జీవో- 3కు చట్టబద్దత కల్పించాలి
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:54 PM
జీవో-3కు చట్టబద్ధత కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయంగా తక్షణమే ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
కురుపాం, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): జీవో-3కు చట్టబద్ధత కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయంగా తక్షణమే ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం కురుపాంలోని రావాడ రోడ్డు జంక్షన్ నుంచి దూళికేశ్వరస్వామి ఆలయం వరకు జీవో-3 సాధన కమిటీ, 1/70 చట్టం పరిరక్షణ కమిటీల ఆధ్వర్యంలో జీవో-3కు ప్రత్యామ్నాయం చట్టం తీసుకురావాలని, 1/70 చట్టం పటిష్టంగా అమలుచేయాలని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవో- 3 రద్దుతో గిరిజన యువత ఉద్యోగ అవకాశాలపై అనిశ్చిత నెలకొందన్నారు. 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ఆదివాసుల భూములు, హక్కులను కాపాడాలని కోరారు. ప్రభుత్వ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు మండంగి రమణ, సీతారాం, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, ఎన్‌వై నాయుడు, గౌరిశంకరరావు పాల్గొన్నారు.