Last Day ఆఖరి రోజు.. అదే జోరు
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:30 AM
Last Day, Same Enthusiasm! తొలి విడత పల్లె పోరులో కీలక ఘట్టం పూర్తయింది. కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలోని 226 పంచాయతీలు, 2116 వార్డులకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. మంగళవారం ఆఖరి రోజు సర్పంచ్‌లకు 427 వార్డు సభ్యులకు 2,210 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి.
తొలి విడత పల్లె పోరుకు భారీగా నామినేషన్ల దాఖలు
ముగిసిన స్వీకరణ ప్రక్రియ .. నేడు పరిశీలన
పార్వతీపురం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): తొలి విడత పల్లె పోరులో కీలక ఘట్టం పూర్తయింది. కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల పరిధిలోని 226 పంచాయతీలు, 2116 వార్డులకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. మంగళవారం ఆఖరి రోజు సర్పంచ్‌లకు 427 వార్డు సభ్యులకు 2,210 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. సర్పంచ్ పదవి కోసం గుమ్మలక్ష్మీపురంలో 62 , జియ్యమ్మవలస 60 , కురుపాం 43 , గరుగుబిల్లి 40 , కొమరాడ 75 , బలిజిపేట 34 , పార్వతీపురం 46 , సీతానగరం 67 చొప్పున నామినేషన్లు వచ్చాయి. వార్డు సభ్యులకు గుమ్మలక్ష్మీపురంలో 262 , జియ్యమ్మవలస 303 , కురుపాం 200 , గరుగుబిల్లి 247 , కొమరాడ 350, బలిజిపేట 242 , పార్వతీపురం 285 , సీతానగరంలో 321 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా సర్పంచ్ పదవులకు 1,182, వార్డు సభ్యులకు 4,011 నామినేషన్లు వచ్చాయి. వాటిని ఎన్నికల అధికారులు బుధవారం పరిశీలించనున్నారు. 21న మధ్యాహ్నం మూడు గంటల్లోపు ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదేరోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటిస్తారు. పోటీలో ఉండే అభ్యర్థుల ప్రకటన అనంతరం గుర్తును కేటాయిస్తారు. అవే గుర్తులతో అభ్యర్థులు ప్రచారాలు నిర్వహిస్తారు. ఈ నెల 26న పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కాగా మొదటి దశలో 3.46 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
చినభోగిల పంచాయతీ ఏకగ్రీవం!
పార్వతీపురం రూరల్ /సీతానగరం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): సీతానగరం మండలం చినభోగిల పంచాయతీ సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారు మర్రాపు శంకరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో ఆయన్ని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అభినందించారు. గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని గ్రామస్థులు పంచాయతీ ఏకగ్రీవ ఎన్నికకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. కాగా సీతానగరం మండలంలో గాదెలవలస, బళ్లకృష్ణరాయపురం సర్పంచ్ అభ్యర్థులుగా టీడీపీ మద్దతుదారులు బోగి శంకరరావు, గొట్టాపు మహలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయా పంచాయతీల నుంచి ఒక్కో నామినేషన్ మాత్రమే రావడంతో అవి కూడా ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
పార్వతీపురం/పాలకొండ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. దీంతో పాలకొండ నియోజకవర్గంలోని పాలకొండ, భామిని, వీరఘట్టం, సీతంపేట మండలాల్లోని పంచాయతీల్లో సందడి వాతావరణం నెలకొంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా నామినేషన్లు వేసేందుకు ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు. మొత్తంగా 146 పంచాయతీలు, 832 వార్డులకు 29న పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు ఫలితాలను ప్రకటిస్తారు. కాగా లక్షా 72 వేల 953 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందు కోసం 1290 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 21న పరిశీలన , 22న అప్పీలు , 23న అప్పీళ్ల పరిష్కారం, 24 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా 40 క్లస్టర్లు, నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వీపీరాజుపేట ఏకగ్రీవం !
పాలకొండ: మండలంలో వీపీరాజుపేట పంచాయతీ ఏకగ్రీవమైంది. ఆంజనేయ స్వామి, గ్రామ దేవత బంగారమ్మ దేవాలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఆయన రెండున్నరేళ్లే సర్పంచ్‌గా కొనసాగనున్నట్లు తెలిసింది. తర్వాత రెండున్నరేళ్లు టీడీపీ మద్దతుదారు సర్పంచ్‌గా ఉండనున్నారని సమాచారం.
సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ.70 కోట్లుపైనే
పార్వతీపురం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): పల్లెపోరులో సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు ఇప్పుడు చర్చనీయాంశంగా మరింది. జిల్లాలోని 451 పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ఈనెల 26న పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. కాగా ఇప్పటికే కొన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరికొన్ని పల్లెలు ఆ దారిలోనే నడుస్తున్నాయి. అయితే ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో మాత్రం ‘నువ్వా-నేనా’ అనే విధంగా సర్పంచ్ అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో పంచాయతీలో కనీసం రూ.10 లక్షల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని చోట్ల సర్పంచ్ అభ్యర్థులకు రూ. 20 లక్షల నుంచి రూ.30 లక్షలు వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. మొత్తంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలోని 451 పంచాయతీల్లో ఎన్నికల ఖర్చు సుమారు రూ.70 కోట్లపైనే ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇది కాకుండా వలస ఓటర్ల రానుపోను చార్జీలు, పోలింగ్ ముందు రోజు ఓటర్లకు నగదుతో పాటు ఇతర ప్రలోభాల ఖర్చులు కూడా అభ్యర్థులకు తడిసిమో పెడుకానున్నాయి.