Share News

‘Sagu’ ఆదర్శంగా ‘సాగు’తూ..

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:16 AM

Leading by Example, Moving Forward with ‘Sagu’ వ్యవసాయం నానాటికీ భారమవుతున్న నేపథ్యంలో వాణిజ్య పంటల వైపు దృష్టి సారించారు ఆ అన్నదమ్ములు. మార్కెట్లో డిమాండ్‌ను బట్టి సాగును చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు పసుకుడి గ్రామానికి చెందిన దామోదర సంతోష్‌, గోపాలకృష్ణ. వారిద్దరూ గతంలో వరి, మొక్కజొన్న సాగు చేపట్టేవారు.

  ‘Sagu’  ఆదర్శంగా ‘సాగు’తూ..
కర్బూజ పంటపై పిచికారీ చేస్తున్న దృశ్యం

  • ఆధునిక పద్ధతుల్లో సాగు

  • మార్కెట్లో డిమాండ్‌ను బట్టి ముందుకు సాగుతున్న అన్నదమ్ములు

  • వీడని ఏనుగుల బెడద

భామిని, జనవరి 18(ఆంధ్రజ్యోతి): వ్యవసాయం నానాటికీ భారమవుతున్న నేపథ్యంలో వాణిజ్య పంటల వైపు దృష్టి సారించారు ఆ అన్నదమ్ములు. మార్కెట్లో డిమాండ్‌ను బట్టి సాగును చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు పసుకుడి గ్రామానికి చెందిన దామోదర సంతోష్‌, గోపాలకృష్ణ. వారిద్దరూ గతంలో వరి, మొక్కజొన్న సాగు చేపట్టేవారు. అయితే గత ఖరీఫ్‌లో వంశధార వరదల వల్ల పూర్తిగా నష్టపోయారు. దీంతో వాణిజ్య పంటల సాగు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామంలోనే 20 ఎకరాలను లీజుకు తీసుకున్నారు. పది ఎకరాల్లో కర్బూజ, మరో పది ఎకరాల్లో ములగకాయల సాగు చేపడుతున్నారు. గత ఏడాది వారు మూడు ఎకరాల్లో కర్బూజ వేశారు. దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో ఈసారి విస్తీర్ణం పెంచి ఆధునిక పద్ధతుల్లో సాగు చేపడుతున్నారు. అయితే వ్యవసాయ పనుల్లో వారికి కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తున్నారు. భూమిని చదును చేసి.. కర్బూజ విత్తు నాటడం దగ్గర నుంచి మొక్క మొలిచాక డిప్‌ స్రైపైప్‌ల ద్వారా నీరు అందేలా చేయడం, చీడపీడలు సోకితే క్రిమి సంహారక మందులు పిచికారీ చేయడం వంటి పనుల్లో కుటుంబ సభ్యులు తమవంతు సహకారం అందిస్తున్నారు. కాగా ఇంత కష్టపడుతున్నా ఏనుగుల భయం వారిని వీడడం లేదు. గత ఏడాది డిసెంబరులో వారి పొలంలో గజరాజుల సంచరించి కర్బూజా మొక్కలు , డిప్‌ స్ర్పేపైపులను ధ్వంసం చేశాయి. తోటలు చూసేందుకు కూడా వీలు లేకుండా చేశాయి. దీంతో ఎప్పుడు గజరాజులు వస్తాయోనని వారు వారు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీయాల్సి వస్తోంది. ప్రస్తుతం పొలం చుట్టూ ఐరెన్‌ తీగలతో కంచె , విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. కాగా సాగు కోసం ఇప్పటి వరకు రూ.పది లక్షల మేర పెట్టుబడులు పెట్టినట్లు ఆ రైతులు తెలిపారు. సంబంధిత అధికారులు ప్రోత్సహిస్తే.. సాగు విస్తీర్ణం పెంచి మరిన్ని పంటలు పండిస్తామని ఆ అన్నదమ్ములు చెబుతున్నారు.

Updated Date - Jan 19 , 2026 | 12:16 AM