Share News

ఊరు వదిలి.. వలసబాట పట్టి

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:21 AM

సంక్రాంతి కోసం సొంతూళ్లకు వచ్చిన వలస జీవులు మళ్లీ ఉపాధి కోసం తిరుగుముఖం పడుతున్నారు.

ఊరు వదిలి.. వలసబాట పట్టి
బొబ్బిలి రైల్వేస్టేషన్‌కు లగేజీతో వెళ్తున్న దృశ్యం

- ఉపాధి కోసం నగరాలకు పయనం

- కిటకిటలాడుతన్న రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు

- ప్రతిరోజూ ఇవే దృశ్యాలు

బొబ్బిలి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి కోసం సొంతూళ్లకు వచ్చిన వలస జీవులు మళ్లీ ఉపాధి కోసం తిరుగుముఖం పడుతున్నారు. పండుగ ముగిసి వారం రోజులు దాటడంతో పుట్టిన ఊరు, వృద్ధాప్యంలో ఉన్న కన్నవారిని, చదువుకుంటున్న పిల్లలను ఇంటి వద్దే విడిచిపెట్టి వలసబాట పడుతున్నారు. జిల్లాలోని బొబ్బిలి, బాడంగి, తెర్లాం, రామభద్రపురం మండలాల నుంచే కాకుండా పొరుగున గల పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట, సీతానగరం, మక్కువ, పాచిపెంట , సాలూరు తదితర మండలాల నుంచి ప్రతి రోజూ వందలాదిమంది వలస కార్మికులు పనుల కోసం ఇతర ప్రాంతాలకు పయనమవుతున్నారు. విజయవాడ, చెన్నై, హైదరాబాద్‌, అమరావతి వంటి నగరాల్లో తాపీమేస్త్రీలుగా, అపార్టుమెంట్లలో వాచ్‌మెన్లగా, హోటళ్లలో కార్మికులుగా ఇలా పలు రకాల పనులు చేసేందుకు పిల్లాపాపలతో కలిసి వెళుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ పనుల కోసం ఉభయగోదావరి, కృష్ణాజిల్లా ప్రాంతాలకు కూడా చాలామంది వెళుతున్నారు. వీరు ఆరు నెలల పాటు అక్కడ వ్యవసాయక్షేత్రాల్లో కూలి పనులు చేసుకొని, మిగిలిన ఆరు నెలలు స్వగ్రామాలకు వచ్చి జీవనం సాగిస్తుంటారు. బొబ్బిలి మండలం రంగరాయపురం గ్రామానికి చెందిన 72 కుటుంబాలు వైజాగ్‌, విజయవాడ, చెన్నై తదితర ప్రాంతాల్లో వాచ్‌మెన్లుగా, కూలీలుగా పని చేసేందుకు వలస వెళ్లాయి. అదే విధంగా కలవరాయి, కమ్మవలస, శివడవలస తదితర గ్రామాల నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయి. వలస జీవులతో ప్రతిరోజూ జిల్లాలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండుగ సందడి ముగిసి వారంరోజులు దాటుతున్నప్పటికీ బస్సులు, రైళ్లలో రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. బొబ్బిలిలో బస్సులు దొరక్కపోవడంతో ఆటోల్లో విజయనగరం వరకు ఒక్కొక్కరికి రూ.160 నుంచి రూ.200 వరకు చెల్లించి వెళ్తున్నారు.

తగ్గుతున్న పంట భూములు..

జిల్లాలో పంట భూములు తగ్గుతున్నాయి. పచ్చని పంటపొలాలు రియల్‌ ఎస్టేట్‌ భూములుగా మారుతున్నాయి. సాగునీటి వనరుల లేమి, చిన్నకమతాలు, చక్కెర, జూట్‌, నూనె మిల్లులు, పరిశ్రమలు మూతపడడం, వ్యవసాయయాంత్రీకరణ, పరిశ్రమల ఏర్పాటు పేరుతో పంటపొలాల సేకరణ, తదితర అనేక కారణాలతో గ్రామాల్లో చాలా మందికి పనులు దొరకడం లేదు. కొద్డోగొప్పో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో ఇతర రాష్ర్టాలకు చెందిన వారిని పనిలో పెట్టుకుంటున్నారు. దీంతో స్థానికులకు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. అయితే, ఉన్న ఊరిని కన్నవారిని వదిలి వెళ్లాలంటే కాస్త గుండెబరువుగా ఉంటుందని, ఏదో పోగొట్టుకుంటున్నామన్న బాధ పట్టిపీడిస్తుందని, పుట్టి పెరిగిన ప్రాంతాల్లో ఉండే ఆనందం, స్వేచ్ఛ, మానసికోల్లాసం పనిచేసే ప్రాంతాల్లో ఎంతమాత్రం లభించదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పుడు పేదరికం, ఇతరత్రా కారణాలతో స్కూల్‌కు వెళ్లి చదువుకోలేకపోయిన కారణంగా నేడు ఇలా ఇతర జిల్లాలు, ఇతర రాష్ర్టాలకు పొట్టచేతపట్టుకొని పరుగులు తీయాల్సి వస్తోందని నిట్టూరుస్తున్నారు.

తాడేపల్లిగూడెం వెళ్తున్నాం..

మాది బాడంగి మండలం కోడూరు గ్రామం. తాడేపల్లిగూడెంలో మినప చేనులో పనుల కోసం నలుగురు కుటుంబ సభ్యులం వెళుతున్నాం. వృద్ధాప్యంలో ఉన్నవారు, మా పిల్లలు సొంతూరులోనే ఉంటారు. మేము మే నెల వరకు తాడేపల్లిగూడెంలోనే ఉంటాం. ఇంటిళ్లపాదీ కష్టపడితే కూలి డబ్బులు గిట్టుబాటు అవుతాయి. అన్ని ఖర్చులు పోయి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు మిగులుతుంది. అక్కడ పనులు ముగిసిన తరువాత ఇంటికొచ్చాక సొంతూరిలో ఉపాధి హామీ పనులు జరిగితే వాటికి వెళ్తాం.

-అప్పలనాయుడు దంపతులు, కోడూరు గ్రామం

పనులు దొరకడం లేదు..

చక్కెర, జూట్‌, నూనె మిల్లులు పూర్తిగా మూతపడ్డాయి. ఫలితంగా పనులు దొరక్క జనం ఇతర ప్రాంతాలకు పరుగులు తీయకతప్పడం లేదు. వలసల నివారణకు పాలకులు, అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కేరళలో విజయవంతంగా ఉన్న వ్యవసాయరంగాన్ని అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. పరిశ్రమల కోసం కేటాయించిన భూములు ఖాళీగా ఉన్నాయి. మళ్లీ కొత్తగా పరిశ్రమలు, గ్యాస్‌ పైపులైన్ల ఇతరత్రా వాటికోసం పెద్దఎత్తున భూములు సేకరిస్తున్నారు. పల్లెల్లో పాడి సంపద ఆనవాళ్లు క్రమేణా కనుమరుగవుతున్నాయి.

- పి.శంకరరావు, ప్రజాసంఘం నాయకుడు, బొబ్బిలి

Updated Date - Jan 24 , 2026 | 12:22 AM