Lack of ‘Support’ for Maizeమొక్కజొన్నకు ‘మద్దతు’ కరువు
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:15 AM
Lack of ‘Support’ for Maize రాత్రింబవళ్లూ కష్టపడి, స్వేదం చిందించి పంట పండించినా చివరకు విక్రయించే సమయంలో రైతుకు నిరాశ తప్పడం లేదు. ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో వరి ఏమవుతుందో తెలియని పరిస్థితిలో మొక్కజొన్న పంట చేతికి అందినందుకు కాస్త ఊరట చెందినా మద్దతు ధర దక్కడం లేదు. కొందరు రైతులు పంటను నిల్వ ఉంచలేక తక్కువ ధరకు వ్యాపారులకు అప్పగిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మొక్కజొన్నకు ‘మద్దతు’ కరువు
పంటను నిల్వ ఉంచలేక తక్కువ ధరకు అప్పగిస్తున్న వైనం
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతుల విజ్ఞప్తి
రాత్రింబవళ్లూ కష్టపడి, స్వేదం చిందించి పంట పండించినా చివరకు విక్రయించే సమయంలో రైతుకు నిరాశ తప్పడం లేదు. ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో వరి ఏమవుతుందో తెలియని పరిస్థితిలో మొక్కజొన్న పంట చేతికి అందినందుకు కాస్త ఊరట చెందినా మద్దతు ధర దక్కడం లేదు. కొందరు రైతులు పంటను నిల్వ ఉంచలేక తక్కువ ధరకు వ్యాపారులకు అప్పగిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
బొబ్బిలి రూరల్, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి):
బొబ్బిలి మండలం చిత్రకోట, బొడ్డవలస, గోపాలరాయుడుపేట, కలవరాయి, పక్కి, కోమటిపల్లి తదితర గ్రామాల్లో ఈ ఏడాది మొక్కజొన్న పంట ఆశాజనకంగా పండింది. చేతికి వచ్చిన దిగుబడిని చూసి ఆనందించాలో... మార్కెట్‌లో మద్దతు ధర లభించక సతమతమవ్వాలో తెలియక రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ ఏడాది విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు , దుక్కి ఖర్చులు, కూలీల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరాకు వేలాది రూపా యలు పెట్టుబడి పెట్టి పంట దిగుబడి సాధిస్తే గింజలను విక్రయించేందుకు మద్దతు ధర లభించడం లేదని రైతులు వాపోతున్నారు. మార్పిడి చేసిన మొక్కజొన్న ధాన్యాన్ని ఎండబెట్టుకు నేందుకు సరైన స్థలాలు లేక ప్రధాన రహదారుల పక్కన, పొలాల గట్ల వద్ద ప్లాస్టిక్ కవర్లు పరిచి కాపలా కాస్తూ ఆరబెట్టుకుంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా ధర రూ.2,400 దక్కడం కష్టంగా ఉందని రైతులు చెబుతున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి రకరకాల వంకలతో తక్కువ ధరకు అడుగుతుండటంతో నష్టపోతున్నారు. పెరిగిన పెట్టబడి ఖర్చుల దృష్ట్యా క్వింటాకు కనీసం రూ.2,700 లభిస్తేనే పెట్టిన ఖర్చులు తిరిగి వచ్చి, కొంతైనా ఆసరా లభిస్తుందని అంటున్నారు. ఈ విషయంపై మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామ్‌సుందర్‌ని వివరణ కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.
దిగుబడి చూసి ఆశపడ్డాం
పంట బాగా పండిందని ఆశపడ్డాం.. కానీ దళారులు తక్కువ ధరకు అడుగుతున్నారు. క్వింటాకు రూ.2,400 ఇస్తామంటూనే సాకులు చెబుతున్నారు. అప్పులు చేసి పంట పండించాం. ఈ ధరకు అమ్మితే పెట్టుబడి కూడా రాదు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలి.
- కునుకు అప్పలనరసమ్మ, చత్రకోట బొడ్డవలస
కొనుగోలు కేంద్రాలేవీ?
రోడ్ల పక్కన పంటను ఆరబెట్టుకుని రాత్రింబవళ్లు కాపలా కాయడం చాలా ఇబ్బందిగా ఉంది. ఆకస్మికంగా వర్షాలు వచ్చినా, ఈదురుగాలులు వీచినా పంట కొట్టుకుపోతుందనే భయం వేస్తోంది. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే మాకు మద్దతు ధర దక్కుతుంది.
- సొంగలి పార్వతి , గోపాలరాయుడుపేట