Share News

Example in Farming! ఆదర్శంగా ‘సాగు’తూ!

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:27 AM

Leading by Example in Farming! సీతంపేట మన్యంలో దుగ్గి గ్రామానికి చెందిన ఆరిక రవీంద్ర అనే గిరిజన యువకుడు వ్యవ సాయ రంగంలో రాణిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. సౌత్‌జోన్‌లో ఉత్తమ రైతుగా ప్రథమ స్థానంలో నిలిచి.. గత ఏడాది నేషనల్‌ జైవిక్‌ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

 Example in Farming! ఆదర్శంగా ‘సాగు’తూ!
దుక్కిదున్నుతున్న గిరిజన యువ రైతు రవీంద్ర

  • కాయగూరలు, ఆకుకూరలు పండిస్తూ..

  • వాణిజ్య పంటలతో లాభాలు ఆర్జిస్తూ

  • నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం

సీతంపేట , ఆగ‌స్టు 11 (ఆంధ్ర‌జ్యోతి): సీతంపేట మన్యంలో దుగ్గి గ్రామానికి చెందిన ఆరిక రవీంద్ర అనే గిరిజన యువకుడు వ్యవ సాయ రంగంలో రాణిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. సౌత్‌జోన్‌లో ఉత్తమ రైతుగా ప్రథమ స్థానంలో నిలిచి.. గత ఏడాది నేషనల్‌ జైవిక్‌ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. రూ. లక్ష బహుమతిని కూడా అందుకున్నాడు. డిగ్రీ వరకు చదువుకున్న ఈ యువకుడు ఉద్యోగా వకాశాల కోసం పరిగెత్తకుండా.. తనకున్న ఐదెకరాల భూమిని నమ్ముకుని సాగు చేపట్టాడు. గత ఏడాది రవీంద్ర తండ్రి ఆరిక పాపయ్య రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. అప్పటి నుంచి అన్ని తానై కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తన ఇద్దరి తమ్ముళ్లను చదివిస్తున్నాడు. తనకున్న భూమిలో.. రెండెకరాల్లో పాడి(వరి), మిగిలిన మూడెకరాల్లో 15రకాల ఆకుకూరలు, కాయ గూరలతో పాటు సీతాఫలం, మామిడి, డ్రాగన్‌ ఫ్రూట్‌, పైనాపిల్‌, అల్లం వంటి వాటిని పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. పంటలను సమీపంలో ఉన్న గిరిజన గ్రామాల్లో విక్ర యిస్తూ.. ఏడాదికి రూ.3.50లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడు. ఏ రంగంలోనైనా ఇష్టపడి కష్టపడితే రాణించొచ్చని ఆ యువకుడు చెబుతున్నాడు.

బిడ్డిక గంగారావు(జైపురం) : జైపురం గ్రామానికి చెందిన బిడ్డిక గంగారావు అనే గిరిజన యువకుడు కూడా వ్యవ సాయాన్ని నమ్ముకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్న గంగారావు ఎన్‌జీవోల సహకారంతో వ్యవసాయం రంగంపై ప్రత్యేక దృష్టి సారించాడు. తమకున్న రెండు ఎకరాల భూమిలో వరి, వేరుశనగ, మొక్కజొన్న, మిరప, బెండకాయలు వంటి వాటిని సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్నాడు. డిమాండ్‌కు తగ్గ ధర వస్తేనే వారపుసంతల్లో విక్రయిస్తామని, లేకుంటే సమీపంలో ఉన్న గిరిజన గ్రామాల్లో పంటలను అమ్ముతామని గంగాధర్‌ తెలిపాడు. మొత్తంగా ఏడాదికి ఖర్చులన్నీ పోను రూ.1.50లక్షల వరకు ఆదాయాన్ని పొందుతున్నట్లు వెల్లడించాడు.

Updated Date - Aug 12 , 2026 | 12:27 AM