Share News

Lack of Supervision… పర్యవేక్షణ లోపం.. పనులు నాసిరకం

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:28 PM

Lack of Supervision… Substandard Work జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేపడుతున్న బీటీ రహదారుల పనుల్లో నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇష్టారాజ్యంగా పనులు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి.

 Lack of Supervision…   పర్యవేక్షణ లోపం.. పనులు నాసిరకం
నిలిచిన గరుగుబిల్లి -ఉద్దవోలు రహదారి నిర్మాణం

  • తారు సరఫరా కాక.. కొన్నిచోట్ల నిలిచిన పనులు

  • అధ్వానంగా దర్శనమిస్తున్న రోడ్లు

  • పట్టించుకోని అధికారులు

గరుగుబిల్లి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేపడుతున్న బీటీ రహదారుల పనుల్లో నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇష్టారాజ్యంగా పనులు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. వాస్తవంగా జిల్లాలో సీసీ రహదారులకు అవసరమైన నిధులు మంజూరు కాలేదు. దీంతో బీటీ రహదారుల నిర్మా ణాలకు ప్రాధాన్యం ఇస్తూ దశలవారీగా నిధులు కేటాయిస్తున్నారు. అయితే బిల్లులు చెల్లిస్తున్నా.. ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా పరిస్థితి ఏర్పడింది.

- జిల్లాకు సంబంధించి 2024-25 సంవత్సరానికిగాను పార్వతీపురం సబ్‌ డివిజన్‌ పరిధి సీతానగరం, పార్వతీపురం, బలిజిపేట మండలాల్లో 23 రహదారులు, సాలూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో మూడు, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలకు 10, పాలకొండలో 5, భామినిలో 2, సీతంపేటలో ఒక రహదారి పనులకు నిధులు కేటాయించారు. మొత్తంగా 46 రహదారులకు గాను రూ.58.68 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటివరకు 27 రహదారుల నిర్మా ణాలు పూర్తయ్యాయి. 17రోడ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రెండు రహదారుల నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదు. కాగా ఈ నిర్మాణాలకు సంబంధించి రూ. 12.71 కోట్ల వరకు చెల్లించారు.

- 2025-26 సంవత్సరానికి సంబంధించి కొమరాడకు 11, గుమ్మలక్ష్మీపురం మండలానికి 23, జియ్యమ్మవలసకు ఒకటి, కురుపాం మండలానికి 14 చొప్పున రహదారుల నిర్మాణాలకు నిధులు కేటాయించారు. మొత్తంగా 49 రహదారులకు గాను రూ.73.94 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు రూ. 3.95 కోట్లు చెల్లించారు. ఇకపోతే ఉపాధి హామీ పథకంలో 25 రహదారులకు రూ. 49.93 కోట్లు కేటాయించగా రూ.14.33 కోట్ల వరకు చెల్లించారు. అయితే చాలా వరకు రహదారుల పనుల్లో నాణ్యత లోపాలు కనిపిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

- తారు ధరలు పెరిగిపోవడంతో గరుగుబిల్లి మండలం పరిధి మరుపెంట-సాంబన్నవలస రహదారి పనులను సగంలోనే వదిలేశారు. దీంతో ఈ మార్గం రాళ్లు తేలి అధ్వానంగా మారింది. ఇదిలా ఉండగా ఉద్దవోలు-గరుగుబిల్లి రోడ్డు కుంగుతోంది. ఈ మార్గంలో ఏర్పాటు చేయాల్సిన కల్వర్ట పనుల్లో లోపాలు బయటపడుతున్నాయి. కల్వర్టుల పరిధిలో ఒకవైపు కోతలు, మరోవైపు పైపులు విరుగుతున్నాయి. పనులు పర్యవేక్షించాల్సిన క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేసి నివేదికలు అందిస్తున్నారు.

నాణ్యత లోపాలుంటే చర్యలు

జిల్లాలో నిర్వహిస్తున్న బీటీ రహదారుల పనుల్లో నాణ్యతా లోపాలు ఉన్నట్లయతే చర్యలు తప్పవు. పనులు పరిశీలించిన తర్వాతే చెల్లింపులు జరుగుతాయి. బీటీ రహదారులకు సంబంధించి తారు సరఫరా కావడం లేదు. తారు ధరలు పెరిగిపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిర్వహించడం లేదు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అంచనా వ్యయం పెంపుదలకు ప్రతిపాదనలు పంపించాం.

- జి.ప్రదీప్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారి, పార్వతీపురం మన్యం

Updated Date - Sep 12 , 2026 | 11:28 PM