ఒడిశాలో చంపేసి.. మరుపల్లిలో పాతిపెట్టి
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:31 PM
వారిది ఒడిశా.. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. వారిమధ్య గొడవ జరిగింది.
- సహజీవనం చేస్తున్న యువతితో గొడవ
- హత్య చేసి కారులో మృతదేహం తరలింపు
- సహకరించిన మేనల్లుడు
- నిందితుడి అరెస్టు
- మృతదేహాన్ని వెలికితీసిన ఒడిశా పోలీసులు
గజపతినగరం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): వారిది ఒడిశా.. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. వారిమధ్య గొడవ జరిగింది. అంతే ఆమెను చంపేశాడు. రాత్రివేళ కారులో మృతదేహాన్ని తీసుకువచ్చి గజపతినగరం మండలం మరుపల్లి గ్రామ పరిధిలోని మామిడి తోటలో పాతిపెట్టాడు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆ రాష్ట్ర పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు మరుపల్లిలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి ఒడిశాకు తరలించారు. ఈ వివరాలను గజపతినగరం ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. ఎస్‌ఐ వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా తునకల్ గ్రామానికి చెందిన అల్బీనా గరుడ (22) అనే యువతి బ్యూటీషియన్ చేసుకుంటూ జీనవం సాగిస్తుంది. ఈమె కోరాపుట్ జిల్లా దశవంతపూర్‌కు చెందిన మోహన్ కిల్లాతో గత రెండు సంవత్సరాలుగా సహజీవనం సాగిస్తుంది. మోహన్‌కు అప్పటికే ముగ్గురు భార్యలు ఉన్నారు. ప్రస్తుతం అల్బీనా మూడు నెలల గర్భిణి అని తెలిసింది. గత నెల 28న ఏమైందో గానీ మోహన్, అల్బీనా మధ్య గొడవ జరిగింది. దీంతో మోహన్ ఆమెను హత్య చేసి తన మేనల్లుడి సహాయంతో మృతదేహాన్ని కారులో గజపతినగరం మండలం మరుపల్లి తీసుకువచ్చాడు. ఇక్కడ పెట్రోల్‌బంక్ వద్ద గల మామిడి తోటలో గత నెల 29న రాత్రి మృతదేహాన్ని పాతిపెట్టి ఒడిశా వెళ్లిపోయాడు. ఈ నెల 1న అల్బీనా కనిపించడం లేదని దశవంతపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మృతురాలి తండ్రి బెనూధర్‌కు అనుమానం కలిగి తన కుమార్తెను మోహన్ హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మోహన్‌ను విచారించ గా నేరం ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశాన్ని చూపించాడు. ఒడిశా రాష్ట్రం సిమ్లిగూడ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ అజిత్‌తో పాటు రీజనల్ ఫోరెన్సిక్ అధికారులు వచ్చి మృతురాలి కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసేందుకు స్థానిక తహసీల్దార్ కె.భరత్‌కుమార్‌ను అనుమతులు కోరారు. ఆయన సమక్షంలో మృతదేహన్ని వెలికితీసి ఒడిశాకు తరలించినట్లు ఎస్‌ఐ కిరణ్‌కుమార్ నాయుడు తెలిపారు.