koodarai in Ramatirtha రామతీర్థంలో ఘనంగా కూడారై
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:21 AM
koodarai in Ramatirtha రామతీర్థంలోని రామస్వామి వారి దేవ స్థానంలో కూడారై ఉత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ధనుర్మాసంలో అత్యంత ముఖ్యమైన, విశిష్టమైన వేడుక కూడారై. వైష్ణవ సంప్రదాయంలో అందులోనూ గోదాదేవి (ఆండాళ్) రచించిన తిరుప్పావై పాశురానికి సంబంధించిన వేడుకగా దీనిని ఆచరిస్తారు.
రామతీర్థంలో ఘనంగా కూడారై
స్వామికి 108 కలశలతో పాయసం నివేదన
నెల్లిమర్ల/బొబ్బిలి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రామతీర్థంలోని రామస్వామి వారి దేవ స్థానంలో కూడారై ఉత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ధనుర్మాసంలో అత్యంత ముఖ్యమైన, విశిష్టమైన వేడుక కూడారై. వైష్ణవ సంప్రదాయంలో అందులోనూ గోదాదేవి (ఆండాళ్) రచించిన తిరుప్పావై పాశురానికి సంబంధించిన వేడుకగా దీనిని ఆచరిస్తారు. కాగా ఈ రోజు భగవంతుడికి సమర్పించిన ప్రసాదం చాలా ప్రత్యేకత సంతరించుకుంది. బియ్యం, పాలు, బెల్లం, అధిక మొత్తంలో నెయ్యి పోసి ఈ పాయసాన్ని చేశారు. రామస్వామి దేవాలయంలో ప్రాతఃకాలార్చన, బాలభోగం అయిన తరువాత ఆస్తన మండపంలో కూడరై పాయసాన్ని 108 కలశాల్లో ఉంచి స్వామికి నివేదించారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వై.శ్రీనివాసరావు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
- ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బొబ్బిలి పట్టణంలోని వివిధ వైష్ణవాలయాల్లో కూడారై వెల్లుం (ప్రత్యేక ప్రసాద నివేదన) ప్రక్రియను ఘనంగా నిర్వహించారు. వేకువజామున ధనుర్మాస పూజలు, పల్లకీ సేవ ముగిసిన అనంతరం స్వామివారికి ప్రసాద నివేదన చేపట్టారు. స్థానిక రుక్మిణీసత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం తోటలో నీరాటోత్సవం (ఆండాళ్ అమ్మవారికి స్నానం), కూడూరై ప్రసాద నివేదన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.