Share News

సిబ్బంది లేక.. సేవలందక

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:14 AM

మండలంలోని చినరాజుల గుమ్మడలోని పశువైద్యశాలలో వైద్యాధికారి, సిబ్బంది లేకపోవడంతో పాడి రైతులకు సేవలందడం లేదు. సిబ్బంది లేకపోవడంతో నిత్యం వైద్యశాల మూతబడి ఉంటోందని రైతులు వాపోతున్నారు.

సిబ్బంది లేక.. సేవలందక
చినరాజుల గుమ్మడ పశువైద్యశాల

వంగర, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చినరాజుల గుమ్మడలోని పశువైద్యశాలలో వైద్యాధికారి, సిబ్బంది లేకపోవడంతో పాడి రైతులకు సేవలందడం లేదు. సిబ్బంది లేకపోవడంతో నిత్యం వైద్యశాల మూతబడి ఉంటోందని రైతులు వాపోతున్నారు. ఇక్కడ ఉండే వైద్యాధికారి ఉణుకూరు బదిలీపై వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎవర్నీ ఉన్నతాధికారులు నియమించలేదని రైతులు చెబుతున్నారు. అలాగే ఇద్దర్లు క్లర్కులు అవసరం. కాగా బదిలీపై వెళ్లిపోవడంతో తర్వాత నియామకానికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో30 గ్రామాల పరిధిలో 43 వేల పశువులకు సేవలందడం లేదు. పశువులకు అత్యవసర సమ యంలో సేవలందకపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు. లక్షలు రూపాయలు వెచ్చించి పాడిపశువులను పోషించుకుంటున్నా మని సమయానికి వైద్యం అందక పశువులు మృత్యువాత పడే ప్రమాద ముందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూరప్రాంతాల నుంచి ఆసుపత్రికి పశువులు తోలుకొని వచ్చినా వైద్యాధికారి, సిబ్బంది లేకపోవడంతో ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వస్తోందని పలువురు రైతులు వాపోతున్నారు. కాగా వంగరలో పశువైద్యశాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ వైద్యాధికాని లేకపోవడంతో సంతకవిటి నుంచి ఒక వైద్యాధికారి వారానికి ఒక్కసారి వచ్చి పశువులకు వైద్యపరీక్షలు చేస్తారని వంగర వైద్యశాల నాలుగో తరగతి సిబ్బంది సత్యనారాయణ తెలిపారు.

Updated Date - Aug 16 , 2026 | 12:14 AM