land encrochers ‘భూ’చోళ్లు
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:09 AM
land encrochers లోతుగెడ్డ పంచాయతీ కొండ ఇప్పలవలస గ్రామంలో సర్వే నెంబరు 7లో 19.25, సర్వే నెంబర్ 10లో 15.29 కలిపి 34.54 ఎకరాల బాట్ ఇన్ ల్యాండు(ఎవరికీ హక్కులు ఉండని)పై కొందరు వ్యక్తులు కన్నేశారు. వాటి విలువ సుమారు ఆరేడుకోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
‘భూ’చోళ్లు
కోట్ల విలువైన భూములపై కన్ను
కొల్లగొట్టేందుకు రకరకాల ఎత్తుగడలు
గిరిజనులను రెచ్చగొట్టి అధికారులపై ఒత్తిళ్లు
ఇప్పటికే కలెక్టర్‌కు తహసీల్దార్ నివేదిక
వాటిపై ఎవరికీ హక్కులు ఉండవని స్పష్టీకరణ
ఎప్పటికప్పుడు రూటు మార్చిన కబ్జాదారులు
ఆ భూముల్లో ఉన్న వృక్ష సంపదపై తాజాగా స్కెచ్
లోతుగెడ్డ పంచాయతీ కొండ ఇప్పలవలస గ్రామంలో సర్వే నెంబరు 7లో 19.25, సర్వే నెంబర్ 10లో 15.29 కలిపి 34.54 ఎకరాల బాట్ ఇన్ ల్యాండు(ఎవరికీ హక్కులు ఉండని)పై కొందరు వ్యక్తులు కన్నేశారు. వాటి విలువ సుమారు ఆరేడుకోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. హాంఫట్ చేసే పనిలో పడ్డారు. రకరకాల వ్యూహాలను పన్నుతున్నారు. తొలుత ఆ భూముల పూర్వ లబ్ధిదారుల వారసులతో అధికారులపై ఒత్తిడి పెంచారు. కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో అర్జీ పెట్టించారు. ఫలించకపోవడంతో కొత్త ఎత్తుగడను తెరపైకి తెచ్చారు. ఆ భూముల్లో ఉన్న లక్షలాది రూపాయల విలువైన వృక్షసంపదకు లైన్ క్లియర్ చేసుకుంటే, దాన్ని బూచిగా చూపి భూములను కొట్టేసేందుకు స్కెచ్ సిద్ధం చేశారు.
మెంటాడ, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి):
కొండ ఇప్పలవలసలో కొన్ని దశాబ్దాల క్రితం గిరిజనులకు ప్రభుత్వం భూములు పంపిణీ చేసింది. ఆ తర్వాత వాటిలో సాగు చేస్తూ ఫలసాయాన్ని అనుభవించేవారు. అయితే దశాబ్దాల తరబడి శిస్తులు చెల్లించకపోవడంతో అధికారులు ఆ భూమిని స్వాధీన పరుచుకొని రికార్డుల్లో బాట్ ఇన్ ల్యాండ్‌గా నమోదు చేశారు. నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్న క్షణం నుంచి లబ్ధిదారులు ఆ భూములపై హక్కులు కోల్పోయారు. ఆ భూముల్లో ప్రస్తుతం సుమారు రూ.40లక్షల విలువ చేసే నీలగిరి వృక్షాలు ఉన్నాయి.
ప్లాన్-1
బాట్ ఇన్ ల్యాండు విషయాన్ని జిల్లాలోని ‘రియల్’బ్రోకర్ల ద్వారా సమాచారం తెలుసుకున్న జిల్లాయేతర రియల్టర్లు వాటిపై కన్నేశారు. ఈ విషయం తెలిసిందే తడవుగా ఓ సంఘ నాయకులుగా చెలామణి అవుతున్న ఇద్దరుముగ్గురు వ్యక్తులు వారిముందు వాలిపోయారు. ‘మా ఖర్చులు మీరు భరిస్తే ఆ భూములు మీ వశమయ్యేలా చేస్తామని డీల్ కుదుర్చుకున్నారు. దాని అమలులో భాగంగా ఆ భూముల పూర్వ లబ్ధిదారుల వారసులను రెచ్చగొట్టి మళ్లీ ఆ భూములు తమకు కేటాయించేలా అధికారులపై ఒత్తిడి పెంచేందుకు కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో అర్జీ పెట్టించారు. ఈ క్రమంలో విచారణ జరిపిన తహసీల్దార్ అరుణకుమారి అవి బాట్ ఇన్ ల్యాండుగా నమోదై ఉన్నాయని పూర్తిస్థాయిలో ఆ భూములకు సంబంధించి రికార్డులు కార్యాలయంలో లేవని కలెక్టర్‌కు నివేదిక పంపడంతో రియల్టర్లు, వారి దళారులు కంగుతిన్నారు.
ప్లాన్-2
మొదటి ఎత్తుగడ విఫలమవడంతో రూటు మార్చారు. ఆ భూముల్లో ఉన్న సుమారు రూ.40 లక్షలు విలువైన నీలగిరి వృక్ష సంపదపై పడ్డారు. భూములు వెనక్కి ఇవ్వకపోయినా కనీసం వాటిపై ఉన్న వృక్షాలను అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని పూర్వ లబ్ధిదారుల వారసులతో మళ్లీ ఒత్తిడి చేయిస్తున్నారు. వృక్షసంపద విక్రయానికి అనుమతులు ఇస్తే, న్యాయస్థానానికి దీన్ని బూచిగా చూపి, ఆ 34 ఎకరాలపై తమకు హక్కులు కల్పించాలని పూర్వ లబ్ధిదారుల వారసులతో కోర్టులో పిటిషన్ దాఖలు చేయించేందుకు పావులు కదుపుతున్నారు. అమాయక గిరిజనులను ప్రలోభాలకు గురిచేస్తూ ఇళ్లు కట్టించి ఇస్తామని మభ్యపెడుతున్నారు.
- ఖర్చుకు వెనుకాడని ఆ రియల్టర్ల నుంచి ఓ సంఘ ప్రతినిధులమని చెప్పుకుంటున్న వారు గిరిజనులను దారికి తెస్తామని చెబుతూ ఖర్చుల పేరుతో కొంత వసూలు చేసేశారు.
రూ.కోట్లు కొట్టే వ్యూహం
బాట్ ఇన్ భూములపై అడ్డులన్నీ తొలగిపోయి పూర్వ లబ్ధిదారుల వారసుల చేతికి వస్తే వాటిని కొనుగోలు చేసి, ఆ భూములను డవలప్ చేసుకోవాలనేది రియల్టర్ల ప్లాన్. గ్రామం నుంచి ఆ భూముల వరకు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసుకుంటే, ఇప్పుడున్నదానికి రెట్టింపు ధర అంటే ఎకరా రూ.40 లక్షల వరకు విక్రయించుకోవచ్చుననేది వారి స్కెచ్.
రెవెన్యూ సిబ్బందిపై పెత్తనం
గిరిజనులతో పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ఇప్పించడంతో మండల రెవెన్యూ సిబ్బంది విచారణ చేపట్టారు. అర్జీ ఇచ్చిన వ్యక్తికి ఫోన్ చేసి వివరాలు సేకరించగా సాలూరు ప్రాంతానికి చెందిన ఓ సంఘనేత రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా తనతో మాట్లాడాలని తనకు తెలియకుండా గిరిజనులతో మాట్లాడటం ఏమిటని చిర్రెత్తిపోయారని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు.
విషయాన్ని కలెక్టర్‌కు నివేదించా
కొండ ఇప్పలవలస సమీపంలోని భూముల విషయమై స్థానిక గిరిజనులు కలెక్టర్‌కు అర్జీ అందజేయగా, అక్కడ్నుంచి అందిన ఆదేశాల మేరకు విచారణ నిర్వహించాం. అవి బాట్ ఇన్ ల్యాండ్స్ అని తేలింది. కొన్ని దశాబ్దాలపాటు శిస్తులు వగైరా చెల్లించనందున వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. వాటిపై ఇప్పుడు పూర్వ లబ్ధిదారుల వారసులకు ఎటువంటి హక్కులు ఉండవు. ఇదే విషయాన్ని కలెక్టర్‌కు సమర్పించిన నివేదికలో తెలియజేశాను. ఆ భూముల్లోని విలువైన వృక్షసంపదపై ఉన్నతాధికారుల సూచన మేరకు ముందుకు వెళ్తాను. పూర్తిస్థాయిలో రికార్డులు కార్యాలయంలో అందుబాటులో లేవు. సంఘం నేతలమని ఇద్దరు వచ్చి కలిశారు. ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనల మేరకు నడుచుకుంటాం.
- అరుణకుమారి, తహసీల్దారు, మెంటాడ