Kumki Elephants కుంకీలు వచ్చేస్తున్నాయ్
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:36 PM
Kumki Elephants Are on Their Way దశాబ్దాల సమస్యకు తెరపడనుంది. మన్యం వాసులకు గజరాజుల బెడద తప్పనుంది. ఏనుగుల వల్ల ఆస్తి, ప్రాణ, పంట నష్టాలతో పాటు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఊరట లభించనుంది. కూటమి ప్రభుత్వ చొరవతో మరో వారం రోజుల్లోనే జిల్లాకు కుంకీ ఏనుగులు రానున్నాయి. వాటితో మన్యంలో సంచరిస్తున్న ఏనుగులను కట్టడి చేసి సురక్షిత ప్రాంతానికి తరలించనున్నారు.
20న జిల్లాలో పర్యటించనున్న ప్రత్యేక బృందం
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
ఎలిఫెంట్ జోన్ సిద్ధం
మన్యం వాసులకు తప్పనున్న ఏనుగుల బెడద
కూటమి చొరవతో దశాబ్దాల సమస్యకు తెర
పార్వతీపురం, జూలై14(ఆంధ్రజ్యోతి): దశాబ్దాల సమస్యకు తెరపడనుంది. మన్యం వాసులకు గజరాజుల బెడద తప్పనుంది. ఏనుగుల వల్ల ఆస్తి, ప్రాణ, పంట నష్టాలతో పాటు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఊరట లభించనుంది. కూటమి ప్రభుత్వ చొరవతో మరో వారం రోజుల్లోనే జిల్లాకు కుంకీ ఏనుగులు రానున్నాయి. వాటితో మన్యంలో సంచరిస్తున్న ఏనుగులను కట్టడి చేసి సురక్షిత ప్రాంతానికి తరలించనున్నారు. ఇకపై ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఎలిఫెంట్ జోన్ సిద్ధమైంది. కుంకి ఏనుగులు వచ్చేముందు అటవీశాఖ ఆధ్వర్యంలో కొంతమంది నిపుణులు ఈ ప్రాంతానికి రానున్నారు. ఈ నెల 20న జిల్లాలోలోని పలుచోట్ల పర్యటించి పూర్తిగా పరిశీలించనున్నారు. కాగా జిల్లాకు రెండు లేదా మూడు కుంకీ ఏనుగులు రానున్నాయి. వాటిని సంరక్షణ కేంద్రానికా లేదా ఇతర ప్రాం తాలకు తరలిస్తారా? అన్నది ప్రభుత్వ ఆదేశాల మేరకు అటవీశాఖ అధికారులు నిర్ణయించ నున్నారు. ఏనుగుల సంరక్షణ కేంద్రానికి వెళ్లేందుకు వీలుగా సీతానగరం మండలం అప్పయ్యపేట నుంచి రహదారిని నిర్మించారు. మరో రెండు రోజుల్లో ఈ పనులు పూర్తికానున్నాయి.
జిల్లాలో ఏనుగుల జోన్ ఏర్పాటు విషయంలో గత వైసీపీ ప్రభుత్వం ప్రకటనలకే పరిమిత మైంది. ఆస్తి, పంట నష్టాలను నివారించేందుకు శాశ్వత చర్యలు తీసుకుంటామని గత పాలకులు ఇచ్చిన హామీలు గాలిలోనే కలిసిపోయాయి. ఏనుగుల వల్ల ప్రాణష్టం జరిగితే బాధిత కుటుంబాలకు చెక్కులు ఇచ్చి ఫొటోలు దిగడం తప్ప మరే చర్యలు తీసుకోలేదు. గతంలో మక్కువ మండలం జంతికొండ ప్రాంతంలో ఏనుగుల జోన్ ఏర్పాటు చేసేందుకు అటవీశాఖ గుర్తించింది. అయితే స్థానికంగా ఎదురైనా సమస్యల వల్ల అటవీశాఖాధికారులు ఏమీ చేయలేకపోయారు. ఆ తర్వాత పార్వతీపురం నియోజకవర్గం డోకిశిల ప్రాంతంలో జోన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినా.. అదీ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన్యం జిల్లాలో ఏనుగుల సమస్యపై దృష్టి సారించింది. ఎలిఫెంట్ జోన్ ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేసింది. దీంతో సీతానగరం మండలం గుచ్చిమి గ్రామ వద్ద ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. కుంకిల ద్వారా జిల్లాలో సంచరిస్తున్న గజరాజులను ఇకపై ఆ ప్రాంతానికి తరలించనున్నారు.
ఏయే పనులు చేశారంటే...
గుచ్చిమిలో ఏనుగులు బయటకు రాకుండా ఉండేందుకు ఎలిఫెంట్ ఫ్రూఫ్ ట్రెంచ్ ఏర్పాటు చేశారు. ట్రెంచ్ దాటుకుని అవి వెళ్లకుండా ముందస్తుగా ఐదు కిలోమీటర్లు పొడవున కందకాలు తవ్వారు. మొత్తంగా రెండెంచెల భద్రతను ఏర్పాటు చేశారు. వాటి కోసం మూడు షెడ్లను కూడా నిర్మించారు. అవి స్నానాలు చేసేందుకు వీలుగా స్విమ్మింగ్‌పూల్స్ మాదిరిగా నిర్మాణాలను చేపట్టారు. గజరాజులను అదుపులోకి తీసుకొచ్చేందుకు వీలుగా రెండు క్రాల్‌లను నిర్మించారు. వాటికి రాగిపిండితో ఆహారం తయారు చేసేందుకు వంటశాలను నిర్మించారు. గజరాజుల కోసం వెటర్నరీ కేర్ యూనిట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఏనుగులను పర్యవేక్షించే మావటీల కోసం నివాస గృహాల నిర్మాణాలను పూర్తి చేశారు.
మామిడి తోటల్లోనే సంచారం
సీతానగరం: సీతానగరం మండలం బూర్జ, చెల్లంనాయుడువలస గ్రామాల మధ్య మామిడి తోటల్లో గజరాజులు తిష్ఠ వేశాయి. గత రెండు రోజులుగా అవి అక్కడే ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రైతులు పంట పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. తక్షణమే ఈ ప్రాంత నుంచి వాటిని తరలించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కాగా మంగళవారం అటవీశాఖ అధికారి మణికంఠేష్ ప్రజలను అప్రమత్తం చేశారు. రాత్రి సమయంలో ఒంటరిగా బయట తిరగరాదని సూచించారు.
ఈ నెలలోనే వస్తాయి
జిల్లాకు ఈ నెలలోనే కుంకీ ఏనుగులు జిల్లాకు వస్తాయి. ఏనుగుల సంరక్షణ కేంద్రం పనులు పూర్తి చేశాం. మరో రెండు రోజుల్లో కల్వర్టు నిర్మాణం పూర్తవుతుంది.
- ప్రసూన, డీఎఫ్‌వో