land encroach జప్తు భూములేగా.. ఆక్రమించేద్దాం!
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:22 AM
land encroach అవి ప్రైవేటు సంస్థ భూములు. ప్రస్తుతం జప్తులో ఉన్నాయి.. సంస్థ నిర్వహణలో వివాదం తలెత్తి సుమారు పదిహేనేళ్ల క్రితం కార్యకలాపాలు ఆగిపోయాయి. లావాదేవీలపై అనుమానమొచ్చిన ఖాతాదారులు డిపాజిట్ల వాపస్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టడంతో సంస్థ తాత్కాలికంగా మూతపడింది. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు రంగంలోకి దిగి ఆ భూములను ఆక్రమించేస్తున్నారు.
జప్తు భూములేగా.. ఆక్రమించేద్దాం!
అక్షయగోల్డ్ భూములపై కన్ను
ప్రస్తుతం వాటి విలువ రూ.112 కోట్లు పైమాటే
సంస్థ కార్యకలాపాలపై అప్పట్లో ఖాతాదారుల ఆందోళన
రాష్ట్ర వ్యాప్తంగా సంస్థ ఆస్తులు స్వాధీనం
జప్తు జాబితాలో మెంటాడ మండలంలోని 450 ఎకరాలు
పుష్కరం దాటినా సంస్థపై ముందుకు సాగని విచారణ
ఇదే అదనుగా ఆ భూములపై కబ్జారాయుళ్ల కన్ను
దశలవారీగా అన్యాక్రాంతమవుతున్న వైనం
అవి ప్రైవేటు సంస్థ భూములు. ప్రస్తుతం జప్తులో ఉన్నాయి.. సంస్థ నిర్వహణలో వివాదం తలెత్తి సుమారు పదిహేనేళ్ల క్రితం కార్యకలాపాలు ఆగిపోయాయి. లావాదేవీలపై అనుమానమొచ్చిన ఖాతాదారులు డిపాజిట్ల వాపస్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టడంతో సంస్థ తాత్కాలికంగా మూతపడింది. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు రంగంలోకి దిగి ఆ భూములను ఆక్రమించేస్తున్నారు. తమ భూముల్లో కలిపేసుకుంటున్నారు. అధికారులు అడిగితే ఎంతో కొంత వారి చేతిలో పెట్టి వారి నోరు మూయిస్తున్నారు. మెంటాడ మండలంలోని అక్షయగోల్డ్ భూముల పరిస్థితి ఇది. అధికారులు సీరియస్‌గా తీసుకోకుంటే రానున్న రోజుల్లో చాలా వరకూ సంస్థ భూములను ఆక్రమించేందుకు పన్నాగం పన్నినట్టు తెలుస్తోంది.
మెంటాడ, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): అక్షయ గోల్డ్ (ప్రైవేటు సంస్థ) పదిహేనేళ్ల క్రితం కొండలింగాలవలస, ఆండ్ర పంచాయతీ పరిధిలో ఎకరం రూ.2 లక్షల చొప్పున సుమారు 450 ఎకరాలను రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది. గడిచిన దశాబ్దన్నర కాలంలో ఈ ప్రాంతంలో పెరిగిన ధరల ప్రకారం ఇప్పుడా భూమి విలువ రూ.112 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే అప్పట్లో సంస్థ కార్యకలాపాలు వివాదాస్పదం కావడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. దానిపై స్పందించిన అప్పటి ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఆ క్రమంలో ఓ స్వతంత్ర సంస్థ ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది. కానీ ఎందుకో ముందుకు వెళ్లలేదు. అప్పట్నుంచి ఆ భూములు ఎవరికీ చెందనట్టు ఉండిపోయాయి. ఇప్పుడు వాటిపై అందరికళ్లు పడ్డాయి. ఎవరి సత్తామేరకు వారు అక్రమించేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో చోటుచేసుకున్న కొన్ని లొసుగులను ఆసరాగా చేసుకొని కొందరు దర్జాగా కబ్జా చేస్తుంటే, అవి తమ భూములేనంటూ పక్కభూముల రైతులు తమ భూముల్లో కలిపేసుకొని సాగుచేసుకొంటున్నారు. దత్తిరాజేరు మండలానికి చెందిన ఓ వైసీపీ నేత ఇదే అదనుగా తన అల్లుడి ఆరెకరాల భూమిని ఆనుకునిఉన్న పాతిక ఎకరాల్లోని రూ.30 లక్షల విలువైన నీలగిరి చెట్లను నరికించి కొద్దిరోజుల క్రితం తరలించేశారు. ఇంత జరుగుతుంటే యాంత్రాంగమేమో మొద్దునిద్ర నటిస్తోంది. అది తమ బాధ్యత కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది. దీంతో ఆక్రమణదారులు అడ్డు అదుపు లేకుండా మరింత చెలరేగిపోతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి వారికి సహకరిస్తున్నారు.
- 2010-12 మధ్యకాలంలో అక్షయ గోల్డ్ సంస్థ భూములను కొనుగోలు చేసింది. ఆ తరువాత సంస్థ తీరుతెన్నులు, లావాదేవీలపై అనుమానమొచ్చిన ఖాతాదారులు డిపాజిట్ల వాపస్ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడంతో నాటి ప్రభుత్వం తక్షణ ఉపశమనం కోసం స్వతంత్ర సంస్థ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ సంస్థ అధికారులు రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లోని సంస్థ స్థిరాస్తులను జప్తుచేస్తున్నట్టు ప్రకటించడంతో అప్పట్లో ఆందోళనలు సద్దుమణిగాయి.
ఎవరికీ పట్టక..
స్వతంత్ర సంస్థ ప్రకటనతో ఇప్పటికీ సంస్థ స్థిరాస్తులు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. వాటిని సంస్థతో అమ్మించి డిపాజిట్‌దారులకు న్యాయం జరిగేలా చూస్తామన్న ప్రభుత్వాల హామీలు నీటిమూటలయ్యాయి. కొనుగోలు చేసిన సమయంలో ఆ భూముల్లో ఉన్న నీలగిరి, టేకు తదితర వృక్ష సంపదను రహస్యంగా కొందరు,బాహాటంగా ఇంకొందరు కొల్లగొడుతున్నారు.
వైసీపీ నేత అల్లుడి గిల్లుడు
దత్తిరాజేరు మండలానికి చెందిన ఓ వైసీపీ నేత అల్లుడికి కొండలింగాలవలస పంచాయతీ శీలవలస రెవిన్యూ పరిధిలో సంస్థ భూములను ఆనుకుని ఆరు ఎకరాలు ఉంటే, ఏకంగా 25 ఎకరాల భూమిలోని సుమారు రూ.30 లక్షల విలువ చేసే నీలగిరి మొక్కలను కొద్ది రోజుల క్రితం దర్జాగా నరికించేసి ట్రాక్టర్లతో బహిరంగంగా తరలింపునకు తెగబడ్డారు. అంతటితో ఆగకుండా, ఆ పాతిక ఎకరాల భూమి తనదేనంటున్నాడు.
- సంస్థకు చెందిన భూములను ఆనుకుని ఉన్న రైతులు కూడా దశలవారీగా తమపొలాల్లో ఎకరాల కొద్దీ కలిపేసుకొని దర్జాగా సాగుచేసుకుంటున్నారు. అవసరమనుకుంటే జిరాయితీ పేరుతో అమ్మకాలకు కూడా బేరం కుదుర్చుకొంటున్నారు.
సిబ్బంది చేతివాటం
ఈ వ్యవహారం మొత్తం క్షేత్రస్థాయి సిబ్బందికి బాగానే కలిసిస్తోంది. కళ్లెదుటే కబ్జా జరుగుతుంటే కిక్కురుమనడంలేదు. ఆక్రమణదారులతో చేతులు కలిపి రెండుచేతులా దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వింతవాదన
అక్రమణలపై ఉదాసీనతపై వస్తున్న విమర్శలపై అధికారుల నుంచి వింతవాదన వినిపిస్తోంది. భూములను స్వాధీనం చేసుకున్నట్టు స్వతంత్ర సంస్థ అధికారులు ప్రకటించినందున అక్రమణలపై వారే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొస్తున్నారు.వారు ఫిర్యాదు చేస్తే తమపని తాము చేస్తామని,లేదంటే ముందుకు వెళ్ళలేమని చెబుతున్నారు.
సంప్రదిస్తే చర్యలు తీసుకుంటాం
ఆభూమిని స్వాధీనం చేసుకున్నట్టు స్వతంత్ర సంస్థ అధికారులు తమను సంప్రదిస్తే తప్పనిసరిగా సహకరిస్తాం. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
- విజయభాస్కర్, తహసీల్దార్, మెంటాడ