Share News

Land occupation భూంఫట్‌

ABN , Publish Date - May 02 , 2026 | 11:47 PM

Land occupation విశాఖ నగరానికి కొత్తవలస మండలం దగ్గరగా ఉండడంతో ఈప్రాంతంలోని ప్రభుత్వ భూములను మాయం చేస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో పంథాలో ఆక్రమించే వ్యూహాలను పన్నుతున్నారు. చాలా గ్రామాల్లో ఇదే తీరు కనిపిస్తోంది. మరోవైపు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొండలు, కొండపోరంబోకు భూములు, గెడ్డలను సైతం ఆక్రమించుకుంటున్నారు.

 Land occupation భూంఫట్‌
దెందేరు గ్రామ రెవెన్యూలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి చదును చేయిస్తున్న దృశ్యం

భూంఫట్‌

ఎక్కడికక్కడే ప్రభుత్వ భూముల కబ్జా

ఒకరిని చూసి మరొకరు దిగుతున్న వైనం

ఫిర్యాదులు వస్తే తప్ప అడ్డుకోని రెవెన్యూశాఖ

కొండల్లో గ్రావెల్‌ తవ్వి ప్రభుత్వ భూముల చదును

విశాఖ నగరానికి కొత్తవలస మండలం దగ్గరగా ఉండడంతో ఈప్రాంతంలోని ప్రభుత్వ భూములను మాయం చేస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో పంథాలో ఆక్రమించే వ్యూహాలను పన్నుతున్నారు. చాలా గ్రామాల్లో ఇదే తీరు కనిపిస్తోంది. మరోవైపు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొండలు, కొండపోరంబోకు భూములు, గెడ్డలను సైతం ఆక్రమించుకుంటున్నారు. కళ్ల ముందే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే రెవెన్యూ అధికారులు గాని, సిబ్బంది గాని పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు వస్తే తప్ప రెవెన్యూశాఖ స్వయంగా వెళ్లి అడ్డుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

కొత్తవలస, మే2 (ఆంధ్రజ్యోతి):

విశాఖకు కొత్తవలస దగ్గరగా ఉండడంతో ఈ మండలంలోని కొత్తవలస, అర్దానపాలెం, బలిఘట్టాం, తుమ్మికాపల్లి, వీరభద్రపురం, చింతలపాలెం, దెందేరు గ్రామాల్లో భూములకు డిమాండ్‌ పెరిగింది. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ కొంతమంది రియల్‌ ఎస్టేట్‌వ్యాపారులు వెంచర్లు వేస్తున్నారు. జిరాయితీలకు ఆనుకుని ఉన్న గెడ్డలను, కొండపోరంబోకు భూములను, ప్రభుత్వ భూములను కలిపేసుకుంటున్నారు. ఆయా భూముల్లో పక్కా భవనాలను సైతం నిర్మాణం చేసుకుంటున్నా ఆక్రమణదారుల జోలికి రెవెన్యూశాఖ పోవడం లేదు.

- తుమ్మికాపల్లి రెవెన్యూలో అధికారిక లెక్కల ప్రకారం 83 ఎకరాలు డి.పట్టా భూములు, 228 ఎకరాల ప్రభుత్వ భూములు, 122 ఎకకాల దేవదాయ శాఖ భూములు ఉన్నాయి. సర్వేనెంబర్‌ 96, 94, 99,92 లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ ఆక్రమణలకు గురై పక్కా భవనాల నిర్మాణం కూడా సాగుతోంది. ఈ గ్రామ రెవెన్యూలో చాలా ఎకరాల ప్రభుత్వ, డిపట్టా భూములు విశాఖ-అరుకు హైవేకు ఆనుకుని ఉన్నాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో కోట్లాది రూపాయలు ఉండగా ఆక్రమణ దారులు ఈభూములను దర్జాగా స్వాధీనంలోకి తెచ్చుకుని విక్రయాలూ సాగిస్తున్నారు.

- దెందేరు గ్రామంలో సర్వే నెంబరు 63-34లో గెడ్డ పోరంబోకు భూమిని చదును చేయించడాన్ని జనసేన నాయకులు అడ్డుకుని ప్రభుత్వ భూములను కాపాడాలంటూ రెవెన్యూశాఖకు ఫిర్యాదు చేశారు.

- అర్దానపాలెం గ్రామ రెవెన్యూలోని సర్వేనెంబరు 156-2లో గెడ్డ పోరంబోకు భూమిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించి చదును చేయించగా రెవెన్యూశాఖ సిబ్బంది అడ్డుకున్నారు.

- వీరభద్రపురం రెవెన్యూలోని ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను సైతం ఆక్రమణదారులు తొలగించారు. ఈ విషయం రెవెన్యూ శాఖ ఉద్యోగులకు తెలిసిందే! ఎవరైనా పేదవారు సెంటు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే రెవెన్యూ యంత్రాంగం సిబ్బంది వెళ్లి ప్రతాపం చూపుతారు. కానీ పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నా అడ్డుకోవడం లేదు.

- కొత్తవలస 202 కాలనీ సమీపంలో ఉన్న జగనన్న కాలనీని ఆనుకుని ఉన్న కొండ నుంచి రాత్రి 10 గంటలు దాటిన తర్వాత గ్రావెల్‌ను ఇష్టారాజ్యంగా తవ్వుకుపోతున్నారు. పైగా ఆక్రమించిన భూములను ఆ గ్రావెల్‌తోనే కప్పుతున్నారు.

- కొత్తవలస రెవెన్యూలోని సర్వేనెంబరు 156లోని ప్రభుత్వ భూమికి చెందిన ఉమాదేవి కాలనీలో మూడేసి సెంట్లు, నాలుగేసి సెంట్లు చొప్పున ప్లాట్లు వేసి కొంతమంది విక్రయించుకుంటున్నా రెవెన్యూ శాఖ తమకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

చర్యలు తప్పవు

రామలక్ష్మి, తహసీల్దార్‌, కొత్తవలస

ప్రభుత్వ, డి.పట్టా భూములు ఆక్రమిస్తే ఊరుకునేది లేదు. ఫిర్యాదు వస్తే వెంటనే తమ సిబ్బందిని పంపించి కూల్చివేస్తున్నాం. ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నాం. ఆక్రమణకు ఎవరు ప్రయత్నించినా చర్యలు తప్పవు.

పట్టించుకోవడం లేదు

డేగల అప్పలరాజు, సీపీఐ కార్యదర్శి

ప్రభుత్వ భూములను ఎకరాలకు ఎకరాలు ఆక్రమించుకుని ఇష్టానుసారంగా విక్రయాలు చేసుకుంటుంటే రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అక్రమంగా భారీ కట్టడాలను చేపట్టినా చర్యలు లేవు.

Updated Date - May 02 , 2026 | 11:47 PM