Share News

మళ్లీ భూ సేకరణ

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:51 PM

మండలంలో మరో భూ సేకరణకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

మళ్లీ భూ సేకరణ

- ఎయిర్‌ పోర్టు రింగ్‌ రోడ్డు కోసం

- అనకాపల్లి నుంచి భోగాపురం వరకు నిర్మాణం

- డీపీఆర్‌ సిద్ధం చేస్తున్న అధికారులు

- ఆందోళనలో కొత్తవలస మండల ప్రజలు

కొత్తవలస, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): మండలంలో మరో భూ సేకరణకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు రింగ్‌ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూసేకరణలతో చాలామంది రైతులు, ప్రజలు భూములు, ఇళ్లు కోల్పోయారు. తాజాగా, రింగ్‌ రోడ్డు కోసం ఏఏ గ్రామాల్లో భూసేకరణ చేయాలనే విషయమై సర్వే జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొత్తవలస మండలంలోని చీడివలస, సుందరయ్యపేట, దేవాడ, వియ్యంపేట, వీరభద్రపురం, తుమ్మికాపల్లి, అర్ధానపాలెం, కంటకాపల్లి, కాటకాపల్లి, పెదరావుపల్లి మీదుగా విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలం కొవ్వాడ మీదుగా వెళ్లి, మళ్లి అక్కడనుంచి జిల్లాలోని హైవేను కలుపుతారు. ఇందుకోసం అవసరమైన రోడ్ల నిర్మాణానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మండలంలో గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే, 516బి పెందుర్తి బొడ్డవర హైవే రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. పెందుర్తి నుంచి బొడ్డవర వరకు వేస్తున్న 516బి హైవే కోసం రైతుల నుంచి భూములు, ఇళ్లు సేకరించి నష్ట పరిహారాన్ని బాధితుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మండలంలో ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌ పైప్‌లైన్‌ల కోసం భూసేకరణ జరిగింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కోసం భూసేకరణ పూర్తయింది. కొత్తవలస నుంచి విజయనగరం వరకు ఇప్పటికే మూడో రైల్వేలైన్‌ కోసం భూసేకరణ చేసి పనులు చేపట్టారు. నాలుగో లైన్‌ కోసం మళ్లీ భూసేకరణ చేస్తున్నారు. ఇది కాకుండా అనకాపల్లి నుంచి కొత్తవలస వరకు మరో రైల్వేలైన్‌ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు చేశారు. ఇలా మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో భూసేకరణ చేస్తుండడంతో ఎక్కడ తమ భూములు, ఇళ్లు పోతాయోనని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ఏ ప్రాజెక్టు వచ్చినా అందులో కొత్తవలస పేరు ఉంటుండంతో ప్రజలు భయపడుతున్నారు. వాస్తవానికి భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడం వల్ల తమకేమీ నష్టం జరగదని మండల ప్రజలు భావించారు. కానీ, ఇప్పుడు ఎయిర్‌పోర్టు రింగ్‌ రోడ్డు కోసం భూసేకరణకు సిద్ధపడుతుండడాన్ని నమ్మలేక పోతున్నారు. ఏగ్రామంలో ఎవరి భూమి ఎంత పోతుందనే విషయమై లెక్కలు వేసుకుంటున్నారు.

Updated Date - Jun 17 , 2026 | 11:51 PM