Share News

Leading.. Harassing! దారికాస్తూ.. వేధిస్తూ!

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:44 PM

Leading.. Harassing! కోమటిపల్లి ఫార్మా కళాశాల విద్యార్థినులు కొన్నాళ్లుగా నరకం చూస్తున్నారు. ఆకతాయిలు ఏం చేస్తారో.. ఎక్కడ అడ్డు తగులుతారో... ఏం మాట్లాడతారో అని టెన్షన్‌ పడుతున్నారు. అద్దె ఇంటి నుంచి కళాశాలకు వెళ్తున్నప్పుడు.. తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు భయాందోళన చెందుతున్నారు.

Leading.. Harassing! దారికాస్తూ.. వేధిస్తూ!

దారికాస్తూ.. వేధిస్తూ!

ఫార్మా విద్యార్థినుల పట్ల అసభ్యప్రవర్తన

అల్లరి పెడుతున్న నలుగురు ఆకతాయిలు

పోలీసులకు ఫిర్యాదు

కోమటిపల్లి ఫార్మా కళాశాల విద్యార్థినులు కొన్నాళ్లుగా నరకం చూస్తున్నారు. ఆకతాయిలు ఏం చేస్తారో.. ఎక్కడ అడ్డు తగులుతారో... ఏం మాట్లాడతారో అని టెన్షన్‌ పడుతున్నారు. అద్దె ఇంటి నుంచి కళాశాలకు వెళ్తున్నప్పుడు.. తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు భయాందోళన చెందుతున్నారు. కొందరు యువకులు దారి కాస్తూ ఫొటోలు తీస్తున్నారని, ఫోన్‌ నంబర్లు అడుగుతున్నారని, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని వారు వాపోతున్నారు. చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్న వారు.. విసిగిపోయి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆకతాయిలను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది.

బొబ్బిలి రూరల్‌, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి):

కోమటిపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఫార్మాకళాశాల విద్యార్థినులు కొందరు గ్రామంలోనే ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ కళాశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. నలుగురు ఆకతాయిలు వీరిని రోజూ ఇబ్బంది పెడుతున్నారు. గ్రామం నుంచి కళాశాలకు వెళ్లే దారిలో బైక్‌లపై వచ్చి విద్యార్థినులను అడ్డుకుని ఫోన్‌ నెంబర్లు, ఫొటోలు అడుగుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. దీనిపై సహచర విద్యార్థినులకు, అధ్యాపకులకు బాధిత విద్యార్థినులు పలుమార్లు గోడు వెళ్లబుచ్చుకున్నారు. అయితే ఆకతాయిలు రానురాను మరింత ఇబ్బంది పెడుతున్నారు. రాత్రి వేళ విద్యార్థినులు ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి డోర్లు కొడుతున్నారు. దీంతో విసిగిపోయిన బాధిత విద్యార్థినులు బుధవారం కళాశాల ప్రిన్సిపాల్‌కు చెప్పారు. ఆయన ఆకతాయిల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో.. విద్యార్థులు, అధ్యాపకులు.. అకతాయిల మధ్య బుధవారం వాగ్దాం చోటుచేసుకుంది. ఇదే సమయంలో ఓ ఆకతాయి తండ్రి అక్కడకు చేరుకుని అధ్యాపకులను, విద్యార్థులను బెదిరింపు ధోరణిలో గట్టిగా అరుస్తూ ‘ఏం చేసుకుంటారో చేసుకోండి నేను చేయాల్సింది చేస్తాను’ అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్‌ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నలుగురు ఆకతాయిలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చి బుధవారం రాత్రి బైండోవర్‌ కట్టారని భోగట్టా.

బెదిరించడంతో ఫిర్యాదు చేశాను

మా కళాశాల ఫార్మా విద్యార్థినుల పట్ల కొంతమంది ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రశ్నిస్తే అధ్యాపకులను తీవ్రస్థాయిలో బెదిరించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. కరస్పాండెంట్‌కు చెప్పి పూర్తి సమాచారం ఇస్తాం.

- కె.రాజేష్‌, ప్రిన్సిపాల్‌, ఫార్మా కళాశాల, బొబ్బిలి మండలం

విద్యార్థినులకు భరోసాగా ఉంటాం

విద్యార్థినుల లైంగిక వేధింపులపై ఫిర్యాదేమీ అందలేదు. కానీ వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఉపేక్షించం. అన్ని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినులకు భరోసా కల్పించేందుకు సిబ్బందిని పెట్రోలింగ్‌కు పంపుతున్నాం.

- నారాయణరావు, సీఐ, బొబ్బిలి

--------------------------------------------

Updated Date - Feb 19 , 2026 | 11:44 PM