Killed Her for Pressuring Him to Marry! పెళ్లి చేసుకోమన్నందుకే కడతేర్చాడు!
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:29 AM
Killed Her for Pressuring Him to Marry! పాలకొండ మండలం జంపరకోట పంచాయతీ బర్న సీతంపేట గ్రామానికి చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి (32) హత్యకేసును పోలీసులు ఛేదించారు. పెళ్లి చేసుకోమన్నందుకే మరో యువతి, సోదరుడితో కలిసి ప్రేమించిన వాడే ఆమెను కడతేర్చినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.
మరో యువతి, సోదరుడితో కలిసి ప్రేమికుడి ఘాతుకం
గిరిజన యువత హత్య కేసును ఛేదించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన ఎస్పీ మాధవరెడ్డి
పాలకొండ, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): పాలకొండ మండలం జంపరకోట పంచాయతీ బర్న సీతంపేట గ్రామానికి చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి (32) హత్యకేసును పోలీసులు ఛేదించారు. పెళ్లి చేసుకోమన్నందుకే మరో యువతి, సోదరుడితో కలిసి ప్రేమించిన వాడే ఆమెను కడతేర్చినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. శుక్రవారం పాలకొండ పోలీస్ స్టేషనలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.
ఎం.సింగుపురం గ్రామానికి చెందిన రెడ్డి భువనేశ్వర్‌కు, బర్న సీతంపేట గ్రామానికి చెందిన బిడ్డిక ఉషారాణికి గత కొన్నేళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి వైసీసీ సర్కారు హయాంలో వలంటీర్లుగా పనిచేసేవారు. ఆ సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఇటీవల కాలంలో భువనేశ్వర్ వైఖరిలో మార్పు వచ్చింది. ఎం.సింగుపురం పీహెచ్‌సీలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్న వీరఘట్టం మండలం బొడ్లపాడుకి చెందిన తేగెల కృపారాణితో స్నేహంగా ఉంటున్నాడు. ఇది గమనించిన ఉషారాణి తనను పెళ్లి చేసుకోవాలని భువనేశ్వర్‌పై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఎలాగైనా ఉషారాణి అడ్డు తొలగించాలనుకున్న ఆ యువకుడు తొలుత ఈ విషయాన్ని కృపారాణికి చెప్పాడు. వారిద్దరూ కలిసి హత్యకు పథకం రచించారు. దీనిలో భాగంగానే ఈ నెల 5న శుక్రవారం ఉషారాణికి భువనేశ్వర్ ఫోన్ చేశాడు. ఒడిశా రాయగడ వెళ్లాలని చెప్పగా 6న శనివారం ఉదయం ఉషారాణి ఇంటి నుంచి బయలుదేరి డోలమడ సెంటర్‌కు వచ్చింది. భువనేశ్వర్ వరుసకు తమ్ముడైన అదే గ్రామానికి చెందిన తేజతో కలిసి కారులో అక్కడకు వచ్చాడు. వారంతా కలిసి కారులో కొద్ది దూరం ప్రయాణమయ్యారు. ఈ లోపుగా మత్తు మాత్రలు కలిపిన డ్రింక్‌కు ఉషారాణికి ఇవ్వడంతో కొద్దిగా తాగిన ఆమె వీరఘట్టం జంక్షన్ వద్ద వాంతులు చేసుకుంది. అక్కడ నుంచి ఎలాగోలా రాయగడ చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఉషారాణి భోజనం చేయడానికి నిరాకరించి.. మిగిలిన డ్రింక్‌ను తాగింది. దీంతో ఆమె పూర్తిగా మత్తులోకి చేరుకుంది. డోలమడకు తీసుకొచ్చి అక్కడ అంతం చేయాలని భువనేశ్వర్ యోచించాడు. ఉషారాణిని కాస్త మెలకువలోనే ఉండడంతో నవగాం జంక్షన్ వద్ద ఈ విషయాన్ని కృపారాణికి చెప్పాడు. దీంతో బొడ్లపాడు నుంచి ఆమె స్కూటీతో కారును వెంబడించి.. బూర్జ జంక్షన్ వరకూ వచ్చింది. అక్కడ స్కూటీని వదిలేసి.. అదే కారులో వారంతా పయనమయ్యారు. కొల్లివలసలో ఓ రియల్ ఎస్టేట్ ప్రదేశం వద్ద కారు ఆపారు. వారు ముగ్గురు కలిసి మత్తులో ఉన్న ఉషారాణికి శ్వాస ఆడకుండా చేశారు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత కారులో నారాయణపురం బ్రిడ్జివైపు వెళ్లారు. అక్కడ స్థానికులు ఉండడంతో మృతురాలి సెల్‌ఫోన్‌లో సిమ్‌ను తీసి పొదల్లో పడేశారు. వారు శ్రీకాకుళం పయనమవుతుండగా.. కారు అవసరం ఉందని యజమాని ఫోన్ చేయడంతో మృతదేహాన్ని ఆమదాలవలస దాటిన తర్వాత ఓ పెట్రోల్ బంకు వెనుక ఉన్న చెరువులో పడవేశారు. ఆ తర్వాత కారును శ్రీకాకుళంలో అప్పగించారు. భువనేశ్వర్, ఆయన సోదరుడు తేజ స్వగ్రామానికి చేరుకోగా.. కృపారాణి మాత్రం పాలకొండలో ఉండిపోయింది. అయితే దొరికిపోతామనే భయంతో కొద్దిసేపటి తర్వాత భువనేశ్వర్ తన సోదరుడు తేజతో కలిసి ఊరిలో మరొక వ్యక్తినుంచి కారును తీసుకొని మృతదేహం పడేసిన చోటుకు వెళ్లారు. ఉషారాణి మృతదేహాన్ని వాహనంలో ఎక్కించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. అయితే నీలంపేట రోడ్డు వద్ద ఉన్న సరిహద్దు సర్వే రాయిను తీసుకున్న వారు దానిని మృతదేహాన్ని కట్టి పాలకొండ కాంప్లెక్స్ వెనుక ఉన్న చెరువులో పడేయాలని చూశారు. అయితే స్థానికుల సంచారం ఉండడంతో వీలుపడలేదు. తంపటాపల్లి జంక్షన్ నుంచి చింతాడ రహదారిలో ఉన్న తుమరాడ గ్రామ కామినాయుడు చెరువు వద్దకు చేరుకున్నారు. ఉషారాణి మృతదేహం కాళ్లు, చేతులను తాళ్లతో కట్టి.. ఆ తర్వాత సర్వేరాయిను కట్టి చెరువులో పడేసి 7న ఆదివారం తెల్లవారుజామున వారు ఇంటికి వెళ్లారు.
తండ్రి ఫిర్యాదుతో..
ఉషారాణి తండ్రి బిడ్డిక చిన్నారావు ఈ నెల 10న తన కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాయంత్రం 4.30 గంటల సమయంలో కామినాయుడు చెరువులో ఓ మహిళ మృతదేహం ఉన్నట్టు పోలీసులు గుర్తించి ఉషారాణి తండ్రికి సమాచారం అందించారు. ఈ మృతదేహం తన కుమార్తెదేనని, అక్కడ ఉన్న ఆనవాళ్లు చూసి ఎవరో హత్య చేశారని పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి ఈ కేసును ఛేదించినట్టు ఎస్పీ తెలిపారు. నిందితులను శుక్రవారం సాయంతం నాలుగు గంటల సమయంలో అరెస్టు చేశామన్నారు. స్థానిక గాయత్రమ్మ గుడి వద్ద తనిఖీలు చేపడుతుండగా.. ఒక వాహనం వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తుండడంతో పోలీసులు ఆ కారుని విచారించడంతో నిందితులు నేరం ఒప్పుకున్నారన్నారు. యువతికి హత్యకు తామే బాధ్యులమని చెప్పారని వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామన్నారు. డీఎస్పీ ఎం.రాంబాబు, సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐ వెంకన్నలు గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నట్టు తెలిపారు.