Share News

నిర్వహణ కరువై.. ఆహ్లాదం దూరమై

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:16 AM

నగరవాసులకు ఆహ్లాదం కరువైంది. పార్కుల్లో ఎటు చూసినా చెత్తాచెదారం, మురుగు, విరిగిన ఆట వస్తువులతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి.

నిర్వహణ కరువై.. ఆహ్లాదం దూరమై
గాంధీ పార్కులో చెత్తాచెదారం

- అధ్వానంగా నగరంలోని పార్కులు

- 90 ఉంటే వినియోగిస్తున్నవి 10 మాత్రమే

- వైసీపీ హయాంలో కొన్నింటికే నిధులు

- కూటమి పాలనలోనూ కానరాని పురోగతి

దాసన్నపేట, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నగరవాసులకు ఆహ్లాదం కరువైంది. పార్కుల్లో ఎటు చూసినా చెత్తాచెదారం, మురుగు, విరిగిన ఆట వస్తువులతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఈ పార్కులు ఆహ్లాదాన్ని పంచకపోగా అసౌకర్యానికి గురిచేస్తున్నాయని నగరవాసులు వాపోతున్నారు. విజయనగరం వ్యాప్తంగా 90 వరకూ ఉద్యానవనాలు ఉండగా..అందులో 10 పార్కులు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు ఇవి ఏ మూలకూ చాలడం లేదు. ఎక్కడికక్కడే వీటిని నిరుపయోగంగా వదిలేయడంతో విషసర్పాలు, జంతువులకు నిలయాలుగా మారాయి. మరికొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయి. వైసీపీ హయాంలో తక్కువ పార్కులపై భారీగా ఖర్చుచేసి మిగతా వాటిని వదిలేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. కానీ కనీస స్థాయిలో వీటిని దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. కొన్ని పార్కులు అయితే ఆక్రమణలబారిన పడ్డాయి.

దయనీయంగా ఉన్న పార్కులివే..

నగరంలోని ఫూల్‌బాగ్‌, జగదాంబనగర్‌, సిద్ధివినాయక నగర్‌, అయ్యప్పనగర్‌, లక్మీగణపతికాలనీ, బాబామెట్ట, శుద్ధ వీధి, సింగపూర్‌ సిటీ, సుంకర వీధి, కాటవీధి, బెస్త కాలనీ, రాజీవ్‌నగర్‌ కాలనీ, కృష్ణరాజపురం, టీసీఎల్‌, ఏడుకొండల అపార్ట్‌మెంట్‌ దగ్గర, శార్వాణినగర్‌, సింహాద్రినగర్‌, షిర్డీసాయినగర్‌, నటరాజ్‌ కాలనీ, బండారుపల్లి గార్డెన్స్‌, బ్యాంకుకాలనీ, బీసీ కాలనీ, వుడా కాలనీ , ఆర్టీసీ కాలనీ, అలకనందా కాలనీ, కాళీఘాట్‌ కాలనీ, కేఎల్‌పురం, బంగారమ్మ కాలనీ తదితర ప్రాంతాల్లో పార్కులు ఉన్నాయి. వీటిలో పూర్తిస్థాయి సదుపాయాలు లేవు. పార్కుల నిర్వహణ సరిగ్గా లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌ వంటి సదుపాయాలు ఉన్నవి కొన్నే. దీంతో ఏమాత్రం వర్షం పడితే చాలు పార్కులు బురదమయంగా మారుతున్నాయి. కనీసం నడిచేందుకు కూడా వీలు లేకుండా పోతోంది.

- వైసీపీ హయాంలో ఎంపిక చేసిన ఓ పది పార్కులపై కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టారు. మిగతా వాటిని గాలికొదిలేశారు. నగరపాలక సంస్థ అంటే నగరం మొత్తాన్ని సమాన ప్రతిపాదికన చూడాలి. కానీ, అప్పట్లో వివక్ష కొనసాగింది. పార్కుల నిర్వహణకు తగినంతమంది సిబ్బంది లేరు. అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 44 మందిని నియమించారు. కానీ ఉన్న పార్కులకు వీరు ఏ మూలకూ చాలడం లేదు. కనీసం ఈ పార్కుల నిర్వహణ బాధ్యత ఆయా కాలనీ సంక్షేమ సంఘాలకు అప్పగించినా కొంత మార్పులు వచ్చేది. అయితే నగరపాలక సంస్థ ఎన్నికలు పూర్తయితే కానీ..ఈ పార్కుల అభివృద్ధికి అడుగులు పడే అవకాశం లేదు.

ప్రత్యేక ప్రణాళిక..

పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఆయా కాలనీల్లో సంక్షేమ సంఘాలు, వీధివాసులకు అప్పగించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే 44 మంది సిబ్బందిని కాంట్రాక్ట్‌ ప్రతిపాదికన నియమించాం. పార్కులను వినియోగంలోకి తెచ్చి ఆహ్లాదకరంగా తయారుచేస్తాం. ఒక్కో ఏఈకి ఒక్కో పార్కు నిర్వహణను అప్పగించనున్నాం. స్థానికులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయనున్నాం.

-బి.బాలస్వామి, కమిషనర్‌, విజయనగరం నగరపాలక సంస్థ

Updated Date - Sep 04 , 2026 | 12:16 AM