉపాధి అధికారులు, సిబ్బంది, రెవెన్యూ, నీటి పారుదలశాఖల సమన్వయం తప్పనిసరి. ముందుగా సాగునీరందించే చెరువుల విస్తీర్ణం రెవెన్యూ, నీటి పారుదలశాఖలు గుర్తించి హద్దులు వేయాలి. ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి వారికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. హద్దులు వేసిన ప్రాప్తికి చెరువు చుట్టూ ట్రెంచ్ కట్టాలి. ఆ తరువాత చెరువులో పూడికపోయిన మట్టినంతటిని తీసి ట్రెంచ్ ఇవతల పక్క గట్టు వేసి శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. అప్పుడు కూలీలకు ఉపాధితో పాటు రైతులకు అవసరమైన సాగునీరు చెరువుల ద్వారా పుష్కలంగా అందుతుంది. ప్రస్తుత చెరువుల లోతు ప్రాక్తికి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు చెరువుల చప్టాలు, మదుములు, చెక్‌డ్యాములు అన్నీ సమానంగా ఉంటాయి. ఇలా చేయడం వల్ల చెరువుల ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుంది. మరోవైపు చెరువుల్లో డెడ్ స్టోరేజీ ఉంటే అవసరమైనప్పుడు పొలాలకు సాగునీరు మళ్లించే పరిస్థితి ఉంటుంది. ఈ విషయంపై జిల్లా అధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.